రాష్ట్ర పండుగగా పైడితల్లి అమ్మవారి జాతర - ప్రకటించిన ప్రభుత్వం
రాజాంలోని శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు - ఉత్సవాల కోసం రూ.50 లక్షల నిధుల మంజూరు - తదుపరి చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ కమిషనర్‌కు ఆదేశం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 19, 2026 at 6:38 PM IST
AP Govt Declared Paiditalli Ammavari Jatara as State Festival: ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పేరొందిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతరను రాష్ట్ర ఉత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జీవో విడుదల చేసిందని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అన్నారు. రాజాం పట్టణంలో పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీను అమ్మవారి వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే ఈ జాతరను రాష్ట్ర పండుగ ప్రకటించడంతో యాత్ర 3 రోజుల పాటు అధికారిక ఉత్సవాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ మేరకు రూ.50 లక్షలు నిధులు కూడా మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
1926లో అమ్మవారి ఆలయ నిర్మాణం జరిగిందని 100 ఏళ్ల పండగ కావడంతో ప్రభుత్వం రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించడం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబుకు, ఎమ్మెల్యే మురళీమోహన్‌కు పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ నెల 22న ప్రారంభమయ్యే యాత్ర మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే పట్టణంలో విద్యుత్ దీపాల అలంకరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మూడు రోజులపాటు పౌరాణిక నాటకాలు, పలు సంస్కృతి కార్యక్రమాలు, సినీ బుల్లితెర నటులతో కార్యక్రమాలను కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ జాతరలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని నిత్యం పర్యవేక్షణ చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
అసలు ఎవరీ పైడితల్లి?: ఉత్తరాంధ్ర ప్రజల కల్పవల్లి పైడితల్లి అమ్మవారు గజపతుల వంశానికి చెందిన ఆడపడుచు. చారిత్రక ఆధారాల ప్రకారం 18వ శతాబ్దంలో విజయనగరం రాజు బొబ్బిలి రాజుతో యుద్ధం సాగింది. ఆ సమయంలో రాజు సోదరి పైడిమాంబ (పైడితల్లి) మశూచి వ్యాధితో బాధపడుతుండగా, యుద్ధంలో తన అన్న విజయ రామరాజు మరణించిన వార్త విని ఆమె దుఃఖంతో ప్రాణాలు విడిచారు.
తర్వాత ఆమె ఒక సైనికుడు పతివాడ అప్పలనాయుడికి స్వప్నంలో దర్శనమిచ్చి, తన విగ్రహాన్ని ఆ ప్రాంతంలోని సరస్సు దగ్గర కనుగొని ప్రతిష్ఠించాలని ఆదేశించింది. అలా నిర్మించిన ఆలయంలో పైడితల్లి అమ్మవారి పూజలు, ఉత్సవాలు నేటికీ నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఇందులో సిరిమానోత్సవం అత్యంత విశిష్టమైనదిగా, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా భావిస్తారు. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు విజయనగరానికి చేరి పైడిమాంబ దర్శనం తీసుకుంటారు. సిరిమానోత్సవం ఉత్తరాంధ్ర సంస్కృతికి ప్రతీక.
ఘనంగా సిరిమానోత్సవం - పైడిమాంబ నినాదాలతో మారుమోగిన వీధులు
పైడితల్లి సిరిమానోత్సవం– వందల ఏళ్లుగా ఉత్తరాంధ్రలో జరుగుతున్న ఈ ఉత్సవ విశేషాలు ఇవే!

