తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం - ఏకసభ్య కమిటీని నియమించిన ప్రభుత్వం
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏకసభ్య కమిటీని నియమించిన ప్రభుత్వం - విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేశ్‌కుమార్ నేతృత్వంలో ఏర్పాటు - 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు జారీ

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 20, 2026 at 6:06 PM IST
|Updated : February 20, 2026 at 7:41 PM IST
Govt Appoints One Member Committee on Tirumala Laddu Issue: వైఎస్సార్సీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కల్తీకి బాధ్యులైన వారిపై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కల్తీ నెయ్యిపై దర్యాప్తు చేసి సిట్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక మేరకు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు విశ్రాంత ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేసిన సిట్ ఇప్పటికే ఛార్జిషీట్ వేసింది.
తప్పు చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం కమిషన్‌ను నియమించింది. రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ పంపిన దర్యాప్తు నివేదికను ఏక సభ్య కమిటీ పరిశీలించనుంది. లోపాలు, వైఫల్యాలు, తప్పులకు కారకులైన కమిటీ సభ్యులు, సీనియర్ అధికారులపై తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. టెండర్ నిబంధనల సడలింపు, అమలులో పరిపాలనా లోపాలు, వైఫల్యాలను అంచనా వేయాలని కమిటీకి ప్రభుత్వం స్పష్టం చేసింది.
గత ప్రభుత్వంలో తప్పు చేసిన టీటీడీ అధికారులు, కమిటీ సభ్యుల ప్రమేయాన్ని గుర్తించాలని తప్పు చేసిన వారిపై తగిన పరిపాలనా లేదా క్రమశిక్షణా చర్యను సిఫార్సు చేయాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. రికార్డులు, రాతపూర్వక వివరణలను కమిటీ కోరవచ్చని తెలిపింది. ప్రభుత్వ ముందస్తు అనుమతితో నిపుణుల సహాయం పొందవచ్చని స్పష్టం చేసింది. 45 రోజుల్లోపు కమిటీ తన నివేదికను సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. టీటీడీ అవసరమైన సహాయం అందిస్తుందని ఆదేశాల్లో తెలిపింది. ప్రభుత్వ ఆదేశాల వల్ల కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న ఏ చర్యలకు భంగం కలగదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఇటీవల నిగ్గు తేల్చిన సిట్: వైఎస్సార్సీపీ హయాంలో 2019-24 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి అసలు నెయ్యే కాని దాన్ని నెయ్యి పేరిట సరఫరా చేశారని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఇటీవల నిగ్గు తేల్చింది. పాలే లేకుండా పామాయిల్, పామ్ కర్నెల్ ఆయిల్‌తో సిద్ధం చేసిన పదార్థాన్నే నెయ్యి ముసుగులో సరఫరా చేశారని పేర్కొంది. దానికి నెయ్యి సువాసనలు వచ్చేలా చేసేందుకు బీటాకెరోటిన్ లాంటి రసాయనాలను కలిపారని తేల్చింది. ఇలా 5 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని వెల్లడించింది. దీంతోనే 20.01 కోట్ల శ్రీవారి లడ్డూలు, ఇతర ప్రసాదాలు తయారుచేశారని తెలిపింది.
ఈ కుంభకోణంలో రూ.235 కోట్ల టీటీడీ నిధుల దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా, కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని వివరించింది. కొంతమంది టీటీడీ ఉద్యోగులు, అధికారులు, డెయిరీ సంస్థల ప్రతినిధులతో కుమ్మక్కై ఈ కల్తీ నెయ్యి సరఫరాలో భాగస్వాములయ్యారని పేర్కొంది. 2019-24 మధ్య అసలు పాలే లేని నెయ్యి సరఫరా చేశారని సిట్ నిగ్గు తేల్చింది. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సిట్ అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో కొద్ది రోజుల క్రితం తుది అభియోగపత్రం (ఛార్జ్‌షీట్) దాఖలు చేశారు. 600 పేజీలకు పైగా ఉన్న ఈ అభియోగపత్రంలో 36 మంది నిందితుల ప్రమేయాన్ని స్పష్టంగా వివరించారు. ఈ జాబితాలో టీటీడీ ఉద్యోగులు, అధికారులతో పాటు పలువురు డెయిరీ సంస్థల ప్రతినిధులున్నారు.
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రభుత్వానికి సిట్ లేఖ
ఇంకా ఎవరి పాత్రైనా ఉందా? నిందితులుగా చేర్చాలా? - తిరుమల లడ్డూ కల్తీ కేసులో దర్యాప్తుపై సమీక్ష

