ETV Bharat / state

ఉగాదికి మరో డీఎస్సీ - పాఠశాల విద్యాశాఖ కసరత్తు

మరో డీఎస్సీ ప్రకటించేందుకు సిద్ధమైన ‍‌కూటమి ప్రభుత్వం - ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ఇటీవల మంత్రి లోకేశ్‌ హామీ - లోకేశ్​ హామీ మేరకు డీఎస్సీ నోటిఫికేషన్‌కు కసరత్తు

AP Government DSC for Ugadi to fill up to 3600 Teacher Posts
AP Government DSC for Ugadi to fill up to 3600 Teacher Posts (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 19, 2026 at 8:12 AM IST

3 Min Read
Choose ETV Bharat

DSC for Ugadi to fill up to 3600 Teacher Posts : కూటమి ప్రభుత్వం మరో డీఎస్సీ ప్రకటించేందుకు సిద్ధమైంది. ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని ఇటీవల విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ఈ మేరకు డీఎస్సీ నోటిఫికేషన్​కు ప్రణాళిక సిద్ధం చేసింది. తెలుగు సంవత్సరాది ఉగాది పండగ సందర్భంగా ఉపాధ్యాయ నియామకాలకు ప్రకటన విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఇప్పటికే కేత్రస్థాయి నుంచి ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ సేకరించింది. అన్ని రకాల పోస్టులు కలిపి 3 వేల 600 వరకు ఉండే అవకాశం ఉండనుంది. ఇందుకుగానూ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్లు, ఆదర్శ పాఠశాలలు, సంక్షేమ శాఖలకు చెందిన పాఠశాలల నుంచి ప్రాథమికంగా వివరాలు సేకరించారు.

వీటి అన్నింటిలో కలిపి 1,200 వరకు ఖాళీలు రానున్నాయి. వీటితో పాటు ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీరాజ్, పురపాలక పాఠశాలల్లో 1,700 పోస్టులు ఉంటాయి. 700 వరకు ప్రత్యేక విద్యా పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. గతేడాది ఏప్రిల్​లో 16,347 పోస్టులకు ప్రకటన ఇచ్చారు. వీటిలో 15,941 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. కొన్ని పోస్టులకు రిజర్వేషన్ల అభ్యర్థులు లేకపోడం వల్ల అవి మిగిలి పోయాయి.

సిలబస్​లో ఎలాంటి మార్పు లేదు: ఉగాదికి ఇచ్చే డీఎస్సీ సిలబస్​లో మార్పులు ఏవీ చేయడం లేదని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. గత సంవత్సరం డీఎస్సీకి ఇచ్చిన సిలబస్, మార్గదర్శకాలనే ఈసారి కూడా విద్యాశాఖ అమలు చేయనున్నారు. వాటిలో ఏ విధమైన మార్పులు, చేర్పులు చేయలేదు. ప్రత్యేక డీఎస్సీకి సంబంధించిన సిలబస్​ను ఇప్పటికే సంబంధిత వెబ్​సైట్​లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచారు. అన్ని పోస్టులకు కూడా ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యం పరీక్ష, కంప్యూటర్ ప్రావీణ్యం పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ తొలుత భావించింది. కానీ వాటి నిర్వహణకు సమయం లేకపోవడం చేత ఈ ఆలోచనను వాయిదా వేశారు.

ప్రత్యేక డీఎస్సీలో ఒప్పంద టీచర్లకు వెయిటేజీ?

రాష్ట్రంలో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు చదువుతున్న పాఠశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు పని చేస్తున్నారు. రాష్ట్రంలో వీరు సుమారు 2,600 మంది వరకు ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారిలో అన్ని అర్హతలు కూడా ఉన్నప్పటికీ దాదాపు 800 మందికి మాత్రమే మినిమం టైం స్కేల్ అమలు చేయనున్నారు. 10 ఏళ్ల సర్వీసు, టెట్​ లాంటి అర్హతలు నిర్ణయించారు. ఈ అర్హతలు సాధించిన వారికి మాత్రమే మినిమం టైం స్కేల్ అనేది అమలు చేయాలని భావిస్తున్నారు. పర్మినెంట్ ఉద్యోగం కోసం వీరూ డీఎస్సీ రాయాల్సి ఉంటుంది. ప్రత్యేక డీఎస్సీలో వీరికి వెయిటేజీ ఇవ్వడం పై అధికారులు ఇప్పుటికే ఆలోచన చేస్తున్నారు.

గతేడాది మంత్రి నారా లోకేశ్‌ తన పాఠశాల విద్య, ఇంటర్మీడియట్‌, కళాశాల విద్య ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి ఏటా డీఎస్సీ ద్వారా టీచర్‌ పోస్టుల భర్తీకి ఇచ్చిన హామీని ప్రభుత్వం కట్టుబడి కొనసాగిస్తుందని వెల్లడించారు. గతేడాది నవంబర్‌ టెట్ నిర్వహించగా, 2026 జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్‌, మార్చిలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. టెట్‌, డీఎస్సీలకు అభ్యర్థులంతా సన్నద్ధం కావాలిని అన్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళికను అమలు చేస్తామని వెల్లడించారు. అదనంగా స్పెషల్‌ డీఎస్సీ కూడా నిర్వహిస్తామని లోకేశ్ తెలిపారు.

డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త - 2026 జనవరిలో నోటిఫికేషన్‌, మార్చిలో పరీక్షలు

ప్రతి ఏడాది డీఎస్సీ - నిరుద్యోగులు ప్రిపేర్‌ అవుతూ ఉండాలి: సీఎం చంద్రబాబు