సముద్రంలో గల్లంతైన ఆరుగురి కోసం తీవ్ర గాలింపు - ప్రతికూల వాతావరణంతో ఆటంకాలు
మత్స్యకారుల కోసం విస్తృత గాలింపు - భీకర గాలులు, కెరటాల మధ్య ప్రాణాలకు తెగించి రెస్క్యూ టీం గాలింపు - నౌకాదళ ఆసుపత్రిలో చిన్నకు వైద్య పరీక్షలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 7, 2026 at 8:03 AM IST
Visakha Fishermen Missing Updates : విశాఖ సముద్ర గర్భంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రభుత్వం, రక్షణ దళాలు సర్వ శక్తులూ ఒడ్డుతున్నాయి. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌ను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. అల్లకల్లోలంగా మారిన సముద్రం, భీకర గాలులు, ఎగసిపడుతున్న కెరటాల మధ్య ప్రాణాలకు తెగించి రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది. చైనా క్రూ నౌక సురక్షితంగా కాపాడిన చిన్న ఇచ్చిన సమాచారమే ఇప్పుడు కీలకంగా మారింది.
యావత్ యంత్రాంగం రంగంలోకి దిగి వార్ ఫుటింగ్‌పై గాలింపును వేగవంతం చేసింది. ప్రమాదం జరిగిన లోకేషన్‌ను డేటమ్‌గా గుర్తించిన తక్షణమే కోస్టల్ సెక్యూరిటీ ఫోర్స్ హై అలర్ట్ ప్రకటించింది. కోస్ట్ గార్డ్‌కు చెందిన అత్యంత శక్తిమంతమైన యుద్ధనౌక 'ఐసీజీఎస్ కనకలతా' బారవా సముద్ర గర్భంలోకి దూసుకెళ్లింది. దీనికి అదనపు బలంగా విశాఖ బేస్ నుంచి 'ఐసీజీఎస్ వీర' నౌక కూడా రంగంలోకి దిగడంతో గాలింపు చర్యలు మరింత వేగవంతం అయ్యాయి. ఈ ఆపరేషన్‌లో తూర్పు నౌకాదళం నుంచి నేవీకి చెందిన రెండు అధునాతన ప్రత్యేక నౌకలు నిరంతరాయంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. సముద్రంపైనే కాకుండా, గగనతలం నుంచి కూడా నిఘా తీవ్రతరం చేశారు. నేవీకి చెందిన 'సీ కింగ్', కోస్ట్ గార్డ్ 'ఏఎల్హెచ్' హెలికాప్టర్లు అణువణువూ వెతుకుతున్నాయి.
Visakha Fishermen Boat Capsizes : సముద్రంలో విపరీతంగా పెరుగుతున్న గాలుల వేగం, అలల ఉద్ధృతి, విజిబిలిటీని దెబ్బతీస్తూ రెస్క్యూ టీమ్స్‌కు సవాల్ విసురుతున్నాయి. కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జెట్టి ఆపరేషన్స్ రూమ్ నుంచి సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు 48 గంటలు దాటుతున్నా జాడ తెలియకపోవడంతో వారి కుటుంబాలు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నాయి. గల్లంతైన ఏడుగురిలో ఒకరైన కారి చిన్నను సోమవారం రాత్రి సురక్షితంగా తీరానికి తీసుకొచ్చారు. చిన్న ఆదివారం నుంచి యూనివర్సిటీ వెల్తీ అనే మర్చంట్ నౌక సిబ్బంది సంరక్షణలో ఉన్నారు. ఎయిర్ లిఫ్ట్ చేయడానికి పరిస్థితులు అనుకూలించకపోవడంతో పోర్టు అధికారులను సంప్రదించి, యాంకరేజ్ పాయింట్‌లో ఉన్న నౌకను ముందస్తుగా పోర్టు జెట్టీకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు.
నౌకాదళ హెలికాప్టర్ సాయంతో చిన్నను రాత్రి 7 గంటలకు ఐఎన్‌ఎస్ డేగాకు తీసుకొచ్చారు. నౌకాదళ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. అక్కడ చిన్నను ఆయన భార్య, కుటుంబ సభ్యులు కలిశారు. విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి, మత్స్య శాఖ డీడీ వర్ధన్ తదితరులు చిన్నను కలిసి మాట్లాడారు. వైద్య పరీక్షల తర్వాత మాట్లాడిన చిన్న ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గల్లంతైన ఆరుగురిలో తన బంధువులు నలుగురు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వమే తమకు సాయం చేయాలని విన్నవించారు.
చిన్నను విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ పరామర్శించారు. ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే అంశంపై ఆరా తీశారు. మిగిలిన వారి ఆచూకీ, ప్రమాదం తర్వాత గడిపిన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారుల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
'గాలింపు చర్యలు వేగవంతం చేయాలి' - కంటైనర్ టర్మినల్ రహదారిలో మత్స్యకారుల ధర్నా
సముద్రంలో మత్స్యకారుల గల్లంతు - రెండో రోజు కొనసాగుతున్న గాలింపు చర్యలు

