ETV Bharat / state

నగరాలు, పట్టణాల్లో నో డంపింగ్​యార్డులు - రూ.529 కోట్లతో వ్యర్థాల ప్రాసెసింగ్‌ కేంద్రాలు

డంపింగ్‌ యార్డు రహితంగా ఏపీలోని నగరాలు, పట్టణాల అభివృద్ధి - ఇళ్లు, దుకాణాల నుంచి సేకరించిన చెత్త నేరుగా ప్రాసెసింగ్‌ కేంద్రాలకు - రూ.529 కోట్లతో 107 ఫ్రెష్‌ వేస్ట్‌ ప్రాసెసింగ్‌ కేంద్రాల ఏర్పాటు

​​AP Waste Processing Plants
​​AP Waste Processing Plants (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 6, 2026 at 1:42 PM IST

2 Min Read
Choose ETV Bharat

​​AP Waste Processing Plants : రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత దిశగా అడుగులు పడుతున్నాయి. డంపింగ్‌ యార్డు రహితంగా నగరాలు, పట్టణాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఇళ్లు, దుకాణాల్లో సేకరించిన వ్యర్థాలను ఇకపై ఎక్కడపడితే అక్కడ పారేయరు. వాటిని నేరుగా ఆధునిక ప్రాసెసింగ్‌ కేంద్రాలకు తరలించేలా నూతన విధానాన్ని అమలు చేయనున్నారు.

డిసెంబరు నాటికి 107 కేంద్రాలు : పట్టణాల్లో చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా రాష్ట్రవ్యాప్తంగా 107 'ఫ్రెష్‌ వేస్ట్‌ ప్రాసెసింగ్‌ కేంద్రాల'ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వీటిలో 20 కేంద్రాలు ఈ నెలాఖరులోగా ప్రారంభం కానున్నాయి. మిగతా కేంద్రాలను ఈ ఏడాది డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. రోజూ సుమారు 5,300 టన్నుల వ్యర్థాలను ప్రాసెస్‌ చేసే సామర్థ్యంతో ఈ కేంద్రాలను నిర్మిస్తున్నారు. వీటి ఏర్పాటుకు ప్రభుత్వం రూ.529 కోట్లు ఖర్చు చేస్తోంది. వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే మరో ఆరు ప్లాంట్లను కూడా ప్రైవేట్‌ సంస్థల ఆధ్వర్యంలో ప్రారంభించేలా అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు.

తడి చెత్త నుంచి సేంద్రియ ఎరువులు : కొత్తగా ఏర్పాటయ్యే ప్రాసెసింగ్‌ కేంద్రాల్లో తడి చెత్త నుంచి సేంద్రియ ఎరువులు తయారు చేస్తారు. ఏటా 3 లక్షల టన్నుల ఎరువును ఉత్పత్తి చేయాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. ఇలా తయారైన ఎరువులను మార్క్‌ఫెడ్‌కు సరఫరా చేస్తారు. ఇందుకు సంబంధించి స్వచ్ఛాంధ్ర సంస్థ ఇటీవల మార్క్ ఫెడ్ తో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

పొడి చెత్త పునర్వినియోగం : రోజూ సుమారు 2,434 టన్నుల పొడి చెత్త ఈ ప్రాసెసింగ్‌ కేంద్రాలకు రానుంది. ప్లాస్టిక్‌ వస్తువులు, ఇ-వేస్ట్‌ తదితర పొడి చెత్తను పునర్వినియోగం (రీసైక్లింగ్) కోసం పలు సంస్థలకు సరఫరా చేస్తారు. తడి, పొడి వ్యర్థాలను ప్రాసెస్‌ చేయగా మిగిలిన జడ వ్యర్థాలకు కూడా శాస్త్రీయ పరిష్కారం చూపుతారు. మట్టి, ఇటుక, కాంక్రీట్, టైల్స్‌ ముక్కల వంటి వ్యర్థాలను శాస్త్రీయ విధానంలో భూమిలో కలిసేలా ఏర్పాట్లు చేస్తారు. ప్రాసెస్‌ కేంద్రాల్లో వ్యర్థాల నుంచి తయారుచేసే ఇంధనాన్ని (ఆర్‌డీఎఫ్‌) నేరుగా సిమెంట్‌ ఫ్యాక్టరీలకు తరలిస్తారు.

ఆరు నగరాల్లో విద్యుత్ ప్లాంట్లు : ఈ ఫ్రెష్‌ వేస్ట్‌ కేంద్రాల నిర్వహణ బాధ్యతను ఆయా పుర, నగరపాలక సంస్థలు తీసుకుంటాయి. ఇందుకు గాను టన్ను చెత్తకు రూ.550 చొప్పున స్థానిక సంస్థలు చెల్లించాల్సి ఉంటుంది. ప్లాంట్ల ఏర్పాటుకు అయ్యే నిధులను స్వచ్ఛాంధ్ర సంస్థ సమకూర్చుతోంది. కడప, కర్నూలు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, విజయవాడల్లో ఈ ఆరు విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లను ప్రైవేట్‌ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. వీటిలో నాలుగు చోట్ల ప్లాంట్ల ఏర్పాటుకు ప్రైవేట్‌ సంస్థల నుంచి స్వచ్ఛాంధ్ర సంస్థ ఇప్పటికే ఆహ్వానాలు కోరింది.

"రాష్ట్రంలోని అన్ని పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో వ్యర్థాల సమస్యకు ఒకేసారి పరిష్కారం చూపించడం దేశంలో ఇదే మొదటిసారి. డంపింగ్‌ యార్డు రహితంగా నగరాలు, పట్టణాలను అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఆ మేరకు కార్యాచరణ రూపొందించి ఆచరణలో పెడుతున్నాం. నెల్లూరులో ఫ్రెష్‌ వేస్ట్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. ఈ ఏడాది డిసెంబరు నెలాఖరుకు రాష్ట్రంలో చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది." -కె.పట్టాభిరామ్, ఛైర్మన్, స్వచ్ఛాంధ్ర సంస్థ

107 మున్సిపాలిటీల్లో 'ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లు' ఏర్పాటు: మంత్రి నారాయణ

'జీరో వేస్ట్ మార్కెట్ల'కు శ్రీకారం - తడిచెత్త నుంచి ఎరువులు తయారుచేస్తూ సత్ఫలితాలు