ETV Bharat / state

నేపాల్‌ వరదలు - ఏపీ యాత్రికుల ఆచూకీపై మంత్రి లోకేశ్‌ ఆరా

నేపాల్ వరదలపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం - రాష్ట్రానికి చెందిన యాత్రికుల క్షేమ సమాచారంపై లోకేశ్ సమీక్ష - సురక్షితంగా ఉన్న యాత్రికులను వెంటనే తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం

Nepal Flash Flood Hit Updates
ఏపీ యాత్రికుల ఆచూకీపై మంత్రి లోకేశ్‌ ఆరా (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 27, 2026 at 4:43 PM IST

3 Min Read
Choose ETV Bharat

Nepal Flash Flood Hit Updates : నేపాల్‌ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. టిబెట్ సరిహద్దుల్లోని భోటేకోషీ నదిలో సంభవించిన మెరుపు వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఎటుచూసినా బురద, శిథిలాల కుప్పలే దర్శనమిస్తున్నాయి. రోడ్లు, వంతెనలు, అద్భుతమైన కట్టడాలు ఆనవాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. వరదల ధాటికి జలవిద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో వేల మంది గల్లంతుకాగా, వందల మంది మరణించారు. గల్లంతైన వారిలో భారతీయులతో పాటు విదేశీయులు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే నేపాల్ ఆర్మీతో పాటు విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టాయి.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం అప్రత్తమైంది. నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల క్షేమ సమాచారంపై మంత్రి నారా లోకేశ్‌ సమీక్షించారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏడుగురు ఏపీ యాత్రికుల పరిస్థితిపై ఆరా తీశారు. నలుగురు సురక్షితంగా ఉన్నారని, మరో ముగ్గురి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని దిల్లీలోని ఏపీ భవన్ అధికారులు లోకేశ్‌కు వివరించారు. కుప్పం ప్రాంతానికి చెందిన బాల సుబ్రమణ్యం, ఈశా ఫౌండేషన్ గ్రూప్‌నకు చెందిన శశికుమార్, రాజ్యలక్ష్మి ఆచూకీ లభ్యం కాలేదని పేర్కొన్నారు. గల్లంతైన ముగ్గురి ఆచూకీ వీలైనంత త్వరగా గుర్తించేందుకు కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని లోకేశ్‌ ఆదేశించారు.

Lokesh on Nepal Flash Floods : చైనాలోని గైరోంగ్ ఎంబసీ వద్ద ఈషా ఫౌండేషన్ సభ్యుడు శశికుమార్ చివరిసారిగా కనిపించినట్లు అధికారులు లోకేశ్​కు విరించారు. మరోవైపు కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న కర్నూలు జిల్లాకు చెందిన భాస్కరశాస్త్రితో పాటు మరో ముగ్గురు సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. సురక్షితంగా ఉన్న యాత్రికులను వెంటనే తరలించేందుకు చర్యలు తీసుకోవాలని లోకేశ్ అధికారులకు ఆదేశాలిచ్చారు యాత్రికుల భద్రతపై భారత రాయబార కార్యాలయం, చైనా, నేపాల్ ఎంబసీలు, గైరోంగ్ ఇమిగ్రేషన్ సెంటర్, ఈషా ఫౌండేషన్ సంస్థలతో నిరంతరం సమన్వయం కొనసాగించాలని సూచించారు. మంత్రి లోకేశ్‌ ఆదేశాల మేరకు నేపాల్‌లో చిక్కుకున్న యాత్రికులు, మానస సరోవర యాత్రకు వెళ్లిన ఏపీ వాసుల సమాచారాన్ని ఆర్టీజీఎస్ అధికారులు ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పరిస్థితిని ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

మరోవైపు కైలాస మానససరోవర యాత్రలో ఉన్న కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన నలుగురు ఏపీ యాత్రికులు చైనాలోని ఓ హోటల్‌లో సురక్షితంగా ఉన్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రహదారులు దెబ్బతినడంతో రవాణా సదుపాయాలు నిలిచిపోయాయని చెప్పారు. మరోవైపు ప్రకాశం జిల్లాకు చెందిన సుహాసినిరెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన రమేశ్​బాబు, కాకినాడ జిల్లాకు చెందిన మరో ఇద్దరు పర్యాటకులతో పాటు బాలసుబ్రహ్మణ్యం ఆచూకీ వివరాలు తెలియాల్సి ఉందని కొండప్లలి శ్రీనివాస్ వివరించారు.

Nepal Flood Updates : ఈ మేరకు ఏపీ ఎన్ఆర్టీ అధికారులు యాత్రికులతో నిరంతరం మాట్లాడుతున్నారని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. యాత్రికుల వివరాలను నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయానికి వారు అందించారని చెప్పారు. నేపాల్‌లో అత్యవసర సహాయ, పునరుద్ధరణ చర్యలు ప్రారంభమయ్యాయని అక్కడి నుంచి క్లియరెన్స్ రాగానే యాత్రికుల తరలింపునకు ఏర్పాట్లు చేస్తామన్నారు.

అదేవిధంగా నేపాల్, చైనా సరిహద్దుల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికుల భద్రతపై మంత్రి నారా లోకేశ్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆర్టీజీఎస్ ద్వారా పరిస్థితులను సమీక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పారు. యాత్రికులు సురక్షితంగా స్వస్థలాలకు చేరేలా నేపాల్ అధికారులు, భారత ఎంబసీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు.

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల గురించి హోంమంత్రి అనిత ఆరా తీశారు. వారి క్షేమ సమాచారం తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు దిల్లీలోని ఏపీ భవన్, విదేశాంగశాఖతో పాటు నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని సూచించారు. నేపాల్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్​ యాత్రికులను క్షేమంగా తీసుకొస్తామని అనిత చెప్పారు.

సహాయం కోసం సంప్రదించాల్సిన నంబర్లు :

  • దిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సహాయం కోసం ఏపీ భవన్ కంట్రోల్ రూమ్‌ 011-23384016, 011-23387089 నంబర్లను, వాట్సాప్ 9059824101ను సంప్రదించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
  • అదేవిధంగా నేపాల్‌లోని భారత ఎంబసీ అత్యవసర సహాయానికి సంప్రదించాల్సిన నంబర్లను ఇచ్చింది. సహాయం అవసరమైనవారు +977 985 131 6807, +977 970 910 7500 నంబర్లలో సంప్రదించాలని సూచించింది. నేపాల్‌ పర్యాటకశాఖ అత్యవసర నంబర్: +977 985 128 9445

నేపాల్ వరదలపై అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం - ఏపీ యాత్రికుల ఆచూకీపై ఆరా

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి - అప్రమత్తమైన అధికారులు