ప్రజల రాజధాని 'అమరావతి'ని నిర్మించాలనే నిబద్ధతతో ప్రభుత్వం పనిచేస్తోంది: ఆర్థికశాఖ మంత్రి
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన మంత్రి - రూ.57,868 కోట్ల విలువైన 97 పనులకు పరిపాలనా అనుమతులు జారీ చేసినట్లు వెల్లడి - 10 ప్రాధాన్యతాంశాలను ప్రకటించిన పయ్యావుల

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 14, 2026 at 3:33 PM IST
Amaravati Budget 2026 : ప్రజల రాజధాని అమరావతిని నిర్మించాలనే నిబద్ధతతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను ఆయన శనివారం శాసనసభలో ప్రవేశపెట్టారు. స్వయం సమృద్ధి నమూనాలో వివిధ ఆర్థిక సంస్థల ద్వారా నిధులను సమీకరించి రాజధాని పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. రూ.57,868 కోట్ల విలువైన 97 పనులకు పరిపాలనా అనుమతులు జారీ చేసినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ప్రజల రాజధాని అమరావతిని నిర్మించాలనే తమ ప్రభుత్వ నిబద్ధతకు ఇది స్పష్టమైన నిదర్శనమని పయ్యావుల అన్నారు.
ఇతర పట్టణాల్లోనూ ప్రాజెక్టులు: ప్రజల రాజధాని అమరావతి అభివృద్ధికి మద్దతు అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించే ప్రక్రియను ప్రారంభించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలను మంత్రి పయ్యావుల కేశవ్ తెలియజేశారు.
అమృత్ 2.0 పథకం కింద 117 పట్టణ, స్థానిక సంస్థలలో మొత్తం 506 ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని అన్నారు. అదనంగా యూఐడీఎఫ్, ఏఐఐబీ సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులు కూడా పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్టులన్నింటినీ 2027 డిసెంబరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పయ్యావుల కేశవ్ అన్నారు.
25 లక్షల గృహాలు అందించడమే లక్ష్యం: ఈ 2 ఏళ్ల వ్యవధిలో యూఐడీఎఫ్ కింద ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా రూ.4 వేల కోట్లను మంజూరు చేసిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో ఆధునిక మెట్రో రైలు వ్యవస్థలో ప్రయాణించే కల త్వరలో సాకారం అవుతుందన్నారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ), ఎన్టీఆర్ నగర్స్ కింద ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు 25 లక్షల గృహ పట్టాలు లేదా ఇళ్లను అందించి, సొంత ఇంటి కలను నెరవేర్చడమే మా ప్రభుత్వ లక్ష్యమని పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.
బడ్జెట్ కేటాయింపులు: 2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో వివిధ సంక్షేమ పథకాలు, వివిధ శాఖలకు నిధులు కేటాయించారు. విద్యుత్ రంగానికి రూ.13,934 కోట్లు, రోడ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టులకు రూ.13,546 కోట్లు, అమరావతికి రూ.6,000 కోట్లు, పరిశ్రమలకు రూ.3,161 కోట్లు, పాఠశాల విద్యాశాఖకి రూ.32,308 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకి రూ.22,942 కోట్లు, పర్యావరణ అటవీశాఖకి రూ.714 కోట్లు కేటాయించారు.
మున్సిపల్ శాఖకి రూ.14,539 కోట్లు, హోంశాఖకి రూ.9,165 కోట్లు, ఎక్సైజ్ శాఖకి రూ.500 కోట్లు, మౌలిక సదుపాయాల, పెట్టుబడుల శాఖకి రూ.1,283 కోట్లు, సమాచార సాంకేతిక శాఖకి రూ.536 కోట్లు, పౌరసరఫరాల శాఖకి రూ.3,821 కోట్లు, ధరల స్థిరీకరణ నిధి రూ.500 కోట్లు, ఎస్సీ సంక్షేమం రూ.20,644 కోట్లు, ఎస్టీ సంక్షేమం రూ.9,190 కోట్లు, బీసీ సంక్షేమం రూ.51,021 కోట్లు, మైనారిటీ సంక్షేమం రూ.6,090 కోట్లు, మహిళాశిశు సంక్షేమం రూ.4,582 కోట్లు, వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ రూ.19,306 కోట్లు, కార్మిక శాఖకి రూ.735 కోట్లు కేటాయించారు.
బడ్జెట్‌లో పది ప్రాధాన్యత అంశాలు: రాయసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్, నగర ఆర్థిక వ్యవస్థలు, వీబీ జీ రామ్ జీ, రాష్ట్ర సంపద నిధి, నేతలన్నలకు ఉచిత విద్యుత్, స్కూళ్లు, హాస్టళ్ల మౌలిక సదుపాయాలు, టీఆర్‌ఈడీఎస్ అమలు, క్వాంటమ్ కంప్యూటింగ్, దివ్యాంగులకు ఉచిత బస్సు సర్వీస్, 3 వేల కొత్త పోలీస్ వాహనాలను పది ప్రాధాన్యత అంశాలుగా పయ్యావుల కేశవ్ ప్రకటించారు.
రూ.3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్ - ఏఏ శాఖకు ఏంతెంత కేటాయించారంటే?
'ఆహ్లాదకర వాతావరణంలో ఆత్మీయ విందు' - నేతల కుటుంబాలతో లోకేశ్ సరదా సంభాషణలు

