అక్టోబర్ ఆఖరు నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు
ఒకవేళ 50శాతానికి మించి రిజర్వేషన్లను ఖరారు చేస్తే ఈ అంశం కోర్టుకు చేరి ఎన్నికల ప్రక్రియ రెండు, మూడు నెలల పాటు జాప్యం

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 20, 2026 at 10:12 AM IST
AP governament Tells High Court Local body Polls To End By October: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబర్ ఆఖరు నాటికి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. ఓటర్ల జాబితాను ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరిందన్నారు. అధికారులతో ఎస్‌ఈసీ బుధవారం సమావేశం నిర్వహించిందని తెలిపారు. స్థానిక సంస్థల చట్టాలను ప్రభుత్వం సవరిస్తోందని, వాటి ఆమోదం కోసం శాసనసభలో బిల్లులు ప్రవేశపెట్టనుందని వివరించారు. బీసీ రిజర్వేషన్లపై జీఓలు జారీ చేయనుందన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో డెడికేటెడ్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని చెప్పారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని కోరారు.
రెండు వారాలకు వాయిదా: పార్టీ ఇన్‌పర్సన్, న్యాయవాది తాండవ యోగేష్ వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ 50శాతానికి మించి రిజర్వేషన్లను ఖరారు చేస్తే ఈ అంశం కోర్టుకు చేరి ఎన్నికల ప్రక్రియ రెండు, మూడు నెలల పాటు జాప్యం జరిగే అవకాశముందని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ఏజీ తగిన సలహా ఇస్తారని ఆశిస్తున్నట్లు ధర్మాసనం వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలంటూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఈమేరకు ఉత్తర్వులిచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క నినాదం వినిపిస్తోంది అదే స్థానిక సంస్థల్లో బీసీల సంపూర్ణ రాజకీయ హక్కుల సాధన. ఒక రాష్ట్ర ప్రగతికి స్థానిక స్వపరిపాలన ఎంత కీలకమో, ఆ పరిపాలనలో అత్యధిక జనాభా కలిగిన వెనుకబడిన తరగతులకు సరైన ప్రాతినిధ్యం దక్కడం అంతే ముఖ్యం. 2019-24 మధ్య ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో 24 శాతానికి కుంచించుకు పోయిన బీసీల రిజర్వేషన్లను తిరిగి భారీగా పెంచుతూ కూటమి ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కేబినెట్ తాజా సమావేశంలో గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33⅓ శాతం రిజర్వేషన్లు బీసీలకు కేటాయిస్తూ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.

