ETV Bharat / state

నీటి మళ్లింపులు చట్టబద్ధమే - బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌ ఎదుట ఏపీ వాదనలు

కృష్ణా రెండు ట్రైబ్యునళ్లూ ఆ విషయాన్ని ఆమోదించాయి - అంతకుముందు తీసుకున్న నిర్ణయాలకు కొత్త రాష్ట్రాలు కట్టుబడి ఉండాల్సిందే

AP Argues krishna Water Diversion is Legal Before Brijesh Tribunal
AP Argues krishna Water Diversion is Legal Before Brijesh Tribunal (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 19, 2025 at 1:23 PM IST

3 Min Read
Choose ETV Bharat

AP Argues Krishna Water Diversion is Legal Before Brijesh Tribunal: పరీవాహక ప్రాంతం వెలుపలికి నీటి మళ్లింపులు చట్టబద్ధమేనని బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌ ఎదుట ఏపీ వాదనలు వినిపించింది. కృష్ణా రెండు ట్రైబ్యునళ్లూ ఆ విషయాన్ని ఆమోదించాయని గుర్తు చేసింది. అంతకుముందు రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలకు కొత్త రాష్ట్రాలు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. తదుపరి విచారణ జనవరి 21కి ట్రైబ్యునల్‌ వాయిదా వేసింది.

అంతర్రాష్ట్ర నదీ చట్టం ప్రకారం ఒక పరీవాహక ప్రాంతం నుంచి మరో పరీవాహక ప్రాంతానికి తన రాష్ట్రంలోని నీటిని మళ్లించుకోవడం చట్టబద్ధమని ఏపీ తరఫున సీనియర్‌ న్యాయవాది జయదీప్‌ గుప్తా వాదించారు. దిల్లీలో బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌ ముందు గురువారం రెండో రోజు జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్, సభ్యులు జస్టిస్‌ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్‌ తాలపత్ర ఎదుట తన వాదనలు కొనసాగించారు. గుప్తాకు సీనియర్‌ న్యాయవాది ఉమాపతి, న్యాయవాదులు ఎస్‌. సంజయ్, జె. శరత్‌చంద్ర సహకరించారు. కృష్ణా పరీవాహక ప్రాంతం బయటకు నీటిని మళ్లించడం పూర్తిగా చట్టబద్ధమని న్యాయవాదులు స్పష్టం చేశారు. అలా చేయకూడదని ఎక్కడా లేదన్నారు.

నీటి మళ్లింపులు చట్టబద్ధమేనని ఏపీ వాదనలు - తదుపరి విచారణ జనవరి 21కి వాయిదా (ETV)

నీటిని మళ్లింపును నిరోధించని బచావత్‌ ట్రైబ్యునల్‌: రాష్ట్రాన్ని ఒక యూనిట్‌గా చూడాలని నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్నవారితో సహా ఆ రాష్ట్రంలో నివసిస్తున్న అందరి ప్రయోజనాలనూ రాష్ట్రం పరిరక్షించాల్సి ఉంటుందని వివరించారు. ఆ నది నీళ్లు ఇతర బేసిన్లలో వాడుకోకూడదని కానీ, మళ్లించకూడదని కానీ చట్టపరమైన అడ్డంకి ఎక్కడా లేదని వాదించారు. పరీవాహక ప్రాంతం బయటకు నీటిని మళ్లించడాన్ని బచావత్‌ ట్రైబ్యునల్‌ నిరోధించలేదని న్యాయవాదులు పేర్కొన్నారు.

ఆ విషయం ట్రైబ్యునల్‌ దృష్టిలో ఉండి కూడా కాదనలేదన్నారు. దీన్ని రెండో కృష్ణా ట్రైబ్యునల్‌ కూడా సమర్థించిందని పరీవాహక ప్రాంతం బయటికు నీటి మళ్లింపులు చట్టబద్ధమైనవేనని అనుమతించిందన్నారు. రెండో కృష్ణా ట్రైబ్యునల్‌ కృష్ణా పరీవాహకం బయటి ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు అదనపు నీటిని కేటాయించిందని తెలుగుగంగ ప్రాజెక్టుకు జలాలు కేటాయించిందని తద్వారా బయటి పరీవాహక ప్రాంతాలకు నీటి మళ్లింపును గట్టిగా సమర్థించిందని వివరించారు.

నందికొండ ప్రాజెక్టు సంయుక్త నివేదిక ప్రకారం: 2014 రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం కూడా ఈ మళ్లింపులను అంగీకరించిందని 11 షెడ్యూలు నాలుగో పేరాలో ఈ విషయం స్పష్టమవుతుందని అన్నారు. 1956 అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం, 2014 రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కృష్ణా తొలి, రెండో ట్రైబ్యునళ్ల నిర్ణయాలను వెనక్కు తీసుకునే ఆస్కారం లేదని ఏపీ న్యాయవాదులు వాదనలు వినిపించారు. నందికొండ ప్రాజెక్టు సంయుక్త నివేదిక కూడా బయటి పరీవాహకానికి నీటి మళ్లింపును అంగీకరించిందని తెలిపారు. అప్పటి హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రాలు ఈ ఒప్పందం చేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వం, ప్రణాళిక సంఘం దాన్ని ఆమోదించాయని చెప్పారు. ఆ నివేదిక ప్రకారం నందికొండ ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా ఇతర బేసిన్లకు నీటిని మళ్లించారని వివరించారు.

నీటి మళ్లింపులకు నర్మదా జలవివాద ట్రైబ్యునల్‌ ఆమోదం: ఈ క్రమంలో తెలంగాణ కూడా ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని అంతకుముందు రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలకు కొత్త రాష్ట్రాలు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. భవిష్యత్తులో గోదావరి జలాలు మళ్లిస్తారనే ఊహల ఆధారంగా దశాబ్దాల కిందట నిర్మించిన ప్రాజెక్టులు ధ్వంసమయ్యేలా నిర్ణయాలు తీసుకోలేరన్నారు. అలాంటి వాదనలను సమర్థించలేమని ఆ ప్రాజెక్టుల నీటి కేటాయింపులను మార్చలేమని తేల్చి చెప్పారు. బయటి పరీవాహకానికి నీటి మళ్లింపులను నర్మదా జలవివాద ట్రైబ్యునల్‌ ఆమోదించిందని మానవ వాస్తవ జీవితాల ఆధారంగా నీటిని చూడాలే తప్ప భౌగోళిక అంశాల ఆధారంగా చూడలేమని న్యాయవాదులు పేర్కొన్నారు.

కృష్ణా జలాల్లో వాటాను కాపాడుకునేలా గట్టిగా వ్యవహరించాలి - చంద్రబాబుకు జగన్ లేఖ

దిల్లీ కృష్ణా-2 ట్రైబ్యునల్‌ ఎదుట ఏపీ వాదనలు - రాజకీయ కారణాలతో నీళ్లు కేటాయిస్తే జలయుద్ధాలే