స్థానిక పోరులో కొత్త అధ్యాయం - ఇకపై ప్రత్యక్ష పద్ధతిలో ఛైర్మన్లు, మేయర్ల ఎన్నిక
స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్కరణలకు సిద్ధమైన ప్రభుత్వం - ఇకపై ప్రత్యక్ష విధానంలో ఛైర్మన్లు, మేయర్ల ఎన్నిక - పట్టణ పాలనలో స్థిరత్వం దిశంగా ప్రభుత్వం చర్యలు - వచ్చే ఎన్నికల్లో అమలుకు సన్నాహాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 20, 2026 at 9:38 AM IST
AP Municipal Amendment Bill : స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇకపై మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లను ప్రజలే నేరుగా ఎన్నుకునేలా నూతన విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మరి ప్రత్యక్ష ఎన్నికలతో పట్టణ పాలనలో నిజంగా స్థిరత్వం వస్తుందా? మేయర్ ఒక పార్టీకి కౌన్సిల్లో మెజార్టీ మరో పార్టీకి వస్తే పరిస్థితి ఏంటి? అనే అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
రాష్ట్రంలో పట్టణ పాలనలో కొత్త అధ్యాయం మొదలుకానుంది. ఇకపై ప్రజలే నేరుగా మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఈ మేరకు మున్సిపల్ చట్ట సవరణకు శాసనసభ ఆమోదం తెలపడంతో రాబోయే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల విధానం అమల్లోకి రానుంది. ఇప్పటివరకు పరోక్ష ఎన్నికల విధానమే అమల్లో ఉండేది. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తమలో ఒకరిని మేయర్ లేదా ఛైర్మన్‌గా ఎన్నుకునేవారు. అయితే ఎన్నికల తర్వాత కౌన్సిల్లో రాజకీయ సమీకరణాలు మారితే దాని ప్రభావం మేయర్, ఛైర్మన్ పదవులపై పడేది. నెల్లూరు, కడపలో ఐదేళ్లలోనే ముగ్గురు మేయర్లు మారిన దాఖలాలున్నాయి.
కౌన్సిల్లో సంఖ్యాబలం మారినా: విశాఖ, గుంటూరులోనూ ఇద్దరు చొప్పున మేయర్లు పనిచేశారు. ఈ పరిస్థితికి ప్రత్యక్ష ఎన్నికల విధానం చెక్ పెడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలు నేరుగా ఎన్నుకున్న మేయర్, ఛైర్మన్‌కు కౌన్సిల్‌లో సంఖ్యాబలం మారినా పదవికి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకొచ్చారు. రాజకీయ సమీకరణాలు మారినా ప్రజల తీర్పుతో ఎన్నికైన నాయకత్వం ఐదేళ్ల పాటు ఆటంకాలు లేకుండా కొనసాగనుంది.
రాబోయే ఎన్నికల్లో ప్రత్యక్ష విధానం: స్థిరమైన నాయకత్వం ఉంటే పట్టణ అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించి అమలు చేయడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. తరచూ నాయకత్వ మార్పుల భయం లేకపోవడంతో మౌలిక వసతులు, రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వంటి సమస్యలపై దీర్ఘకాలిక పరిష్కారాల దిశగా దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ప్రజలు నేరుగా ఎన్నుకోవడంతో మేయర్లు, ఛైర్మన్లపై జవాబుదారీతనం కూడా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో 17 నగరపాలక సంస్థలు, 88 పురపాలక సంఘాలు, 18 నగర పంచాయతీలు ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో అన్ని చోట్ల ప్రత్యక్షంగా మేయర్, ఛైర్మన్ ఎన్నికల విధానం అమలు కానుంది.
ప్రత్యక్ష ఎన్నికలతో బలమైన ప్రజామోదం: స్థానిక పోరులో మేయర్, పురపాలక ఛైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికైన వారికి బలమైన ప్రజామోదం లభిస్తుందని పురలపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ తెలిపారు. అసెంబ్లీలో బుధవారం ఏపీ పురపాలక శాసనాల 4వ సవరణ బిల్లును మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు. దీనికి సభ ఆమోదం తెలిపింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై మేయర్, పురపాలక ఛైర్మన్‌ల ఎంపికకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ మేయర్, పురపాలక ఛైర్మన్‌లను పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటున్నారని అన్నారు. 1986 వరకు మేయర్, పురపాలక ఛైర్మన్‌ల ఎంపికకు పరోక్ష ఎన్నికలు జరిగేవని, ఆ తర్వాత నుంచి 2005 వరకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయని వివరించారు. 2005 నుంచి ఇప్పటి వరకు పరోక్ష ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఇప్పుడు చేస్తున్న చట్ట సవరణలో ఇక నుంచి ఈ ఎన్నికలు ప్రత్యక్ష విధానంలో జరుగుతాయని చెప్పారు. ప్రత్యక్ష ఎన్నిక జరగడం వల్ల మేయర్, ఛైర్మన్‌లపై కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రభావం ఉండదని పేర్కొన్నారు. వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని, మేయర్, ఛైర్మన్ పదవులపై రాజకీయ ప్రభావం తగ్గుతుందని మంత్రి నారాయణ తెలిపారు.
త్వరలో 100 పురపాలక సంఘాలకు ఎన్నికలు - బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు
ఇక ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక - రేపు శాసనసభ ముందుకు బిల్లు

