అన్నమయ్య జిల్లాలోని నియోజకవర్గాల మార్పు - జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం
20కి పైగా అజెండా అంశాలతో మంత్రివర్గ సమావేశం - జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు ఆమోదం - 28 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ - అమరావతి అభివృద్ధికి ఏడీబీ నిధులతో పనులకు గ్రీన్ సిగ్నల్

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 29, 2025 at 12:38 PM IST
|Updated : December 29, 2025 at 2:16 PM IST
AP Cabinet Meeting Key Decisions : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు 20కి పైగా అజెండా అంశాలపై సమావేశంలో చర్చించారు. జిల్లాల పునర్విభజనపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకుంది. రాజంపేటను కడపకు మార్చే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైల్వేకోడూరును తిరుపతికి మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో 28కి జిల్లాల సంఖ్య పెరగనుంది. ఎల్లుండి తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరులో కలిపేందుకు, కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
అన్నమయ్య జిల్లాను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ జిల్లాలో మిగిలిన రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు నియోజకవర్గాలను మూడు జిల్లాల్లో కలపాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు స్పష్టత ఇచ్చింది. వైఎస్‌ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు చెరుకూరి శ్రీధర్, నిశాంత్ కుమార్‌లను అమరావతికి ఆదివారం పిలిపించారు. తుది ఉత్తర్వులు ఇవ్వడానికి వీలుగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ మేరకు ఇద్దరు కలెక్టర్లు అమరావతిలోనే మకాం వేశారు.
మంత్రి కంటతడి: ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజన అంశంపై చర్చలు జరిగాయి. ఈ సమావేశం జరుగుతున్న సమయంలో రాయచోటి ఎమ్మెల్యే, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లాను విభజించి మిగతా జిల్లాలలో కలపడంపై మనస్థాపం చెందారు. సమావేశంలోనే కంటతడి పెట్టుకున్నారు. ఆ సమయంలో సీఎం చంద్రబాబు మంత్రిని ఓదార్చారు. జిల్లా కేంద్రం మార్చకుంటే తలెత్తే సాంకేతిక ఇబ్బందులు వివరించారు. రాయచోటి అభివృద్ధిని తాను చూసుకుంటానని రాంప్రసాద్ రెడ్డికి చంద్రబాబు హామీ ఇచ్చారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి కంటతడితోనే బయటకు వచ్చారు. రాంప్రసాద్ రెడ్డిని మరో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఓదార్చి తన కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లారు.
మదనపల్లె జిల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీ అమలు దిశగా ఒకట్రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ముందుగా నిర్ణయించిన మేరకు మదనపల్లె జిల్లాలో పుంగనూరు, తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె నియోజవర్గం చేర్చాలని నిర్ణయించింది. అన్నమయ్య జిల్లాలో మూడు నియోజకవర్గాలు మాత్రమే మిగిలిపోయాయి. మూడు నియోజకవర్గాలతో జిల్లా నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. నిర్వహణ భారం, రాజంపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాలు, మరో వైపు రాయచోటిలోనే కొనసాగించాలనే డిమాండ్ల నేపథ్యంలో మధ్యమార్గంగా కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు తిరుపతి జిల్లా నుంచి గూడూరును నెల్లూరులో కలుపుతున్న నేపథ్యంలో రైల్వేకోడూరును తిరుపతి జిల్లాకు, ప్రతిపాదిత మదనపల్లె జిల్లాలోకి రాయచోటి, కడపలోకి రాజంపేట నియోజకవర్గాన్ని కలపాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల విలీనాన్ని ఆయా నియోజకవర్గాల ప్రజల్లో సంతోష వాతావరణం కనిపిస్తోంది. పెనగలూరు, చిట్వేలి మండలాలకు తిరుపతి కాస్త దూరంగా ఉండనుంది. రాయచోటి నియోజకవర్గ ప్రజలు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది.
జిల్లా కేంద్రం మదనపల్లె అయినప్పటికీ అన్నమయ్య పేరుతోనే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అన్నమయ్య పేరును రద్దు చేశారనే అపఖ్యాతి లేకుండా ఆ పేరునే కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు అధికార యంత్రాంగానికి సంకేతాలిచ్చారు.
అమరావతిలో కీలక కార్యాలయాలు - 44 అంశాలకు మంత్రివర్గం ఆమోదం
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు - నేడు సీఎం చంద్రబాబు కేబినెట్‌తో భేటీ!

