ETV Bharat / state

ఏపీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు - కెప్టెన్లు ఎవరంటే?

మంగళవారం నుంచి మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేచర్ స్పోర్ట్స్ 2026 - మొత్తం 14 క్రీడాంశాల్లో పోటీలు - క్రీడలు, ప్రజాప్రతినిధుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పోటీలు

Andhra Pradesh Legislature Sports 2026
Andhra Pradesh Legislature Sports 2026 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 23, 2026 at 10:19 PM IST

2 Min Read
Choose ETV Bharat

Andhra Pradesh Legislature Sports 2026 : విజయవాడలో రేపటి(మంగళవారం) నుంచి మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేచర్ స్పోర్ట్స్– 2026 జరగనుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనే ఈ క్రీడాపోటీలను స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్డేడియం, దండమూడి రాజగోపాలరావు స్డేడియాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. మొత్తం 14 క్రీడాంశాల్లో జరిగే పోటీలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఆటల పోటీలంటే ఆసక్తి ఉంటుంది. అలాంటిది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీపడే లెజిస్లేచర్ స్పోర్ట్స్ మీట్ అంటే ఆ సందడే వేరు. గత ఏడాది ఘనంగా జరిగిన ఈ పోటీలను ఈ ఏడాది కూడా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్డేడియం, దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియాల్లో మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే శాప్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మైదానాన్ని క్రీడలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. రేపు(మంగళవారం) మధ్యాహ్నం సభాపతి అయ్యన్నపాత్రుడు లెజిస్లేచర్ క్రీడాపోటీలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. బుధ, గురువారాల్లోనూ పోటీలు సాగుతాయి.

క్రీడలను ప్రోత్సహించడమే లక్ష్యంగా : ప్రజాప్రతినిధుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించడం, క్రీడలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ క్రీడోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 156 మంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర మంత్రులు ఈ క్రీడలలో పాల్గొనేందుకు తమ సమ్మతిని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తదితరులు ఈ క్రీడా వేడుకలకు హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్, త్రోబాల్, టెన్నికాయిట్, మ్యూజికల్ ఛైర్స్, పికిల్ బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, షాట్ ఫుట్ వంటి మొత్తం 14 రకాల క్రీడాంశాలలో పోటీలు నిర్వహించనున్నారు. క్రికెట్‌లో మొత్తం 6 జట్లు పోటీ పడుతున్నాయి. ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు కెప్టెన్లుగా వ్యవహరిస్తారు.

గత ఏడాది కంటే ఘనంగా ఏర్పాట్లు : కబడ్డీలో వాసంశెట్టి సుభాష్, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, బి.సి. జనార్దన్ రెడ్డి, రఘురామకృష్ణం రాజు నేతృత్వంలో నాలుగు జట్లు తలపడతాయి. హోం మంత్రి వంగలపూడి అనితతోపాటు మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు క్రికెట్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో చురుగ్గా పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని చాటనున్నారు. క్రీడాపోటీల ఏర్పాట్లను ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, విజయ్ కుమార్, ఎమ్మెల్సీ కల్యాణ్ చక్రవర్తితో కలిసి శాప్ చైర్మన్ రవినాయుడు పరిశీలించారు. గత ఏడాది కంటే ఘనంగా ఈ ఏడాది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడాపోటీలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని శాప్ ఛైర్మన్ రవినాయుడు చెప్పారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో తలమునకలై ఉంటారు. ప్రజా జీవితంలో నిత్యం బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు కాసేపు ఆటవిడుపుగా, సంతోషంగా గడిపేందుకు ఇదో మంచి వేదికని ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ సెల్ ఫోన్లతో గడిపే నేటి చిన్నారులకు తమ క్రీడా పోటీలు ప్రేరణగా నిలవాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పిలుపునిచ్చారు.

ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠ భరితంగా సాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలను స్థానిక ప్రజలు తిలకించే అవకాశం ఉంది. మరోవైపు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

నెలకు 3 చొప్పున 31 క్రీడల్లో జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు - ఇలా అప్లై చేసుకోండి

ఈనాడు స్పోర్ట్స్​ లీగ్​లో అదరగొట్టిన హైదరాబాద్​ హీరోస్​- రెండు విభాగాల్లో విజయం