రాజకీయాల్లోనే కాదు ఆటలలోనూ తగ్గేదేలే - క్రీడాపోటీల్లో సత్తాచాటిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
క్రీడాపోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు - ఆడకపోతే అసెంబ్లీలో మాట్లాడే అవకాశమివ్వనని చమత్కరింతచిన స్పీకర్ అయ్యన్న, పురుషుల జట్లకు ఏ మాత్రం తీసిపోరని నిరూపించిన మహిళా ఎమ్మెల్యేల జట్లు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 25, 2026 at 10:18 AM IST
|Updated : February 25, 2026 at 10:44 AM IST
Andhra Pradesh Legislature Sports 2026 : రాజకీయాల్లోనే కాదు, టగ్ ఆఫ్ వార్‌లోనూ తగ్గేదేలేదంటూ సభాపతి అయ్యన్నపాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు పోటీపడ్డారు. ఎనిమిది పదుల వయసులోనూ రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి యువకులకు ఏమాత్రం తీసిపోని రీతిలో పరుగు పందెంలో ముందుకు దూకారు. ఉత్సాహానికి వయసుతో సంబంధం ఏంటంటూ కామినేని శ్రీనివాస్, గద్దె రామ్మోహన్ ఆయనతో కలిసి పరుగు తీశారు.
ఉపసభాపతి రఘురామకృష్ణరాజు యువకుడిలా చురుగ్గా కదులుతూ కబడ్డీలో కూత పెట్టారు. వాలీబాల్ పోటీల్లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ పురుషుల జట్లకు నాయకత్వం వహించి సారథ్యంలో మహిళలు ఏమాత్రం తీసిపోరని నిరూపించారు. సర్వీస్, లిఫ్ట్, బూస్ట్, అండర్ ఆర్మ్‌లతో పురుషులతో సమానంగా మహిళా సభ్యులు సై అంటే సై అంటూ పోటీపడ్డారు. ఇలాంటి ఎన్నో విశేషాలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం వేదికగా నిలిచింది.
క్రీడా ప్రమాణం చేయించిన గోరంట్ల: ఆంధ్రప్రదేశ్ శాసనవ్యవస్థ ఆడవిడుపు-2026 పేరుతో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఆటల పోటీల్ని శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు, మండలి ఛైర్మన్ మోషేనురాజు, అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, చీఫ్ విప్‌లు జీవీ ఆంజనేయులు, పంచుమర్తి అనురాధ గురువారం సాయంత్రం ప్రారంభించారు. జాతీయ పతాకాన్ని మోషేనురాజు, అసెంబ్లీ జెండాను అయ్యన్నపాత్రుడు ఆవిష్కరించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతో క్రీడా ప్రమాణం చేయించారు.
శాసన మండలి ఛైర్మన్ మోషేన్‌రాజు క్రీడోత్సవాల ప్రారంభ డిక్లరేషన్ చేశారు. వాలీబాల్ క్రీడాకారుడైన విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్ క్రీడాజ్యోతిని తీసుకురాగా అయ్యన్నపాత్రుడు, మోషేనురాజు, రఘురామకృష్ణరాజు, తదితరులు వెలిగించారు. శాప్ ఛైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. సభాపతి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ రాజకీయ నాయకులకు జీవితం మొత్తం టెన్షనే. ప్రజా సమస్యలపై పోరాటం, ఇలా దీని గురించి ఎవరితోనూ నేను చెప్పను. అది అందరికీ తెలుసు. ఈ ఒత్తిడి నుంచి బయటపడటానికి క్రీడలు సహాయపడతాయి.
ప్రస్తుత సభ్యుల్లో 78% యువ ఎమ్మెల్యేలే: నేను వాలీబాల్ క్రీడాకారుణ్నే. డిగ్రీ పూర్తయ్యాక వాలీబాల్ బాగా ఆడేవాడ్ని. ఆ తర్వాత హైదరాబాదు వెళితే నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నానని ఎన్టీఆర్ చెప్పారు. ప్రజాప్రతినిధులకు క్రీడాపోటీల నిర్వహణ ఆధ్యుడు ఎన్టీఆరే. ప్రస్తుత సభ్యుల్లో 78% యువ ఎమ్మెల్యేలున్నారు. అందరూ పోటీల్లో పాల్గొనాలని కోరారు. మండలి ఛైర్మన్ మోషేనురాజు మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రారంభించిన క్రీడాపోటీలు మధ్యలో కుంటుపడ్డాయి. వాటిని అయ్యన్నపాత్రుడు తిరిగి ప్రారంభించడం శుభపరిణామం. పార్టీలు, వ్యక్తుల మధ్య ఉన్న చిన్న చిన్న అభిప్రాయ బేధాలు వీటిలో పాల్గొనడం ద్వారా మరిచిపోవచ్చు. పార్టీలు, లింగబేధం లేకుండా అందరూ పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
క్రీడల్లో సభ్యులు చూపించే స్ఫూర్తి పార్టీల మధ్యన కూడా ఉండాలి. లోక్‌సభ సమావేశాల్లో ఎంపీలు సభలో ఎలా ఉన్నా సెంట్రల్ హాల్‌లో మాత్రం అందరూ కలిసిమెలిసి ఉంటూ ఆరోగ్యకర వాతావరణం ఉంటుంది. క్రీడల్లో ఎలాగైతే ప్రత్యర్థులు శత్రువులు కాదో అసెంబ్లీ అయినా మండలి అయినా సభ ముగిసిన తర్వాత సభ్యులందరూ స్నేహభావంతో ఉండాలి. ప్రతిపక్ష పార్టీలు కూడా ఒక టీంను లీడ్ చేసి పోటీల్లో పాల్గొనాలి. వయసులో పెద్దవారైన వరదరాజులరెడ్డి క్రీడల్లో చూపిస్తున్న స్ఫూర్తి అందరిలోనూ ఉండాలి.
ఉత్సాహంగా పాల్గొన్న ప్రజాప్రతినిధులు: పురుషులు, మహిళా సభ్యులు కలిసి టగ్‌ఆఫ్‌వార్‌లో పోటీపడ్డారు. అయ్యన్నపాత్రుడు బృందంలో వరదరాజులరెడ్డి, పల్లా శ్రీనివాస్‌రావు, జీవీ ఆంజనేయులు, అనురాధ, వసంతకృష్ణప్రసాద్, తదితరులు రఘురామకృష్ణరాజు బృందంలో విష్ణుకుమార్‌రాజు, నక్కా ఆనంద్‌బాబు, చదలవాడ అరవింద్‌బాబు, కానినేని శ్రీనివాస్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, భూమ అఖిలప్రియ, బండారు శ్రావణిశ్రీ, పల్లె సింధూరరెడ్డి తదితరులు తలపడ్డారు.
ఈ సందర్భంగా పెద్ద పెద్ద పర్శనాలిటీలన్నీ అటు వైపే ఉన్నారంటూ అయ్యన్నపాత్రుడు చమత్కరించగా నవ్వులు విరబూశాయి. ఈ పోరులో రఘురామకృష్ణరాజు జట్టు ఒక్క ఉదుటున స్పీకర్ బృందాన్ని సునాయాసంగా లాగి గెలుపొందారు. వీక్షకులు ఈలలు, కేకలతో కేరింతలు కొట్టారు. పరుగు పందెంలో 5 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. 100 మీటర్ల పరుగులో 50 ఏళ్లలోపు పురుషుల విభాగంలో సభ్యులు బోనెల విజయచంద్ర, కేఈ శ్యామ్, కంచెర్ల శ్రీకాంత్, 50-60 ఏళ్ల విభాగంలో పల్లా శ్రీనివాస్‌రావు, థామస్, గాదె శ్రీనివాసులనాయుడు తొలి మూడు స్థానాల్లో నిలిచారు.
సభ్యులతో చమత్కరించిన అయ్యన్న: అంతేకాకుండా 50 మీటర్ల పరుగులో 60-70 ఏళ్ల విభాగంలో బూర్ల రామాంజనేయులు, శ్రీరాం తాతయ్య, వంకా రవీంద్రనాథ్, 70+ విభాగంలో గద్దె రామ్మోహన్‌రావు, రఘురామకృష్ణరాజు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి తొలి మూడు స్థానాల్లో నిలిచారు. 100 మీటర్ల పరుగుపందెంలో 50 ఏళ్లలోపు విభాగంలో మహిళా సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కావలి గ్రీష్మ ప్రథమ, పల్లె సింధూరరెడ్డి ద్వితీయ, శిరీషదేవి తృతీయ స్థానంలో నిలిచారు. మరింత మంది మహిళా సభ్యులు పరుగుపందెంలో పాల్గొనాలని ప్రోత్సహిస్తూ ఆడకపోతే అసెంబ్లీలో మాట్లాడే అవకాశమివ్వనంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చమత్కరించారు.
సభ్యుల మధ్య సరదా వాగ్వాదం: వాలీబాల్ జట్ల సభ్యుల ఎంపికకుగాను తొలుత ప్రాక్టీస్ సెషన్ నిర్వహించారు. రెండు జట్లకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ప్రాతినిధ్యం వహించారు. పురుష సభ్యులతో కలిసి భూమన అఖిలప్రియ, కావలి గ్రీష్మ, పల్లె సింధూరరెడ్డి, అతిథి గజపతిరాజు పాల్గొన్నారు. అయ్యన్నపాత్రుడు, రఘురామకృష్ణరాజు సర్వీస్‌లు చేసి అందరినీ అలరించారు. వాలీబాల్ ఆటగాడైన గణబాబు రెండు జట్ల తరఫున ఆడి ప్రోత్సహించారు. ప్రాక్టీస్ సెషన్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. రఘురామకృష్ణరాజు జట్టు గెలుపొందింది. ఈ సందర్భంగా సరదా వాగ్వాదం చోటుచేసుకోగా కొంతమంది సభ్యుల్లో క్రమశిక్షణారాహిత్యం పెరిగింది. వారికి జరిమానా విదిద్దాం. డబ్బు కడితే వదిలేస్తాం. లేకపోతే రెడ్ కార్డు చూపిద్దామని పలువురు సభ్యులు చమత్కరించారు.
ప్రాక్టీస్ సెషన్ అనంతరం వాలీబాల్ జట్ల ఎంపిక జరిగింది. అఖిలప్రియ జట్టుపై కావలి గ్రీష్మ జట్టు 25-17 తేడాతో గెలుపొందింది. మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. పుత్తా చైతన్యరెడ్డి, వర్లకుమార్‌రాజ, సుందరపు విజయ్‌కుమార్, బోనెల విజయచంద్ర ప్రదర్శన ఆకట్టుకుంది. అఖిలప్రియ, కావలి గ్రీష్మలు సూపర్ సర్వీసులతో పాయింట్ల సాధనలో కీలకంగా వ్యవహరించారు. నేడు నిర్వహించే టెన్నికాయిట్, షటిల్ బ్యాడ్మింటన్ మ్యాచ్‌లకు ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, బండారు శ్రావణిశ్రీ, పల్లా శ్రీనివాస్‌రావు, తదితరులు ప్రాక్టీస్ చేశారు.
ప్రేక్షకుల కేరింతలతో కోలాహలం: కబడ్డీ పోటీల్లో భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి జట్టుపై 28-22తో రఘురామకృష్ణరాజు టీం విజయం సాధించింది. ఇరుజట్ల మధ్య పోరు ఆద్యంత ఉత్కంఠగా సాగింది. బోడే ప్రసాద్, కంచర్ల శ్రీకాంత్, పుత్తా చైతన్యరెడ్డి, కామినేని శ్రీనివాస్, రఘురామకృష్ణరాజు ప్రత్యర్థుల్ని ఉడుంపట్టుపట్టారు. రఘురామకృష్ణరాజు కూతకు వెళ్లినప్పుడు ప్రేక్షకులు ఈలలు, చప్పట్లతో కేరింతలు కొట్టారు. బోడే ప్రసాద్ వెళ్లిన ప్రతి రైడ్‌లోనూ బోనస్ పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించారు.
అంతేకాకుండా సుందరపు విజయ్‌కుమార్, బోనెల విజయ్‌చంద్ర తదితరులు ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. కూతకు వెళ్లి తిరిగొచ్చే క్రమంలో పార్థసారథి కాలుమడతపడగా వైద్య బృందం ఫిజియోథెరఫీ అనంతరం ఆయన యథావిథిగా పోటీలో పాల్గొన్నారు.
"రాజకీయ నాయకులకు జీవితం మొత్తం ఒత్తిడితో నిండి ఉంటుంది. ప్రజా సమస్యలపై పోరాటం, ఇలా దీని గురించి ఎవరితోనో నేను చెప్పను. అది అందరికీ తెలుసు. ఈ ఒత్తిడి నుంచి బయటపడటానికి క్రీడలు సహాయపడతాయి. ప్రస్తుత సభ్యుల్లో 78% యువ ఎమ్మెల్యేలున్నారు. అందరూ పోటీల్లో పాల్గొనాలి". -అయ్యన్నపాత్రుడు, స్పీకర్
"క్రీడల్లో ఎలా ప్రత్యర్థులు, శత్రువులు కాదో అదే విధంగా అందరూ స్నేహభావంతో ఉండాలి. అంతేకాకుండా ప్రతిపక్ష సభ్యులు కూడా ఒక బృందంగా ఏర్పడి క్రీడల్లో పాల్గొంటే బాగుంటుంది. అసెంబ్లీ అయినా మండలి అయినా సభ ముగిసిన తర్వాత సభ్యులందరూ స్నేహభావంతో ఉండాలి". -రఘరామకృష్ణరాజు,ఉపసభాపతి
ఏపీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు - కెప్టెన్లు ఎవరంటే?
నెలకు 3 చొప్పున 31 క్రీడల్లో జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు - ఇలా అప్లై చేసుకోండి

