అభివృద్ధి గురించి ఆలోచించకుండా విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: పవన్
పొట్టి శ్రీరాములు విగ్రహానికి పవన్‌కల్యాణ్ పుష్పాంజలి - ఆ మహనీయుని బలిదానం కారణంగా ఏపీకి ఉనికి ఏర్పడింది - వైఎస్సార్సీపీ వచ్చాక రాజకీయాల్లో కులదూషణలు మరింత పెరిగాయని విమర్శ

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 3, 2026 at 7:41 PM IST
|Updated : June 3, 2026 at 7:51 PM IST
AP Deputy Chief Minister Pawan Tributes Potti Sreeramulu At Amaravati: భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడేందుకు ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు వంటి మహానుభావులను కుల చట్రాల్లో బంధించటం బాధాకరమని డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణలో ఇప్పటికీ 'తెలంగాణ' అనే భావోద్వేగం ఉందని మన రాష్ట్రంలో మాత్రం ఇంకా కులం పరిధిలోనే ఉండిపోయామని తన ఆవేదనను వెలిబుచ్చారు.
అమరావతిలోని పొట్టి శ్రీరాములు స్మృతివనం సందర్శించి ఆయన విగ్రహానికి పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తమ పార్టీ తరపున కులాలకు అతీతంగా మాట్లాడేందుకు సేనాగళం పేరుతో కమిటి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏ కులం వారిని అదే కులం వారితో విమర్శించే విధానం పోవాలని వివరించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడి కులం వెనక దాక్కునే సంస్కృతి వద్దని పవన్ అన్నారు. ఇకపై ఏ అంశాన్నయినా పార్టీ విధానంగానే మా నాయకులు ఎదుర్కొంటారని తెలిపారు. నిరుద్యోగం, అభివృద్ధి గురించి పట్టించుకోకుండా కులాల కుంపట్లు పెరిగాయని, ఈ వాతావరణానికి చెక్ పెట్టాలని జనసేన పార్టీ భావిస్తున్నట్లు చెప్పారు.
విద్వేషాలకు ముగింపు పలకాలి: తెలంగాణా భూమి పుత్రుల జాగీరు కాదని ఎవరూ అనరని, కానీ అందులోకి రానివ్వమని చెప్పటం పైనే తాను అభ్యంతరం తెలిపానన్నారు. గద్దర్ వంటి వారు ఎప్పుడూ ఇలా ఎవరినీ రావొద్దని మాట్లాడలేదని గుర్తు చేశారు. ఆంధ్రా నాయకులు ఎవరూ వెళ్లి తెలంగాణాలో పోటీ చేయటం లేదని, తెలంగాణా భూమిపుత్రులు పోటీ చేస్తామంటే ఏంటి అభ్యంతరం అని ప్రశ్నించారు. ఇటీవలి పరిణామాల వెనక కుట్ర ఉందని చెప్పలేనని, విద్వేషాలకు ముగింపు పలకాలని భావిస్తున్నట్లు పవన్ చెప్పారు.
విభజన రాజకీయాలకు స్వస్తి పలకాలి: కులదూషణలకు స్వస్తి చెప్పాలని సేనాగళం పేరుతో కమిటీ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. కులం గురించి ఎవరు మాట్లాడినా ఈ కమిటీ పెద్దలే మాట్లాడతారన్నారు. కొందరు నేతలు ఇష్టం వచ్చినట్లు తిట్టి కులం ముసుగులోకి వెళ్తున్నారన్నారు. నిన్నటి వ్యాఖ్యల్లో ముందస్తు వ్యూహం ఏమీ లేదన్నారు. నన్ను 20 ఏళ్లుగా తిడుతున్నారు, వాటిని పట్టించుకోనన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగం భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దారి తీసిందన్నారు. మహానాయకులను కులచట్రాల్లో బిగించడం రాజకీయాల్లో అలవాటుగా మారిందన్నారు. పొట్టి శ్రీరాములు బలిదానం కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు ఉనికి ఏర్పడిందని గుర్తు చేశారు. 2005 తర్వాత కులదూషణలను సున్నిత అంశాలుగా మార్చారన్నారు. వైఎస్సార్సీపీ వచ్చాక రాజకీయాల్లో కులదూషణలు మరింత పెరిగాయని గుర్తు చేశారు.
వ్యక్తిని నిందించాలి - కులాన్ని కాదు: ఎవరైనా తప్పు చేస్తే ఆ వ్యక్తిని నిందించాలి తప్ప అతడి కులాన్ని కాదని పవన్ హితవు పలికారు. కొన్నిచోట్ల కులసంఘాల నాయకులు లాభపడుతున్నారన్నారు. అన్ని కులాలు సహకరిస్తేనే నాయకులు అవుతారన్నారు. అభివృద్ధి గురించి ఆలోచించకుండా విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులదూషణలకు చరమగీతం పాడాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
కేటీఆర్ నాకు మిత్రుడు: గద్దర్ కుటుంబసభ్యులు అంటే తనకు చాలా ఇష్టమని పవన్ కల్యాణ్ అన్నారు. పాలసీలపై కేటీఆర్ మాట్లాడి ఉండవచ్చు, ఆయన నాకు మిత్రుడని పవన్ వివరించారు. విభజన రాజకీయాలకు స్వస్తి పలకాలి, ఎవరికీ మంచిది కాదన్నారు. కేటీఆర్, నేను అనేక విషయాలు మాట్లాడుకుంటాం, విభేదాలు ఏమీ లేవని పవన్ తేల్చిచెప్పారు.
ఈ 12 ఏళ్లలో అనేకమంది ఏపీ కాంట్రాక్టర్లు తెలంగాణలో పని చేశారని పవన్ తెలిపారు. ఈ 12 ఏళ్లలో అనేకమంది తెలంగాణ కాంట్రాక్టర్లు ఏపీలో పని చేశారని గుర్తు చేశారు. నా సభకు అనుమతి ఇవ్వడం చిన్న విషయం, అనుమతిస్తే గొడవే వచ్చేది కాదన్నారు. హైదరాబాద్‌లో నాకు ఇల్లు ఉంది, అక్కడ ఉండటం సాధారణమన్నారు. సభ పెట్టుకోవడం అనేది నా హక్కు, దాన్ని కాదనకూడదని హితవు పలికారు. రాష్ట్ర విభజనకు నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు.
దేశ సమగ్రతపై కాంగ్రెస్ అగ్రనేతలు మాట్లాడాలి: ప్రాంతీయ విద్వేషాలు రగల్చడం రాహుల్‌గాంధీకి మంచిది కాదన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు మాట్లాడాలన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ఏం నేర్చుకున్నారన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వారు ప్రజలకు ఏం సందేశం ఇస్తారని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ, తమిళనాడులో ప్రాంతీయ భావం ఉందన్నారు. ఏపీ ప్రజల్లో ఉన్న ఉప ప్రాంతీయవాదం సరికాదన్నారు. వైఎస్సార్సీపీకి భయపడితే ఇంతమంది రాజకీయాల్లోకి ఎందుకు వస్తారన్నారు. ఇప్పుడు వారికి 3 జిల్లాలతో కలిసిన రాజధాని కావాలంటే సాధ్యమేనా అంటూ పవన్ ఎద్దేవా చేశారు. అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నాక ముందుకు తీసుకెళ్లాలన్నారు. రాజధానిపై వైఎస్సార్సీపీ నేతల వ్యాఖ్యలు సరికాదన్నారు.
"ఒక్కొక్క కులాన్ని దూషించడం సరికాదు. అందుకే దీనికి చరమాంకం పలకడానికి సేనాగళాన్ని ఏర్పాటు చేయనున్నాం. ఎవరైనా తప్పు చేస్తే ఆ వ్యక్తిని నిందించాలి తప్ప అతడి కులాన్ని కాదు. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడేందుకు ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు వంటి మహానుభావులను కుల చట్రాల్లో బంధించటం బాధాకరం. విభజన రాజకీయాలకు స్వస్తి పలకాలి, ఎవరికీ మంచిది కాదు". -పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం
‘అదే నా రాస్తా’ - పవన్ కల్యాణ్ ఎక్స్ పోస్టు వైరల్
తెలంగాణలో జనసేన ఉంటుంది - 2029 ఎన్నికల్లో తప్పకుండా పోటీచేస్తాం: పవన్ కల్యాణ్

