అవమానాలే గెలుపు సోపానాలు - సులభంగా ఇంగ్లిష్ నేర్పిస్తున్న అనిత
వేలాదిమందికి ఇంగ్లిష్ పాఠాలు చెబుతున్న అనిత - ఇంటర్ వరకు తెలుగు మీడియంలోనే - ఆన్‌లైన్‌లో సులభంగా స్పోకెన్ ఇంగ్లిష్ పాఠాలు - యూట్యూబ్ వీడియోలు, ఇన్‌స్టా రీల్స్‌తో క్రేజ్

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 20, 2026 at 2:16 PM IST
Anitha Of Anantapur Teaching English Classes to Thousands of People: భాష అనేది మాట్లాడడానికి మాత్రమే. అదే మన జ్ఞానాన్ని కొలిచే కొలమానం కాదు. కానీ ఇంగ్లిష్ రాకపోతే చులకనగా చూసే రోజులివి. సరిగ్గా ఇదే వివక్ష, అవమానలను ఎదుర్కొంది ఆ యువతి. వాటన్నింటినీ తట్టుకొని నేడు ప్రపంచానికే ఇంగ్లిష్ నేర్పిస్తోంది. వేలాది మందికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ స్పోకెన్ ఇంగ్లిష్ పాఠాలు చెబుతూ నెలకు లక్షల్లో ఆదాయం ఆర్జిస్తోంది. అనంతపురానికి చెందిన స్పోకెన్ ఇంగ్లిష్ ట్యూటర్ అనిత. ఆమె విజయగాథ ఈ కథనంలో తెలుసుకుందాం.
ట్యూటర్‌గా ఐదేళ్లు: సాధారణంగా చాలామందికి ఇంగ్లిష్ అంటే భయం. తెలుగు మీడియం నేపథ్యం కలిగిన ఆ యువతి అంతే. కానీ ఇంగ్లిష్ రాకపోవడం వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. వాటి నుంచే ఆంగ్ల భాషపై పట్టు సాధించాలని నిర్ణయించుకుంది. ఓ కోచింగ్ సెంటర్‌లో చేరింది. 2 నెలల్లోనే అనుకున్న లక్ష్యం సాధించింది. అదే సెంటర్‌లో దాదాపు 5 ఏళ్లు ఇంగ్లిష్ ట్యూటర్‌గా పనిచేసి వందల మందికి ఇంగ్లిష్ నేర్పించింది. 2022 నుంచి ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తూ దేశవిదేశాల్లోని వారికి సులభంగా ఆంగ్లంలో మాట్లాడటం ఎలాగో నేర్పుతోంది.
అప్పుడు భయం- ఇప్పుడు బోధన: అనంతపురం పట్టణానికి చెందిన ఈమె అనిత. భర్త గంగాధర్ ఇంటర్నెట్ సెంటర్ యజమాని, వీరికి ఇద్దరు పిల్లలు. చిన్ననాటి నుంచే తెలుగు మీడియంలో చదివిన ఆమెకు ఇంగ్లిష్ అంటే విపరీతమైన భయం ఉండేది. ఇంగ్లిష్ క్లాస్ అంటేనే భయపడి, టీచర్ ఎప్పుడు క్లాస్ వదిలి వెళ్తుందా అని ఎదురు చూసేది. క్రమేణా ఇంగ్లిష్ రాని వాళ్లపై ఉండే వివక్షను స్వయంగా రుచి చూసిన అనిత ఎలాగైనా భాషపై పట్టు సాధించాలని అనుకుంది. ఓ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి ఆనతి కాలంలోనే ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడే స్థాయికి చేరింది.
అనిత ప్రతిభ, భాషానైపుణ్యాలను గమనించిన ఇన్‌స్టిట్యూట్ యాజమాన్యం డిగ్రీ సెకండియర్ చదువుతున్న ఆమెను విద్యార్థులకు క్లాసులు చెప్పమని కోరింది. అలా ఉదయం కాలేజీ సాయంత్రం వేళల్లో 2 బ్యాచ్‌లకు క్లాసులు తీసుకోవడం ప్రారంభించింది. ఇంగ్లిష్ అనేది ఒక భాష మాత్రమే. అది మీ తెలివితేటలను డిసైడ్ చేయదు అంటూ మొదటి క్లాసులోనే విద్యార్థుల్లోని భయం పోగొట్టడం అనిత ప్రత్యేకత. దాదాపు 5 ఏళ్లు టీచింగ్ చేస్తూనే డిగ్రీ, ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ, ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేసింది. మధ్యలో కొవిడ్ వల్ల ఇన్‌స్టిట్యూట్ మూతపడడంతో ఆమె ప్రయాణం సరికొత్త మలుపు తిరిగింది.
మౌత్ టాక్ ద్వారానే: ఇంగ్లిష్ అంటే భయపడాలా అంటూ ఆమె చేసిన యూట్యూబ్ వీడియోలు, ఇన్‌స్టా రీల్స్ వైరలయ్యాయి. వందలాది మంది యువత ఆమెను ఫోన్ ద్వారా సంప్రదించడంతో సొంతగా ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, యూకే, గల్ఫ్ దేశాలలో స్థిరపడిన తెలుగు వారు కూడా ఆమె కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసులకు క్యూ కడుతున్నారు. మౌత్ టాక్ ద్వారానే రోజుకు 6 నుంచి 7 ఆన్‌లైన్ బ్యాచ్‌లను రన్ చేస్తోంది అనిత. ఇంటి వద్దే ఉంటూ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా నెలకు లక్ష రూపాయలకు పైగా ఆదాయం అర్జిస్తూ మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తోంది.
'ఆంగ్లంపై భయం పోగొట్టి ఎంతో సులభంగా అనిత ఇంగ్లిష్ నేర్పిస్తుంది. ఎన్ని కోచింగ్ సెంటర్‌లకు వెళ్లినా అంతగా నేర్చుకోలేకపోయాం. అనిత ఇంగ్లిష్ ద్వారా సులభంగా నేర్చుకుంటున్నాం. మిగతా ఇన్‌స్టిట్యూట్‌లతో పోలిస్తే ఫీజు కూడా తక్కువగా తీసుకుంటున్నారు.' -మాధవి, శిక్షణ పొందిన ఉద్యోగి
ఒకప్పుడు ఏ భాష చూసి భయపడిందో అవమానాలు ఎదుర్కొందో నేడు అదే భాషను ఆయుధంగా మలచుకుని, ఎందరికో జీవితాన్ని ఇస్తోంది. పట్టుదల ఉంటే సాధించలేనిదేదీ లేదని నిరూపించిన అనిత ప్రయాణం నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.
కట్టుబాట్లను దాటి కలల బాటలో - ఉష స్ఫూర్తిదాయక ప్రయాణం
వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో మహిళ సత్తా - ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న భగవతి

