ETV Bharat / state

కొత్త సంవత్సరంలో రాజముద్రతో పట్టాదారు పాస్‌పుస్తకాలు - జనవరి 2 నుంచి ఉచితంగా పంపిణీ

గ్రామ సభల్లో పంపిణీ చేసేందుకు రెవెన్యూ శాఖ చర్యలు - గతంలో ఇచ్చిన 21.86 లక్షల భూహక్కు పత్రాల స్థానంలో కొత్త పాస్‌ పుస్తకాలు

New Pattadar Passbook in AP
New Pattadar Passbook in AP (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 27, 2025 at 10:31 AM IST

3 Min Read
Choose ETV Bharat

New Pattadar Passbook in AP: కొత్త సంవత్సరంలో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అందనున్నాయి. 2026 జనవరి 2 నుంచి 9 వరకు ఊరూరా గ్రామసభలు నిర్వహించనున్నారు. పాస్​ పుస్తకాలు పంపిణీ చేసేందుకు ఇప్పటికే రెవెన్యూ శాఖ చర్యలు ప్రారంభించింది. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగన్‌ బొమ్మలతో పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇచ్చింది. దీనిపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఇచ్చిన 21.86 లక్షల భూహక్కు పత్రాల (BHP) స్థానంలో రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలు (PPB) పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు రూ.22.50 కోట్లు నిధులను కూడా విడుదల చేసింది.

గ్రామసభల ద్వారా అందజేత: కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల ముద్రణ పూర్తయినా పంపిణీ కార్యక్రమం 8 నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ జాప్యం కారణంగా రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ముద్రణ పూర్తైన పట్టాదారు పాస్‌పుస్తకాల్ని సత్వరమే రైతులకు అందించాలని ఇటీవల కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆ మేరకు రెవెన్యూ శాఖ గ్రామ సభల ద్వారా పంపిణీకి కార్యాచరణ రూపొందించింది. పట్టాదారు పాసుపుస్తకాలను జనవరి 2 నుంచి 9 వరకు పంపిణీ చేయనున్నారు. ఇందుకుగానూ రెవెన్యూ శాఖ గ్రామ సభలు నిర్వహించాలి.

ఈకేవైసీ ద్వారా ధ్రువీకరణ: పట్టాదారుల వివరాల్ని వెబ్‌ల్యాండ్‌లోని వివరాల ప్రకారం సరిపోల్చి చూసి ఎలాంటి తప్పులు లేని పాస్‌పుస్తకాలు అందజేయాలి. వేలిముద్ర ద్వారా సంబంధిత పట్టాదారుకు కొత్త పుస్తకాలు అందించేలా చూడాలి. ఇందుకోసం అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచాలి. పంపిణీ ప్రక్రియ వీఆర్వో ఆన్‌లైన్‌ ఈకేవైసీ ద్వారా నిర్వహించాలి. పుస్తకాలు అందాయంటూ లబ్ధిదారులతో సంతకాలు తీసుకోవాలి.

ఇది ఒక రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలి. పాత భూహక్కు పత్రాలు వెనక్కి తీసుకోవాలి. రీసర్వే చేసిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలి. పారదర్శక పంపిణీలో భాగంగా నిర్ణయించిన తేదీ వివరాలు, సమయాలపై సంబంధిత ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, ఇతర భాగస్వాములకు ముందే తెలియజేయాలి. జిల్లాల వారీ షెడ్యూల్‌ కార్యక్రమాల వివరాల్ని డిసెంబరు 30లోగా సీసీఎల్‌ఏ కార్యాలయానికి పంపాలి.

తప్పులు సరిదిద్దితే మేలు: ముద్రణ పూర్తైన పట్టాదారు పాస్‌పుస్తకాల్లో చాలా తప్పులు దొర్లాయి. వెబ్‌ల్యాండ్‌లో ఉన్న వాటినే ముద్రించారు. చనిపోయిన రైతుల పేర్లతోనూ పుస్తకాలు వచ్చాయి. ఫోన్, ఆధార్‌ నంబర్లతో పాటు రైతుల పేర్లు, తల్లిదండ్రులు, భర్త పేర్లలోనూ అక్షర దోషాలు ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో అయితే పంపిణీ చేయాల్సిన మొత్తం పుస్తకాల్లో సగానికి పైగా తప్పులే ఉన్నట్లు ప్రజాప్రతినిధులు కూడా పేర్కొంటున్నారు.

ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి కూడా వచ్చింది. ప్రభుత్వం వీటిపైనా అధికారులకు దిశానిర్దేశం చేయడంతో పాటు లబ్దిదారుల ఆధార్, ఇతర వివరాల్ని పరిశీలించి పుస్తకాల్లోని తప్పుల్ని అక్కడికక్కడే సరిదిద్దేలా తహసీల్దార్లకు ఆదేశాలు ఇవ్వాలి. ఎల్‌పీ (ల్యాండ్‌ పార్సెల్‌), విస్తీర్ణం, చనిపోయిన పట్టాదారుల స్థానంలో వారసులకు పంపిణీకి సంబంధించిన ప్రక్రియ నిర్దేశిత సమయంలో పూర్తి చేసేలా చూడాలి.

మరోవైపు గతంలో రెవెన్యూ రికార్డులను వెబ్‌ల్యాండ్‌లోకి నమోదు చేసే సమయంలో రైతులకు ఒక పత్రం ఇచ్చారు. అందులో భూ యజమానుల పేర్లు, సర్వే నంబరు, సబ్‌ డివిజన్, విస్తీర్ణం, ఎలా సంక్రమించింది? భూ స్వభావం తదితర వివరాలు అన్నింటిని ముద్రించారు. తప్పులు ఉంటే సరిచేసి ఇవ్వాలని కోరారు. పత్రాలపై రైతుల సంతకాలు తీసుకున్నాకే వెబ్‌ల్యాండ్‌లో రిజిస్ట్రేషన్ చేశారు. అయితే అధికారుల వద్ద ఉన్న రీసర్వే రికార్డులు, సమాచారం ప్రకారమే పట్టాదారు పాస్‌పుస్తకాలు ముద్రించారు. అందుకే పెద్ద ఎత్తున తప్పులు దొర్లాయని చెబుతున్నారు.

రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు - అందులో 50 శాతం తప్పులే!

రాజముద్రతో భూమి పట్టాదారు పాసు పుస్తకాలు- స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు