ETV Bharat / state

మున్సిపల్​ ఆఫీసుకు వెళ్లనక్కర్లేదు - ఇంటి పన్ను ఇలా చెల్లించండి

ఆస్తి పన్ను చెల్లించాలంటే మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లాల్సిన పని లేదిక - ప్రతి ఇంటికీ క్యూఆర్‌ కోడ్‌ స్కానర్లు - సమస్యలపైనా ఫిర్యాదులు చేయొచ్చు

AP Tax QR Code Project
AP Tax QR Code Project (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 26, 2026 at 12:53 PM IST

2 Min Read
Choose ETV Bharat

AP Tax QR Code Project: సాధారణంగా ఆస్తి పన్ను చెల్లించాలంటే మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లాలి. మనం ఉంటున్న వీధిలో పేరుకుపోయిన చెత్త తొలగించాలని గ్రీవెన్స్‌లో కమిషనర్‌కు వినతులివ్వాల్సి ఉంటుంది. దాని కోసం మనం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కానీ ఇక నుంచి మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన పనే లేదు. అధికారులను కలవాల్సిన అవసరం అస్సలే లేదు. అలా అయితే సమస్యలు తీరేదెలా అని అనుకుంటున్నారా? సమాధానం మీ చేతిలోనే ఉంది.

ఒక క్యూఆర్‌ కోడ్‌ని మీ ఇంటి గోడకు, డోర్‌కు అతికిస్తారు. దాన్ని మీ స్మార్ట్‌ ఫోన్‌తో స్కాన్‌ చేసి సులువుగా ఆస్తి పన్ను కట్టొచ్చు. దీని ద్వారా ఏమైనా సమస్యలు ఉన్నప్పటికీ వాటి గురించి ఫిర్యాదులు చేయొచ్చు. రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో ఈ సరికొత్త ప్రాజెక్టును త్వరలోనే అమలులోకి తీసుకురానున్నట్లు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు.

క్యూఆర్‌ కోడ్‌లు: వివిధ పనుల కోసం నగర, పురపాలక సంస్థల ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఇప్పటికే ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. సంవత్సరం క్రితం ప్రారంభించిన పుర మిత్ర యాప్‌ ఇదే కోవకు సంబంధించింది. ఈ యాప్​లో ఫొటోలతో సహా తాము ఎదుర్కొంటున్న సమస్యలను అప్‌లోడ్‌ చేసిన వెంటనే, దాన్ని పూర్తిగా విశ్లేషించి వెంటనే పరిష్కారాన్ని ఇచ్చేలే ఈ యాప్‌ని డిజైన్‌ చేశారు. దీని వినియోగానికి క్రమక్రంగా ఆదరణ పెరుగుతోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆస్తి పన్ను సహా ఇతరత్రా ఫీజులు కూడా ఇంటి నుంచే చెల్లించే విధంగా మరో వినూత్న ప్రాజెక్టు రూపొందించారు. పట్టణాలు, నగరాల్లోని అపార్ట్‌మెంట్లు, 45 లక్షల ఇళ్లు, వ్యాపార సముదాయాలకు ఈ యాప్​ క్యూఆర్‌ కోడ్‌లు అతికించనున్నట్లు తెలుస్తుంది.

స్కాన్​ చేస్తే సమాచారం: ఇంటి యజమానులు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసిన వెంటనే ఆ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఇళ్లు, దుకాణాల నిర్మాణ విస్తీర్ణం, ప్రతీ ఏడాది కడుతున్న ఆస్తిపన్ను, బకాయిలు గానీ ఏం ఉన్నా ఆ వివరాలు ఇందులో క్లుప్తంగా కనిపిస్తాయి. దుకాాణాలు గానీ వ్యాపార సంస్థలు గానీ అయితే ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజుల బకాయిలు కూడా తెలుసుకోవచ్చు.

2వ దశలో: క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ ద్వారా ఇళ్లకు సమీపంలోని డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌లు, క్లబ్‌లు, హోటళ్లు, జిమ్‌లు, కల్యాణమండపాలు, విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, కమ్యూనిటీ హాళ్ల గురించిన వివరాలు తెలుసుకునేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా వాటిని సంప్రదించేందుకు వివరాలు సహా ఫోన్‌ నంబర్లు కూడా పెడుతున్నారు. 2వ దశలో ఇవ్ని సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలుపుతున్నారు.

కేంద్రం నిధులు: నగర, పురపాలక సంస్థల సేవల గురించి సులువుగా తెలుసుకునేలా కేంద్రం ప్రవేశపెట్టిన ‘సిటీ సర్వీస్‌ సెంటర్ల’ కార్యక్రమంలో భాగంగా క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తోంది. ఇందుకోసం కేంద్రం కేటాయించిన నిధుల్లోంచి కొంత ఖర్చు చేయనున్నారు.

ఏపీలో పురమిత్ర యాప్​తో సమస్యలకు చెక్​

అందుబాటులోకి పౌరసేవలు- విజయనగరం జిల్లాలో పురమిత్ర యాప్‌