సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు విశాఖలో బిజినెస్ ఎక్స్‌పో-2026
ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 'ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్‌పో-2026' - విశాఖలో మూడు రోజుల పాటు భారీ ఎక్స్‌పో నిర్వహణ

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 25, 2026 at 6:53 PM IST
AP Chambers Business Expo 2026 : పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు కొత్త అవకాశాల వేదికగా ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 'బిజినెస్ ఎక్స్‌పో-2026'ను సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్నారు. బీచ్‌రోడ్డులోని గాదిరాజు ప్యాలెస్ ఇందుకు వేదిక కానుంది. విజయవాడలోని ఏపీ ఛాంబర్స్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కర్టెన్‌రైజర్ కార్యక్రమంలో రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎక్స్‌పో బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆలపాటి సురేష్ మాట్లాడుతూ దేశ ఆర్థికాభివృద్ధిలో తయారీ రంగం పాత్ర అత్యంత కీలకమని అన్నారు. సేవలు, ఐటీ రంగాల్లో దేశం ముందంజలో ఉన్నప్పటికీ ఉత్పాదక రంగంలో మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. నిజమైన సంపద సృష్టి తయారీ రంగం ద్వారానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కళాశాల స్థాయి నుంచే యువతలో తయారీ రంగంపై అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలని ఏపీ ఛాంబర్స్‌కు సూచించారు.
180కి ఎగ్జిబిటర్లు - 60కి పైగా స్టార్టప్‌లు: ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు మాట్లాడుతూ వాణిజ్యం, పరిశ్రమలు, వ్యాపార భాగస్వామ్యాలను ప్రోత్సహించే వేదికగా 'కనెక్ట్–బిల్డ్–గ్రో' అనే థీమ్‌తో ఎక్స్‌పోను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత రెండేళ్లుగా విజయవాడలో నిర్వహించిన ఎక్స్‌పోకు విశేష స్పందన లభించిందని, 2024లో 30 వేల మంది, 2025లో 40 వేల మంది సందర్శించారని చెప్పారు. ఈసారి పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్న విశాఖలో ఎక్స్‌పోను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ ఎక్స్‌పోలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ విభాగాలు, ఆర్థిక సంస్థలు ఒకే వేదికపైకి రానున్నాయి. 180కి పైగా ఎగ్జిబిటర్లు, 60కి పైగా స్టార్టప్‌లు, 50 ఆర్థిక సంస్థలు పాల్గొంటాయని తెలిపారు. దాదాపు 50 వేల మంది వ్యాపార సందర్శకులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
8 ప్రత్యేక పెవిలియన్లు: ఫుడ్ ప్రాసెసింగ్, ఇండస్ట్రియల్, ఫ్యాబ్రికేషన్, టూరిజం, గ్రీన్ ఎనర్జీ, స్టార్టప్స్, ప్రభుత్వ విభాగాలు, బ్యాంకింగ్–పీఎస్‌యూ రంగాలకు ప్రత్యేకంగా మొత్తం ఎనిమిది పెవిలియన్లు ఏర్పాటు చేయనున్నారు. పారిశ్రామిక నిపుణులతో సెమినార్లు, బీ2బీ, బీ2జీ సమావేశాలు నిర్వహించడంతో పాటు ఉత్తరాంధ్ర బిజినెస్ డైరెక్టరీని కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఏపీ పర్యాటక రంగానికి మహర్దశ - అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా పక్కా ప్రణాళికలు
ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయి - ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్లీనరీలో మంత్రి లోకేశ్

