బీసీలపై దాడులకు పాల్పడితే ఐదేళ్లు జైలు శిక్ష - ముసాయిదా రూపకల్పన
రాష్ట్రంలో బీసీలపై దాడులకు పాల్పడితే 6 నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష - ముందస్తు బెయిల్ రాదు - రెండు నెలల్లోనే కేసులు పరిష్కారం - విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 2, 2026 at 7:35 AM IST
Those who Attack Backward Castes Will Face Imprisonment: ఎస్సీ, ఎస్టీల తరహాలోనే రాష్ట్రంలో బీసీలకు రక్షణ కల్పించేలా ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టానికి ముసాయిదా సిద్ధమైంది. బీసీలపై దాడులకు పాల్పడితే ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా నిబంధనలు రూపొందించింది. ప్రస్తుతం న్యాయశాఖ పరిశీలనలో ఉన్న ఈ ముసాయిదా అక్కడి నుంచి కేబినెట్ ముందుకు, ఆ తర్వాత అసెంబ్లీ ఆమోదానికి వెళ్లనుంది.
బీసీలపై సామాజిక బహిష్కరణ, దాడులు, దూషణలు, వేధింపులు, ఇతర అఘాయిత్యాలకు పాల్పడితే 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించనున్నారు. 2వ సారి లేదా తదుపరి అదే నేరానికి పాల్పడితే (మళ్లీ దోషిగా తేలితే) కనీసం ఏడాది నుంచి 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఈ శిక్షను న్యాయస్థానం మరింత పెంచే వీలుంది.
బీసీలపై వేధింపు (ఎట్రాసిటీ)లకు సంబంధించిన కేసుల్లో ముందస్తు బెయిల్ పొందేందుకు అవకాశం ఉండదు. ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ మేరకు ‘బీసీ రక్షణ చట్టం’ అమలు దిశగా ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. ప్రస్తుతం ఇది న్యాయశాఖ సమీక్షలో ఉంది. తదనంతరం మంత్రివర్గ ఆమోదం తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టి చట్టంగా మార్చనున్నారు.
ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు: బీసీలపై ఎట్రాసిటీ కేసుల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేలా ముసాయిదా చట్టంలో పేర్కొన్నారు. అవసరమైతే సెషన్స్ కోర్టును ప్రత్యేక న్యాయస్థానంగా నియమించనున్నారు. ఛార్జిషీట్ దాఖలు నుంచి 2 నెలల్లోనే కేసు పరిష్కరించే లక్ష్యంగా చట్టాన్ని రూపొందించారు. ప్రత్యేక కోర్టులో న్యాయం జరగలేదని భావిస్తే, తీర్పు వెలువడిన 90 రోజుల్లో హైకోర్టును ఆశ్రయించవచ్చు. గరిష్ఠంగా 180 రోజుల వరకు అవకాశం కల్పించారు. ఈ చట్టం కింద కేసుల నిర్వహణకు 7 ఏళ్ల అనుభవం ఉన్న న్యాయవాదుల్ని నియమిస్తారు.
సమూహ జరిమానాకు అధికారం
- సమూహ జరిమానా విధించే అధికారం పౌరహక్కుల చట్టం-1955లోని సెక్షన్ 10ఏ ప్రకారం ఉంటుంది.
- అఘాయిత్యాలకు అవకాశం ఉండే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకుంటారు.
- ఈ చట్టానికి విరుద్ధమైన ఇతర చట్టాలపై ఇది పై చేయి సాధిస్తుంది.
- సదుద్దేశంతో చేసే చర్యలకు రక్షణ సైతం ఉంటుంది.
ఫిర్యాదులు స్వీకరించకుంటే జైలే:-
- బీసీ వ్యక్తులపై అభియోగాలు వచ్చినప్పుడు, ఆ వ్యక్తికి మరణ దండన లేదా జీవిత ఖైదు శిక్ష పడేలా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సాక్ష్యం సృష్టించిన వారికి జీవిత ఖైదుతో పాటు జరిమానా విధిస్తారు.
- బీసీలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదుల నమోదు చేశారు. ఆ తర్వాత ఎఫ్‌ఐఆర్ కూడా అందజేస్తారు. కేవలం 60 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు, విచారణ ప్రక్రియలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసిన ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా కనీసం 6 నెలల నుంచి గరిష్ఠంగా సంవత్సరం పాటు జైలు శిక్ష, జరిమానా విధించేలా ముసాయిదా చట్టంలో పొందుపరిచారు.
సాక్షులకు ప్రభుత్వమే రక్షణగా: బీసీలపై దాడులు, ఎట్రాసిటీ కేసుల విచారణ సందర్భంగా బాధితులకు, సాక్షులకు ప్రభుత్వమే రక్షణ కల్పిస్తుంది. దర్యాప్తు, విచారణ, ట్రయల్ సమయంలో ప్రయాణ, పోషణ ఖర్చులు కూడా అందిస్తుంది. అదే విధంగా వారికి సామాజిక, ఆర్థిక పునరావాసం కల్పిస్తుంది. బాధితులకు ఏ విధంగా అండగా ఉంటున్నదీ ఎప్పటికప్పుడు న్యాయస్థానానికి ప్రభుత్వం తెలియజేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇస్తున్న రక్షణ, భరోసా సరిపోతుందో లేదో కోర్టు కాలానుగుణంగా సమీక్షిస్తుంది. దీనికి తగిన విధంగా ఉత్తర్వులు సైతం జారీ చేస్తుంది.
ఎట్రాసిటీ కిందకు వచ్చేవి ఏంటేంటే?
భయపెట్టడం, బహిరంగంగా అవమానించడం లేదా ఇతరుల సమక్షంలో బీసీలను కులం పేరుతో అవమానకర పదాలు లేదా సంకేతాలతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం, తక్కువ చేయడం.
బహిష్కరణ: ఆర్థిక వ్యవహారాలు, వ్యాపారాలు నిరాకరించడం, ఉపాధి లేదా సేవలకు నిరాకరించడం, సామాజిక బహిష్కరణకు గురి చేయడం.
ప్రజాసేవల్లో వివక్ష: విద్య, ఆరోగ్యం, ప్రజా వనరులు, గృహవసతి కల్పనకు, ప్రభుత్వ ఉద్యోగాలకు కులం ఆధారంగా నిరాకరించడం.
అక్రమ గెంటివేత: చట్టబద్ధ అధికారం లేదా పరిహారం లేకుండా నివాసం లేదా భూమి నుంచి బలవంతంగా తొలగించడం.
లైంగిక వేధింపులు, దాడులు: ప్రభుత్వ సేవలు లేదా పథకాలు అందకుండా అడ్డుకోవడం. దాడి చేయడం లేదా శారీరక గాయం కలిగించడం.
- మహిళలపై లైంగిక వేధింపులు లేదా దాడులకు పాల్పడటం.
- హాని చేయాలనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టడం.
- కులం ఆధారంగా నివాస విభజనను అమలు చేయడం.
- భూమి, పంటలు, పశువులు తదితరాలను ఆక్రమించడం.
- నివాసం, జీవనోపాధి, పంటలు దెబ్బతీయడం.
- మత, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొననీయకపోవడం.
బహిరంగ ప్రదేశాల్లో అడ్డంకులు: రహదారులు, బావులు, ఘాట్లు, శ్మశానాలు, ఆలయాలు వంటి ప్రదేశాల వినియోగాన్ని నిరోధించడం. అక్కడికి ప్రవేశాన్ని అడ్డుకోవడం.
ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగం పెంచాలి - మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశం
బీసీ, ఎస్సీలకు 57 శాతం పార్టీ పదవులు - యువత, మహిళలకు అత్యధిక ప్రాధాన్యం

