గ్రూప్-1పై జగన్ అసత్య ప్రచారాలు - వాస్తవాలను వెల్లడించిన ప్రభుత్వం
నిజాన్ని దాచి గ్రూప్-1పై జగన్ అసత్యాలు - మూల్యాంకనంలో అక్రమాలు జరిగినా తప్పుదోవ పట్టించే యత్నాలు - సిట్ నివేదిక, హైకోర్టు తీర్పుపై అబద్ధాలు -

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 22, 2026 at 8:41 AM IST
Ap Group 1 Exam Scam : గ్రూప్-1 పరీక్షల వ్యవహారంలో జగన్ వైఖరి మసి పూసి మారేడు కాయ చేసే యత్నంలా ఉందని ప్రభుత్వం మండిపడింది. నిజాలను దాచిపెట్టి విలేకర్ల సమావేశంలో అసత్యాలు, అబద్ధాలను జగన్ నిస్సంకోచంగా వల్లె వేశారని ప్రభుత్వం ఆక్షేపించింది. మూల్యాంకనంలో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు సిట్ దర్యాప్తు, హైకోర్టు ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయని వెల్లడించింది. డిజిటల్ మూల్యాంకనాన్ని హైకోర్టు రద్దు చేసిన అంశాన్ని జగన్ వక్రీకరించారని విమర్శించింది. సిట్ నివేదికలోని కీలక ఆధారాలను విస్మరించి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నించారని ధ్వజమెత్తింది.
అసలు వాస్తవాలను వెల్లడించిన ప్రభుత్వం: గ్రూప్-1 మాన్యువల్ మూల్యాంకనం సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే జరిగిందన్న జగన్ వాదనను ప్రభుత్వం ఖండించింది. మూల్యాంకనం ప్రారంభమైన 17 రోజుల తర్వాతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని సిట్ నివేదికలో పేర్కొందని తెలిపింది. మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ చీఫ్ ఎగ్జామినర్లు, ఎగ్జామినర్లు ఫోన్లు ఉపయోగించిన ఆధారాలు సీసీటీవీ ఫుటేజీలో లభించాయని వెల్లడించింది. ఈ అంశాలను జగన్ కావాలనే ప్రస్తావించలేదని విమర్శించింది. డిజిటల్ మూల్యాంకనాన్ని హైకోర్టు తప్పుపట్టలేదన్న జగన్ వ్యాఖ్యలపైనా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
2021 అక్టోబర్ 1న జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు డిజిటల్ మూల్యాంకనాన్ని రద్దు చేసి, మూడు నెలల్లో మాన్యువల్ మూల్యాంకనం నిర్వహించాలని ఏపీపీఎస్సీని ఆదేశించారని తెలిపింది. అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూలకు పిలిచి ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కోర్టు సూచించిందని పేర్కొంది. భవిష్యత్తులో అన్ని అనుమతులు, చట్టబద్ధమైన విధానాలతో డిజిటల్ మూల్యాంకనం నిర్వహించుకోవచ్చన్న కోర్టు అభిప్రాయాన్ని మాత్రమే జగన్ ప్రస్తుత కేసుకు వర్తింపజేస్తూ వక్రీకరించారని ఆరోపించింది.
16 వ్యత్యాసాల్లో 14 తమ ఎర్రర్ లిస్టులోనూ: ఓఎంఆర్ స్లిప్పుల్లో మార్కుల తేడాలు లేవని సిట్ చెప్పిందన్న జగన్ వ్యాఖ్యలపై ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. 326 మంది షార్ట్‌లిస్ట్ అభ్యర్థుల ఒరిజినల్ ఎర్రర్ లిస్టును సిట్ సేకరించిందని, 2026 జూన్ 6, 7, 16 తేదీల్లో సీఐడీ పరిశీలన జరిపిందని తెలిపింది. పరిశీలనలో వ్యత్యాసాలు గుర్తించడంతో సిట్ ప్రత్యేకంగా ఎర్రర్ లిస్టు రూపొందించి, ఆగస్టు 3న ఏపీపీఎస్సీ కార్యదర్శిని వివరణ కోరిందని పేర్కొంది. సిట్ గుర్తించిన 16 వ్యత్యాసాల్లో 14 తమ ఎర్రర్ లిస్టులోనూ ఉన్నాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి స్పష్టం చేశారంది.
జగన్ మాత్రం నివేదికలోని ఒక పేరాను మాత్రమే ప్రస్తావించారని ప్రభుత్వం విమర్శించింది. ఓఎంఆర్ స్లిప్పుల్లో మార్పులు ఎగ్జామినర్లే చేశారని, బయటి వ్యక్తులకు అవకాశం లేదన్న వాదనను కూడా ప్రభుత్వం తప్పుబట్టింది. 16 మూల్యాంకన స్లిప్పుల్లో ప్రశ్నల వారీ మార్కులు, విభాగాల కూడికలు, గ్రాండ్ టోటల్‌లో మార్పులు గుర్తించామని సిట్ పేర్కొందని తెలిపింది. వీటిలో కొన్ని మార్పులకు అవసరమైన ఆథరైజేషన్ సంతకాలు లేవని, అనధికార వ్యక్తులు సవరణలు చేసినట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించింది. ఎగ్జామినర్ జి.సోమశేఖర్ ఓ అభ్యర్థికి 99 మార్కులు ఇచ్చానని చెప్పగా, తనకు తెలియకుండా వాటిని 86కు మార్చినట్లు గుర్తించారని ప్రభుత్వం వెల్లడించింది.
ఒకే స్లిప్‌పై భిన్నమైన సంతకాలు: సవరణలు మూల్యాంకన ప్రక్రియలో భాగమే అయినప్పటికీ వాటికి నిబంధనల ప్రకారం అనుమతి, సంతకం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎస్‌ఏఈ/108 పేపర్ హాల్‌టికెట్ నంబర్ 271008820కు చెందిన ఓఎంఆర్‌లో 13 మార్పులు గుర్తించగా, గ్రాండ్ టోటల్‌ను 105 నుంచి 89కి అంకెల్లోనూ, అక్షరాల్లోనూ తగ్గించినా సంతకం లేదని తెలిపింది. మరో అభ్యర్థి హాల్‌టికెట్ నంబర్ 270302670కు చెందిన ఎస్‌ఏఈ/105 పేపర్‌లో ఐదు ప్రశ్నల మార్కులతో పాటు మొత్తం కూడికలో ఎనిమిది మార్పులు చేసి 99 నుంచి 86కు తగ్గించారని, వాటిపైనా సంతకాలు లేవని తెలిపింది.
ఎస్‌ఏఈ/108 పేపర్‌కు కంట్రోల్ బండిల్ స్లిప్‌లో ఒకటో మూల్యాంకన సంఖ్యను 10 నుంచి 11కు ఓవర్‌రైట్ చేసినా ఆథరైజేషన్ సంతకం లేదని సిట్ గుర్తించిందని ప్రభుత్వం తెలిపింది. ఎస్‌ఏఈ/102 పేపర్ రెండో మూల్యాంకనంలో ఎగ్జామినర్, చీఫ్ ఎగ్జామినర్ ఇద్దరూ ఒకరే అన్నట్లుగా సంతకాలు కనిపించడం సూపర్‌వైజరీ ప్రోటోకాల్‌కు విరుద్ధమని వివరించింది. ఎస్‌ఏఈ/106 పేపర్ రెండో మూల్యాంకనంలో ఒకే స్లిప్‌పై భిన్నమైన సంతకాలు కనిపించాయని, వాటిలో కొన్ని ఎగ్జామినర్ సంతకాలతో సరిపోగా, మరికొన్ని ఎవరితోనూ సరిపోలలేదని తెలిపింది.
ఆగస్టు 4న ఏపీపీఎస్సీ లిఖితపూర్వకంగా స్పష్టత: ఎస్‌ఏఈ/106 పేపర్ మొదటి మూల్యాంకనంలోని మరో కంట్రోల్ బండిల్ స్లిప్‌లో 12 ఆల్ట్రేషన్లు గుర్తించగా, 10 చీఫ్ ఎగ్జామినర్ సంతకాలతో సరిపోలినా, రెండు సవరణలు ఎగ్జామినర్, చీఫ్ ఎగ్జామినర్ ఎవరి సంతకాలతోనూ సరిపోలలేదని ప్రభుత్వం వెల్లడించింది. మరో స్లిప్‌లో ఎనిమిది ఆల్ట్రేషన్లు ఉండగా, 6 ఎగ్జామినర్, రెండు చీఫ్ ఎగ్జామినర్ చేసినట్లు సిట్ గుర్తించిందని తెలిపింది. రెండో మూల్యాంకనానికి చెందిన మరో స్లిప్‌లో నాలుగు ఆల్ట్రేషన్లు ఉండగా, ఎగ్జామినర్, చీఫ్ ఎగ్జామినర్ చెరో రెండు సంతకాలు చేసినట్లు గుర్తించిందని తెలిపింది.
ఓఎంఆర్ స్లిప్పులో ఎగ్జామినర్‌కు ప్రత్యేకంగా కేటాయించిన భాగంలో చీఫ్ ఎగ్జామినర్ మార్పులు చేయడానికి అధికారం లేదని ఏపీపీఎస్సీ న్యాయపరమైన అభిప్రాయం ఆధారంగా స్పష్టం చేసిందని ప్రభుత్వం తెలిపింది. సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీ తీర్పును జగన్ ఏపీపీఎస్సీకి వర్తింపజేసే ప్రయత్నం చేశారని, అది యూపీఎస్సీ కేసుకు సంబంధించినదేనని సిట్ పేర్కొందని వెల్లడించింది. ఈ అంశంపై ఆగస్టు 4న ఏపీపీఎస్సీ లిఖితపూర్వకంగా స్పష్టత ఇచ్చిందని తెలిపింది. మొత్తం వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన సవరణలు, అనధికార మార్పులు, సంతకాల వ్యత్యాసాలను జగన్ కావాలనే విస్మరించారని ప్రభుత్వం వివరించింది.
వైఎస్సార్సీపీ హయాంలో అడ్డగోలుగా గ్రూప్-1 మూల్యాంకనం - సిట్ నివేదికలో వెల్లడి

