రాష్ట్రంలో తొలి పైలట్ శిక్షణ కేంద్రం - కర్నూలు విమానాశ్రయంలో ప్రారంభానికి సిద్ధం
ఏపీలో మొట్టమొదటి విమాన పైలట్ల శిక్షణ కేంద్రం - కర్నూలు ఎయిర్‌పోర్టులో 1.25 ఎకరాల్లో ఏర్పాట్లు పూర్తి - అత్యాధునిక సదుపాయాలతో అకాడమీ, హ్యాంగర్ నిర్మాణం

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 30, 2026 at 9:15 AM IST
Kurnool Pilot Training Centre : రాష్ట్ర చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్రంలోనే మొట్టమొదటి విమాన పైలట్ల శిక్షణ కేంద్రం ప్రారంభానికి ముస్తాబైంది. కర్నూలు విమానాశ్రయం వేదికగా ఈ అత్యాధునిక అకాడమీ అందుబాటులోకి రానుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. మైసూరుకు చెందిన 'ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ'కి కర్నూలు ఎయిర్‌పోర్టులో 1.25 ఎకరాలను కేటాయించింది. దీంతో శిక్షణ కోసం సదరు సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
అత్యాధునిక సదుపాయాలు : ప్రభుత్వం స్థలం కేటాయించగానే అకాడమీ భవనాన్ని సంస్థ నిర్మించింది. దీనికి ఆనుకుని అత్యాధునిక 'హ్యాంగర్' భవనాన్ని సిద్ధం చేసింది. ఇందులో ఒకేసారి నాలుగు శిక్షణ విమానాలను భద్రపరిచే అవకాశం ఉంది. అక్కడే చిన్నపాటి ఎంఆర్ఓ (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్‌హాలింగ్) కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. శిక్షణ విమానాలకు అవసరమయ్యే మరమ్మతులు, సర్వీసింగ్ పనులన్నీ ఇక్కడే పూర్తి చేయొచ్చు. విమానాశ్రయ రన్‌వే నుంచి కేంద్రం వరకు విమానాల రాకపోకలకు వీలుగా ప్రత్యేక టాక్సీవేను నిర్మించారు. విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ కోసం అత్యాధునిక 'సిమ్యులేటర్ల'ను సైతం అందుబాటులోకి తెచ్చారు.
ట్రయల్ రన్ సక్సెస్ : చెన్నైలోని 'హిందుస్థాన్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్'లో 'ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ' ఒక భాగం. ఈ సంస్థ ఇప్పటికే మైసూరులో 12 ఏళ్లుగా పైలట్లకు విజయవంతంగా శిక్షణ ఇస్తోంది. ఇప్పుడు తమ రెండో కేంద్రాన్ని కర్నూలులో ప్రారంభించబోతోంది. సెస్నా, టెక్నామ్ బ్రాండ్లకు చెందిన సింగిల్ ఇంజిన్, మల్టీ ఇంజిన్ శిక్షణ విమానాలు ఈ సంస్థ వద్ద ఉన్నాయి. మైసూరులో ఉన్న విమానాల్లో మూడింటిని ఇకపై కర్నూలు ఎయిర్‌పోర్టులో ఉంచనున్నారు.
విమానాలు నడపడంపై శిక్షణ ఇవ్వడానికి ఇప్పటికే ట్రయల్‌రన్ నిర్వహించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రయల్స్ విజయవంతం కావడంతో కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సుమారు రూ. 100 కోట్ల వ్యయంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అకాడమీ వర్గాలు వెల్లడించాయి.
భవిష్యత్తులో మరిన్ని కోర్సులు : ప్రస్తుతం పైలట్లకు సంబంధించిన తరగతి గది (థియరీ) బోధన మాత్రమే కర్నూలులో జరుగుతోంది. విమానాలను నడిపే శిక్షణ (ప్రాక్టికల్స్) కోసం విద్యార్థులను మైసూరు పంపిస్తున్నారు. కర్నూలు అకాడమీ పూర్తిస్థాయిలో ప్రారంభమైతే ఇక్కడే ప్రాక్టికల్స్ కూడా బోధించనున్నారు. పైలట్ శిక్షణతో పాటు భవిష్యత్తులో విమానయాన రంగానికి అవసరమైన గ్రౌండ్‌స్టాఫ్, క్యాబిన్ క్రూ, ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగాల కోర్సులను కూడా ఇక్కడే ప్రారంభించనున్నట్లు అకాడమీ ప్రతినిధులు తెలిపారు.
త్వరలోనే కర్నూలులో పైలెట్ శిక్షణ కేంద్రం - పూర్తి కావొస్తున్న పనులు
ఆంధ్రప్రదేశ్‌లో 6 కొత్త పైలట్ శిక్షణ కేంద్రాలు - కర్నూలు, రాజమహేంద్రవరం, కడపలో ఏర్పాటు

