'ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త' - చిన్న పరిశ్రమలకు వేగంగా అనుమతులు
చిన్న పరిశ్రమలకు రెండేళ్లలో ఏటా సగటున 963 ఎకరాల కేటాయింపు - తద్వారా రూ.4030 కోట్ల పెట్టుబడులు - ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 ఎంఎస్‌ఎంఈ పార్కుల అభివృద్ధి

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 24, 2026 at 2:49 PM IST
Small Industries in AP : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 'ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త' అనే నినాదంతో పారిశ్రామికాభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఇందుకు ప్రతి నియోజకవర్గంలో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెసెస్ (ఎంఎస్ఎంఈ) పార్కుల నిర్మాణం ద్వారా యువత, మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా మలిచేలా, స్థానికులకు ఉపాధి అందించేలా ప్రణాళికలు రూపొందించింది. ఈ నేపథ్యంలోనే ఏపీలో చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడంపై సర్కార్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. వాటి నుంచి ప్రతిపాదనలు అందిన వెంటనే సాధ్యమైనంత వేగంగా భూములు కేటాయిస్తోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్ నుంచి ఇప్పటికి 2876 ఎంఎస్‌ఎంఈలకు అత్యంత వేగంగా భూములను కేటాయించింది. ‘ఒక కుటుంబం - ఒక పారిశ్రామికవేత్త’ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. అందుకు అనుగుణంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 ఎంఎస్‌ఎంఈ పార్కులను అభివృద్ధి చేస్తోంది. వాటి ద్వారా ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయాలన్నది సర్కార్ ఆలోచన. ఈ రంగం ద్వారా ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉండటంతో ప్రభుత్వం వాటిని ప్రోత్సహించేందుకు ఉన్న అవకాశాలపై ఫోకస్ పెట్టింది.
ఎంఎస్‌ఎంఈలకు 2019-2024లో వైఎస్సార్సీపీ సర్కార్ ఐదు సంవత్సరాల్లో కేటాయించిన భూములకు మించి కూటమి ప్రభుత్వం 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు (రెండేళ్లలో) భూముల కేటాయింపులో రికార్డు సాధించిందని అధికారులు పేర్కొంటున్నారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే ఎంస్‌ఎంఈలకు భూముల కేటాయింపు వార్షిక సగటు రేటు ఎక్కువగా ఉంది. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఎంఎస్‌ఎంఈలకు 3573 ఎకరాలు కేటాయించింది. అనగా ఏటా సగటున 714.6 ఎకరాలు కేటాయించినట్లు. దీంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో (2024 జూన్ నుంచి) ఏటా సగటున 963.5 ఎకరాల చొప్పున ఇచ్చింది.
175 MSME Parks in AP : చిన్న పరిశ్రమల ద్వారా రూ.50,000 కోట్ల పెట్టుబడులను ఐదు సంవత్సరాల్లో ఆకర్షించాలన్నది సర్కార్ లక్ష్యం. వీటి ద్వారా కనీసం ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించాలని భావిస్తోంది. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన 2876 ఎంఎస్‌ఎంఈల ద్వారా రూ.8060 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వాటి ద్వారా 1.03 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థలు ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. వైఎస్సార్సీపీ సర్కార్‌లో ఏటా సగటున రూ.2021.60 కోట్ల పెట్టుబడులు ఎంఎస్‌ఎంఈ రంగంలోకి రాగా కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఏటా సగటున రూ.4030 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
మరోవైపు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న భూములను బట్టి 10 నుంచి 50 ఎకరాలను ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదించింది. వీటి ద్వారా చిన్న పరిశ్రమలకు సుమారు 3500 ఎకరాల భూములు అందుబాటులోకి రానున్నాయి. వాటిలో వీధి దీపాలు, లేఅవుట్, ప్లగ్ అండ్ ప్లే మౌలిక సదుపాయాలు, అంతర్గత రోడ్లు, నీటి సరఫరా నెట్‌వర్క్, రెడీ టు ఫ్యాక్టరీ షెడ్‌లు, విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్, టెలికమ్యూనికేషన్లు, పరిపాలనా భవనాలను ఏపీఐఐసీ సమకూరుస్తుంది. .
అదేవిధంగా రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఎంఎస్‌ఎంఈలకు అవసరమైన సాంకేతికత, నైపుణ్య శిక్షణ అందిస్తోంది. అమరావతిలో ఆర్‌టీఐహెచ్ ప్రధాన కార్యాలయంతో పాటు తిరుపతి, రాజమహేంద్రవరం, విజయవాడ, విశాఖపట్నం, అనంతపురంలో స్పోక్ సెంటర్లను సర్కార్ ఏర్పాటు చేసింది.
'SHG' మహిళలకు ఉపాధికి మార్గం - సేంద్రియ ఎరువుగా గుర్రపుడెక్క!
మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారేలా ప్రోత్సాహం - యూనిట్ల విస్తరణ, స్థాపనకు చేయూత

