అవయవ దానంలో రాష్ట్రానికి 6వ స్థానం - గడిచిన 2 నెలల్లో 64 మందికి కొత్త జీవితం
ప్రభుత్వాసుపత్రుల్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలపై ఇటీవల వైద్యారోగ్యశాఖ, జీవన్ దాన్ ట్రస్ట్ అధికారులతో మంత్రి సత్యకుమార్ సమీక్ష - అవయవ దానాల్లో 50 ఏళ్లలోపు వారే అత్యధికమని వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 3, 2026 at 8:31 PM IST
Andhra Pradesh State Ranks 6th in Country in Organ Donations: అవయవ దానంలో దేశంలోనే ఏపీ 6వ స్థానంలో నిలిచింది. రాష్ట్రాల వారీగా 2025 అవయవదానం జాబితాను కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రభుత్వాసుపత్రుల్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలపై ఇటీవల హైకోర్టు ఆదేశాల దృష్ట్యా వైద్యారోగ్యశాఖ, జీవన్ దాన్ ట్రస్ట్ అధికారులతో మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేసే ఆసుపత్రుల సంఖ్య మూడు నుంచి తొమ్మిదికి పెరిగిందన్నారు.
ఈ జాబితాలో విశాఖ కేజీహెచ్, విమ్స్, గుంటూరు, కర్నూలు జీజీహెచ్సలు, తిరుపతి స్విమ్స్, మంగళగిరి ఎయిమ్స్, తిరుపతి- పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్- పలాసలోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయవాడ జీజీహెచ్ ఉన్నాయని అధికారులు తెలిపారు. కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, ఒంగోలు, అనంతపురం, కడప, తిరుపతి ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ కేసుల నుంచి అవయవాల తొలగింపు, ఇతర ఆసుపత్రులకు తరలించేందుకు అవసరమైన అనుమతులు ఇచ్చామని జీవన ట్రస్ట్ కోఆర్డినేటర్ రాంబాబు మంత్రికి వివరించారు.
64 మంది జీవితాల్లో వెలుగులు: ఈ ఏడాది 2 నెలల్లో 18 మంది బ్రెయిన్ డెడ్ వ్యక్తుల నుంచి అవయవాలు స్వీకరించి 64 మంది జీవితాల్లో వెలుగులు నింపారని మంత్రి తెలిపారు. ఇంతవరకు విశాఖలోని కేజీహెచ్, విమ్స్, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి, కర్నూలు ప్రభుత్వాసుపత్రి ద్వారా ఇప్పటి వరకు బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులు నుంచి 8 కిడ్నీలు, ఒక లివర్ మార్పిడి చేయగా రక్తసంబంధికుల నుంచి 87 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేసినట్లు అధికారులు తెలిపారు.
బాధితులకు భరోసా: తాజాగా విజయవాడ శివారులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి గుండెను స్వీకరించి గుండె మార్పిడి విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఏడాది మరింతగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి అవయవాలు స్వీకరించి అవయవాలు కోసం ఎదురుచూస్తున్న బాధితులకు భరోసా కల్పించేందుకు కృషి చెయ్యాలని జీవన్ దాన్ సమన్వయకర్తలకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు మంత్రి సూచించారు. 1200 మంది బాధితులకు రాష్ట్ర జీవన్ దాన్ నూతన జీవితాలను ప్రసాదించిందని బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి అవయవాలను స్వీకరించి బాధితులకు అండగా నిలుస్తూ వారి జీవితాలకు కొత్త వెలుగులు నింపిందన్నారు. గత ఏడాది కాలంలోనే 301 మంది బాధితులకు నూతన జీవితాలను ప్రసాదించి సరికొత్త చరిత్రను రాష్ట్ర జీవన్ దాన్ సృష్టించింది అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 20-50 ఏళ్ల వయసు మధ్యలో ఎక్కువ మంది అవయవాలు విఫలమై బాధపడుతున్నట్లు రాష్ట్ర జీవన్‌దాన్ ట్రస్ట్ ద్వారా తెలిసిందన్నారు. ట్రస్టులో ఇప్పటి వరకు 5347 మంది పలు అవయవాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోగా వారిలో అధికంగా యువకులే ఉండటం గమనార్హం. ఉత్పాదక వయసులోనే అవయవ వైఫల్యంతో చిక్కిశల్యమవుతుండటంతో వారి వ్యక్తిగత జీవితంలోనే గాక సామాజికంగానూ తీవ్ర నష్టం కలుగుతుందని పేర్కొన్నారు.
ఆర్థిక సాయం: రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో 0-09 ఏళ్లలోపు పిల్లలు 38 మంది ఉన్నారని మంత్రి సత్యకుమార్ తెలిపారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి అవయవాలను స్వీకరించే విధంగా వాళ్లకి గౌరవం కల్పించేడానికి జారీ చేసిన జీవో 95 ద్వారా అవయవ దానం చేసిన వ్యక్తికి ప్రభుత్వ లాంఛనాలతో దహన సంస్కరణలు జరుగుతున్నాయి. అలాగే 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించటం జరుగుతుందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆర్థిక సాయం లక్ష రూపాయల వరకు పెంచే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి సత్యకుమార్ అన్నారు.

