కడప గడ్డపై ఏపీఎల్ సందడి - 17 నుంచి టీ20 మ్యాచ్‌లు
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL-2026) ఐదవ సీజన్ - రాయలసీమ క్రికెట్ ప్రేమికుల్లో సరికొత్త ఉత్సాహం - ఈ నెల 17 నుంచి 21 వరకు జరిగే రెండవ దశ మ్యాచ్

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 9, 2026 at 11:42 AM IST
APL Match In Kadapa District : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL-2026) ఐదవ సీజన్ రాయలసీమ క్రికెట్ ప్రేమికుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఇప్పటివరకు విశాఖపట్నానికే పరిమితమైన ఈ మెగా టోర్నీ, ఈసారి కడపలోని వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియానికి తరలిరానుంది. ఈ నెల 17 నుంచి 21 వరకు జరిగే రెండవ దశ మ్యాచ్‌లకు కడప ఆతిథ్యం ఇవ్వనుండగా, హనుమ విహారి, కేఎస్ భరత్ వంటి ఐపీఎల్ స్టార్లను నేరుగా చూసే అవకాశం స్థానిక అభిమానులకు లభించనుంది. యువ క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో విద్యార్థులకు ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) తీసుకున్న నిర్ణయం ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL-2026) ఐదవ సీజన్లో మొత్తం ఏడు జట్లు 32 మ్యాచ్‌లతో కూడిన ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రెండవ దశకు కడప ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక్కడ జరగాల్సిన తొమ్మిది లీగ్ మ్యాచ్‌లు జూన్ 17న జయవాడ సన్ షైనర్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన తుంగభద్ర వారియర్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ప్రారంభమవుతాయి.
ఐపీఎల్ (IPL) స్టార్లతో ఉత్సాహం : ఈ టోర్నమెంట్‌లో రాయలసీమకు చెందిన 'రాయల్స్ ఆఫ్ రాయలసీమ'తో పాటు సింహాద్రి విజాగ్ లయన్స్, కాపిటల్ అమరావతి రాయల్స్, తుంగభద్ర వారియర్స్, విజయవాడ సన్ షైనర్స్, భీమవరం బుల్స్ , కాకినాడ కింగ్స్ జట్లు పోటీపడుతున్నాయి. హనుమ విహారి, రికీ భుయ్,కె.ఎస్. భరత్ వంటి అంతర్జాతీయ, ఐపీఎల్ స్టార్లతో పాటు, తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఉత్సాహంగా ఉన్న అనేకమంది యువ క్రీడాకారులు ఇందులో పాల్గొననున్నారు.
యువతకు ఒక గొప్ప అవకాశం : డే-నైట్ మ్యాచ్‌లను నిర్వహించడానికి వీలుగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్టేడియం పిచ్‌లు అవుట్‌ఫీల్డ్‌ను ACA అధికారులు సిద్ధం చేశారు. స్థానిక క్రీడాభిమానులు తమ అభిమాన ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. యువతలో క్రికెట్ పట్ల ఆసక్తిని మరింత పెంచేందుకు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు స్టేడియంలోకి ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. దీనివల్ల జిల్లాలోని స్థానిక అకాడమీలకు చెందిన వేలాది మంది విద్యార్థులు, క్రికెటర్లకు, దేశీయ, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూసే అవకాశం లభిస్తుంది. మ్యాచ్ షెడ్యూల్, టికెట్ వివరాలు, మ్యాచ్ ముఖ్యాంశాలకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు త్వరలో నిర్వహించనున్నారు.
ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం : రాష్ట్రంలో దాగి ఉన్న యువ క్రికెటర్ల నైపుణ్యాన్ని వెలికితీసి, వారికి ఐపీఎల్ (IPL) వంటి పెద్ద వేదికలపై అవకాశాలు దక్కేలా చేయడమే APL ముఖ్య ఉద్దేశమని శివనాథ్, సతీష్ బాబు స్పష్టం చేశారు. స్థానిక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL)- ఈ నెల 9 నుంచి క్రికెట్ పండుగ- విద్యార్థులకు ఉచిత ప్రవేశం!
నేటి నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 'సీజన్-4' ప్రారంభం - తలపడనున్న 7 జట్లు

