ETV Bharat / state

రేపటిలోగా ఆదేశాలు అమలు చేయండి - లేదంటే మళ్లీ రావాల్సిందే: హైకోర్టు

గ్రూప్-1 పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులను నాన్ ఫోకల్ పోస్టుల్లోకి మార్చాలని గతంలో కోర్టు ఆదేశాలు - ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని భావిస్తున్నామన్న ధర్మాసనం

AP Chief Secretary Vijayanand Attend High Court
AP Chief Secretary Vijayanand Attend High Court (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 25, 2026 at 3:34 PM IST

3 Min Read
Choose ETV Bharat

AP Chief Secretary Vijayanand Attend to High Court : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ హైకోర్టుకు హాజరయ్యారు. గ్రూప్-1 పరీక్షలలో ఎంపికైన అభ్యర్థులను నాన్ ఫోకల్ పోస్ట్​లలోకి మార్చాలని ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ హైకోర్టుకు హాజరయ్యారు. నేడు చీఫ్ సెక్రటరీను కోర్టు ముందు హాజరు కావాలని ధర్మాసనం నిన్న (మంగళవారం) ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని భావిస్తున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తాము ఫోకల్, నాన్ ఫోకల్ పోస్ట్​ల గురించి వివరణ కోరుతూ పిటిషన్ ఫైల్ చేశామని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు చెప్పారు.

చట్టంలో ఫోకల్, నాన్ ఫోకల్ పోస్ట్​లు అనే వివరణ లేదని అడ్వకేట్ జనరల్ తెలిపారు. డిక్షనరీ నిర్వచనం ప్రకారం చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలు అమలు చేస్తారా? లేదా? చెప్పాలని చీఫ్ సెక్రటరీను హైకోర్టు ప్రశ్నించింది. ఎప్పటిలోగా అమలు చేస్తారో చెప్పాలని హైకోర్టు స్పష్టం చేసింది. రీజనబుల్ టైమ్‍లో అమలు చేస్తామని సీఎస్ విజయానంద్ సమాధానమిచ్చారు. ప్రభుత్వం 15 రోజులు సమయం అడిగింది.

రెండు రోజులు సమయం కూడా ఇవ్వలేమని ధర్మాసనం చెప్పింది. రేపటిలోగా అమలు చేసి కోర్టుకు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రేపటిలోగా అమలు చేస్తే కోర్టుకు రావాల్సిన అవసరం లేదని ధర్మాసనం చెప్పింది. అమలు చేయకపోతే కోర్టుకు రావాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.

గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఏర్పాటు : ఏపీపీఎస్సీ (APPSC)లో జరిగిన అక్రమాలపై దర్యాప్తు కోసం సిట్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 27/2018 నోటిఫికేషన్‌ నియామకాల్లో అక్రమాలు జరిగాయని హైకోర్టులో ఈ ఏడాది ఫిబ్రవరి 11న రిట్‌ అప్పీల్‌, అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమాలపై దర్యాప్తునకు ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. CID చీఫ్ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేశారు. మరో సభ్యుడిగా CID ఎస్పీ కె.చక్రవర్తి నియమితులయ్యారు.

దర్యాప్తునకు సంబంధించి సిట్‌కు అన్ని అధికారాలు అప్పగించారు. సోదాలు చేసేందుకు, ఆధారాల స్వాధీనానికి ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తి అధికారం ఇచ్చారు. దర్యాప్తు అవసరాలకు ఏ ప్రభుత్వ శాఖ నుంచైనా అధికారుల నియామకానికి వెసులుబాటు కల్పించారు. APPSCలో జరిగిన అక్రమాలపై సమగ్రంగా దర్యాప్తు చేసి ఈ ఏడాది మార్చి 16లోగా సిట్‌ తన నివేదికను హైకోర్టుకు సమర్పించాలని ప్రభుత్వం సూచనలు చేసింది.

కీలక ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు : ఏపీపీఎస్సీ గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై కొద్దిరోజులు కిందట ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మూల్యాంకనంలో అక్రమాలను తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అదనపు డీజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో సిట్ బృందం ఏర్పాటు చేయాలని న్యాయస్థానం పేర్కొంది. ఈ దర్యాప్తు జరిపేటప్పుడు రాష్ట్రం వెలుపల ఉన్న ఫోరెన్సిక్ నిపుణుల సహాయం తీసుకోవాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. విజయవాడలో జరిగిన మూల్యాంకనం సమయంలో వినియోగించిన బార్ కోడ్​లు, అసలు ఓఎంఆర్ షీట్లు, వాటి వివరాలు ఒకదానితో ఒకటి సరిపోలుతున్నాయో? లేదో అనే విషయాన్ని విశ్లేషించాలని స్పష్టం చేసింది.

వారిని ప్రాధాన్యం లేని పోస్టులకు బదిలీ : ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున వారందరినీ ప్రాధాన్యం లేని పోస్టులకు బదిలీ చేయాలని సీఎస్​ను ఆదేశించింది. ఈ వ్యవహారంలో తీసుకున్న చర్యలపై నివేదికను కోర్టుకు సమర్పించాలని సీఎస్​కు స్పష్టం చేసింది. మార్చి 16 లోపు గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై సిట్ నివేదికను కోర్టుకు సమర్పించాలని సూచించింది. అయితే గ్రూప్-1 పరీక్షలలో ఎంపికైన అభ్యర్థులను నాన్ ఫోకల్ పోస్ట్​లలోకి మార్చాలని ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నేడు హైకోర్టుకు హాజరయ్యారు.

మాకు న్యాయం చేయండి : గ్రూప్-1 అభ్యర్థులు

గ్రూప్-1 పేపర్ వాల్యూషన్ పేరుతో పీఎస్ఆర్ డ్రామా - కొటేషన్‌పైనే క్యామ్‌సైన్‌కు బాధ్యతలు