విద్యార్థులకు అలర్ట్ - ఎప్‌సెట్ ఫలితాల విడుదలకు డేట్ ఫిక్స్
రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఎప్‌సెట్ ఫలితాల విడుదలకు అధికారుల ఏర్పాట్లు - ఈ రిజల్ట్స్‌ను ఈ నెల 30న విడుదల చేయనున్నట్లు ఎప్‌సెట్ ఛైర్మన్ వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 28, 2026 at 10:32 PM IST
AP EAPCET 2026 Results : రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఎప్‌సెట్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ రిజల్ట్స్‌ను ఈ నెల 30న (మంగళవారం) విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఈ ఫలితాలను విడుదల చేస్తారని జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్, ఎప్‌సెట్ ఛైర్మన్ సీఎస్‌ఆర్కే ప్రసాద్ పేర్కొన్నారు.
మే 12 నుంచి 20వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షకు 3,55,803 మంది ఎప్‌సెట్‌కు దరఖాస్తు చేయగా 3,29,474 (92.60 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్ (ఎంపీసీ స్ట్రీమ్)కి 2,76,576 మంది దరఖాస్తు చేయగా 2,58,545 (93.48 శాతం) మంది పరీక్ష రాశారు. వ్యవసాయ, ఫార్మసీ (బైపీసీ స్ట్రీమ్)కి 79,227 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 70,929 (89.53 శాతం) మంది హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారమైతే జూన్ 1 నాటికే ఈ ఫలితాలు వెలువడాల్సింది. అయితే ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండటంతో ఏ ఒక్క విద్యార్థికీ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ద్వితీయ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు, సీబీఎస్‌ఈ రివైజ్డ్ ఫలితాలు పూర్తి స్థాయిలో వచ్చే వరకు అధికారులు ఆగడంతో కొంత జాప్యం నెలకొంది.
తాజాగా సీబీఎస్‌ఈ రివైజ్డ్ ఫలితాల ప్రక్రియ తుది దశకు చేరాయి. దీంతో ఈ నెల 30న ఎప్‌సెట్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు ఎప్‌సెట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

