ఏపీ నుంచి చైనాకు 2,700 టన్నుల బియ్యం ఎగుమతి - ఐదేళ్ల తర్వాత రికార్డ్
ఆంధ్రప్రదేశ్ నుంచి, చెన్నై పోర్టుకు ఎగుమతి అక్కడి నుంచి నౌక ద్వారా చైనాకు - మరోసారి మైలురాయిని చేరుకున్నట్లుగా ఎక్స్‌లో కాన్కర్ సంస్థ పోస్ట్ - 40 శాతం ఖర్చు ఆదా

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 1, 2026 at 10:27 AM IST
Andhra Rice Exports To China : 2,700 టన్నుల బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి, చెన్నై పోర్టుకు ఎగుమతి చేసినట్లు ఐసీడీ అధికారులు ఎక్స్ ద్వారా తెలిపారు. గత నాలుగైదు ఏళ్లలో ఎప్పుడూ జరగని విధంగా ఈ ఏడు మళ్లీ ఇలా జరగడం ఒక రికార్డ్‌గా మారింది. దీంతో దాదాపు ఐదేళ్ల తర్వాత తండియార్‌పేట్‌లోని కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CONCOR) ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో (ICD)లో బీసీఎన్ వ్యాగన్‌ల ద్వారా ఎగుమతి సరుకుల నిర్వహణ పునఃప్రారంభించినట్లు స్పష్టంగా తెలుస్తుంది.
రవాణా వివరాలు : ఆంధ్రప్రదేశ్‌లోని సామర్లకోట, తణుకులోని కేంద్రాల వద్ద 105 టీఈయూ కంటైనర్ల ద్వారా రవాణా చేశారు. 42 వ్యాగన్లలోకి ఎక్కించిన ఈ బియ్యాన్ని 573 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తండియార్‌పేట్ డిపోకు తరలించారు. అక్కడ ఆ బియ్యాన్ని కంటైనర్లలోకి మార్చి, ఆపై చెన్నై పోర్టుకు సంబంధించిన ఒక ప్రత్యేక నౌక ద్వారా బియ్యాన్ని చైనాకు రవాణా చేశారు. గత నాలుగైదు సంవత్సరాలలో ఇంత భారీ స్థాయిలో బియ్యం ఎగుమతులు జరగలేదని తండియార్‌పేట్ ఐసీడీ అధికారులు వెల్లడించారు.
ICDT/Tondiarpet has exhibited its cargo handling ability by direct handling of 2700 Tonnes of Rice Exports directly from 42 ( BCN)wagons. The rake loaded from Samalkot and Tanuku are directly stuffed in 105 TEUs which are booked & cleared from CONCOR ICD - Tondiarpet (ICDT) to… pic.twitter.com/GJvMnoqxq6
— CONCOR Area-III (South) (@ConcorArea3) May 30, 2026
బహుళ రవాణా సామర్థ్యం : ఆహార భద్రతా చర్యలలో భాగంగా, 2022-23 కాలంలో భారతదేశం నుంచి చైనాకు భారీ ఎత్తున బియ్యం ఎగుమతిని నిషేధించారు. ఆ తర్వాత వరి సాగు విస్తీర్ణం పెరగడం, బియ్యం నిల్వలు మిగులు ఉండటంతో కేంద్ర ప్రభుత్వం 2025 నుంచి ఎగుమతులపై ఆంక్షలను క్రమంగా సడలించడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో చైనా వ్యాపారులు ఆంధ్రప్రదేశ్‌లోని బియ్యం ఎగుమతి ఏజెంట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. లాజిస్టిక్స్, రవాణా బాధ్యత తమకే అప్పగించినట్లు CONCOR అధికారులు తెలిపారు.
ఈ పద్ధతి ద్వారా రవాణా ఖర్చులు ఆదా : సామర్లకోట-తణుకు వద్ద బియ్యం లోడింగ్ చేయడం చెన్నై మీదుగా రవాణా చేయడం, చివరగా చైనాకు నౌక ద్వారా పంపడం ఈ మొత్తం ప్రక్రియను ఒక్క రోజులోనే పూర్తి చేయడం ఒక రికార్డు విజయమని వారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. రహదారి మార్గం ద్వారా కాకుండా రైలు వ్యాగన్ల ద్వారా బియ్యం రవాణా చేయడం వల్ల రవాణా ఖర్చులలో 40% ఆదా అయినట్లు వారు వివరించారు. విశాఖపట్నం పోర్టులో ఎగుమతి ఛార్జీలు అధికంగా ఉండటం, దానికి తోడు తగినన్ని కంటైనర్లు అందుబాటులో లేకపోవడంతో తాము చెన్నై పోర్టును ఎంచుకుంటున్నట్లు ఏజెంట్లు తెలిపారు.
'ఆమె ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుంది - పారిశ్రామికవేత్తగా ఎదిగింది'
ముగ్గురితో ప్రారంభమై 35 మందికి ఉపాధి - వస్త్రరంగంలో రాణిస్తున్న చంద్రకళ

