ETV Bharat / state

రాష్ట్రంలో 'ఆ మందు'పై నిషేధం - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

'పారాక్వాట్‌ డీక్లోరైడ్‌' పై నిషేధం ప్రకటించిన ప్రభుత్వం - తక్షణమే అమలు!

ban_on_paraquat_dichloride
ban_on_paraquat_dichloride (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2026 at 10:59 AM IST

|

Updated : May 23, 2026 at 11:40 AM IST

2 Min Read
Choose ETV Bharat

AP Govt Ban on Paraquat Dichloride : గడ్డిమందు (పారాక్వాట్‌ డీక్లోరైడ్‌ 24% ఎస్‌ఎల్‌) పై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మందు తయారీ, నిల్వలు, సరఫరా, విక్రయాలపైనా రెండు నెలల పాటు నిషేధం ప్రకటిస్తూ 421 జీవో విడుదల చేసింది. వరి, పత్తి, మొక్కజొన్న చేలల్లో చెరువులు, కాల్వల్లో గుర్రపు డెక్క లాంటి కలుపు నివారణకు ఉపయోగించే ఈ మందు అనేక దుష్ర్పభావాలు కలిగి ఉంది. రైతులు, ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన ఈ మందును అన్ని రూపాల్లోనూ నిషేధిస్తున్నట్లు వ్యవసాయశాఖ ఎక్స్‌అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 'గడ్డి మందు' తయారీదారులు, పంపిణీదారులు, డీలర్లు, రిటెయిలర్లు వెంటనే నిషేధం అమలు చేయాలని, ఈ మేరకు వ్యవసాయశాఖ కమిషనర్, జిల్లాల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

"హైదరాబాద్ టు తిరుపతి" - గుంటూరు వెళ్లకుండానే నల్లగొండ, కడప మీదుగా నయా ట్రైన్!

వ్యవసాయ రంగంలో విరివిగా వినియోగించే గ్రామోక్సోన్, ఫైర్‌స్టార్మ్, పారాజోన్, హెల్మ్‌క్వాట్, స్పీడీ మందు రకాల్లో పారాక్వాట్ డైక్లోరైడ్ వాడుతారు. పారాక్వాట్‌ డీక్లోరైడ్‌ 24% ఎస్‌ఎల్‌ మందుపై నిషేధం ఇప్పటికే తెలంగాణలో అమలులో ఉంది. ఒడిశాలోనూ నిషేధం దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించిన నేపథ్యంలో నిషేధం తాత్కాలికంగా కాకుండా పూర్తిస్థాయిలో అమలు చేయాలని పలువురు పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.

అత్యంత విషపూరితం, వ్యాధులకూ అవకాశం

పారాక్వాట్‌ డీక్లోరైడ్‌ మందును గ్రామీణ ప్రాంతాల్లో గడ్డిమందు అంటుంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైన గడ్డి సంహారిణి కాగా, గ్రామీణ, వ్యవసాయాధారిత ప్రాంతాల్లో దీని కారణంగా మరణాల రేటు పెరుగుతోందని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మందు ఉపయోగించే సమయంలో శ్వాస, స్వేద గ్రంథుల ద్వారా తక్కువ పరిమాణంలో శరీరంలోకి చేరినా ప్రాణాంతకంగా మారుతుందని తేల్చారు. ఈ మందు బారిన పడిన వారికి చికిత్స అందించడం కష్టమని, ఎలాంటి విరుగుడు లేదని వైద్య నివేదికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో వైద్యఆరోగ్యశాఖ పారాక్వాట్‌ డీక్లోరైడ్‌ మందును నిషేధించాలని కోరింది. ఈ మేరకు విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాల ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ ఇచ్చిన నివేదికల్ని జతపరచింది.

పారాక్వాట్‌ డీక్లోరైడ్‌ విషపూరితం కావడంతో రైతులు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇదిలా ఉండగా క్షణికావేశంలో ఆత్మహత్యకు యత్నిస్తున్న వారు సైతం గడ్డి మందు సేవించడం ఆందోళన కలిగిస్తోంది. ఇతర మందులు సేవిస్తే చికిత్సకు అవకాశం ఉంటుంది. కానీ, గడ్డి మందు తాగిన వారు కొద్దిసేపటికి మరణిస్తున్నారని, ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పలు ఘటనల్ని డీజీపీ ప్రస్తావించారు. ఈ మందు నిషేధానికి చర్యలు తీసుకోవాలని కోరిన నేపథ్యంలో వ్యవసాయశాఖ నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది.

పారాక్వాట్‌ డీక్లోరైడ్‌ మందు దుష్ప్రభావాల్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మందు ప్రభావంతో కిడ్నీలు దెబ్బతినడంతోపాటు ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయని, మెదడులోని నాడీ వ్యవస్థను దెబ్బతీసే పార్కిన్సన్స్‌ వ్యాధికి కారణమవుతున్నట్లు పరిశోధనల్లోనూ తేలింది.

ఈ పండు తింటే బాడీ స్ప్రే అవసరం లేదు! - శరీరమంతా సువాసన!

అగ్నిగుండంలా రాష్ట్రం - నిన్న 4 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గడంతో కాస్త ఊరట

Last Updated : May 23, 2026 at 11:40 AM IST