కారుణ్య మరణాలకు మార్గం సుగమం - సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్గదర్శకాల రూపకల్పన - వెంటిలేటర్‌పై అవసాన దశలో ఉన్న రోగులకు ఊరట - మార్గదర్శకాలకు ఆమోదం తెలిపిన మంత్రి సత్యకుమార్ యాదవ్

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 8, 2026 at 7:06 PM IST
AP Euthanasia Guidelines : తీవ్రమైన వ్యాధులతో బాధపడుతూ, ప్రాణాపాయ స్థితిలో నరకయాతన అనుభవించే రోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ఇకపై వారికి 'కారుణ్య మరణం' ప్రసాదించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలను రూపొందించింది.
కళ్లెదుటే నరకయాతన : కొందరు రోగులు తీవ్రమైన వ్యాధుల బారిన పడతారు. వైద్య చికిత్సలకు ఏమాత్రం లొంగని స్థితికి చేరుకుంటారు. తిరిగి కోలుకునే అవకాశం అస్సలు ఉండదు. కేవలం వెంటిలేటర్ సహాయంతోనే కృత్రిమంగా ఊపిరి పీల్చుకుంటారు. మరణానికి చేరువై, ఆస్పత్రి పడకలపై వారు పడే నరకయాతన వర్ణనాతీతం. ఇలాంటి వారికి తాజా నిర్ణయం ఎంతో ఊరటనివ్వనుంది. వ్యాధి నుంచి కోలుకునే అవకాశం లేక చికిత్స పేరిట నానా ఇబ్బందులు పడేవారికి ఇది విముక్తిని ప్రసాదించనుంది.
గతంలో చట్టపరమైన చిక్కులు : గతంలో కారుణ్య మరణానికి సంబంధించి స్పష్టమైన చట్టాలు లేవు. అవసాన దశలో ఉన్న రోగులకు లైఫ్ సపోర్ట్ సిస్టంను తొలగించేందుకు నిబంధనలు ఉండేవి కావు. దీంతో ఆసుపత్రుల యాజమాన్యాలు, వైద్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. రోగుల కుటుంబ సభ్యులకు కూడా పలు న్యాయపరమైన సమస్యలు వచ్చేవి. చికిత్స నిష్ప్రయోజనం అని తెలిసినా చేసేది ఏమీ ఉండేది కాదు. రోగులు కృత్రిమంగా ఊపిరి పీల్చుకుంటూ తీవ్ర కష్టనష్టాలకు గురయ్యేవారు.
సుప్రీం తీర్పు, మంత్రి ఆమోదం : అవసాన దశలో ఉన్న రోగులకు సహజరీతిలో కారుణ్య మరణం పొందే అవకాశాన్ని కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం పక్కా మార్గదర్శకాలను సిద్ధం చేసింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఈ మార్గదర్శకాలకు ఆయన ఆమోదం తెలిపారు.
కుటుంబ సభ్యులకు రక్షణ కవచం : కొత్త మార్గదర్శకాలతో అందరికీ మేలు జరగనుంది. రోగుల స్వయం నిర్ణయాధికారాన్ని ఈ నిబంధనలు గౌరవిస్తాయి. ప్రాణాపాయ స్థితిలో చికిత్సను అందించే వైద్యులకు చట్టపరమైన రక్షణ లభిస్తుంది. అలాగే కారుణ్య మరణానికి సంబంధించి కఠిన నిర్ణయాలు తీసుకునే రోగుల కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందులు తప్పుతాయి. వారికి న్యాయపరమైన రక్షణ కవచంలా ఈ మార్గదర్శకాలు ఉపయోగపడతాయి.
అవకతవకలకు తావులేకుండా చర్యలు : కారుణ్య మరణం ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని ఆదేశించింది. దీనికోసం ప్రత్యేకంగా ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. జిల్లా స్థాయిలో డీఎంహెచ్‌వోలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యులను చేసింది. వీరు మార్గదర్శకాల అమలును నిశితంగా పరిశీలిస్తారు.
సుప్రీంకోర్టు సంచలన తీర్పు- హరీశ్ రాణా కారుణ్య మరణానికి అనుమతి
కారుణ్య నియామకాలపై మార్గదర్శకాలివ్వండి : ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

