బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం - రాబోయే రెండు, మూడు రోజుల్లో మరింత బలపడే అవకాశం - గంటకు 40-50 కి.మీ వేగంతో వీచనున్న బలమైన ఈదురు గాలులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 3, 2026 at 3:41 PM IST
Andhra Pradesh Heavy Rain Forecast : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పలు సూచనలు జారీ చేసింది.
మరింత బలపడనున్న అల్పపీడనం : వాయవ్య బంగాళాఖాతంలో తాజా అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలను ఆనుకుని కేంద్రీకృతమై ఉంది. రానున్న రెండు, మూడు రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఏపీలో ఆ జిల్లాల్లో వానలు : శుక్రవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఏలూరు, శ్రీకాకుళం జిల్లాల్లో వానలు పడతాయి. పశ్చిమగోదావరి, కోనసీమ, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఇక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో వాతావరణం చల్లగా ఉంటుంది. అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వివరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణకు భారీ వర్ష సూచన : అల్పపీడన ప్రభావం తెలంగాణపై కూడా తీవ్రంగానే ఉండనుంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సైతం వానలు దంచికొట్టనున్నాయి. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇక దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వివరించారు.
ప్రాజెక్టులకు జలకళ, ఖరీఫ్ రైతులకు శుభవార్త : అల్పపీడనం ప్రభావంతో పోలవరం జిల్లా రంపచోడవరం మన్యంలో గత వారం రోజులుగా విస్తారంగా వానలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. భూపతిపాలెం, ముసరిమిల్లి జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
సూరంపాలెం, మద్దిగడ్డ ప్రాజెక్టులు సైతం నిండుకుండలను తలపిస్తున్నాయి. జలాశయాల్లోకి భారీగా నీరు చేరడంతో వ్యవసాయానికి ఊతం లభించింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సాగునీటి కష్టాలు తీరాయి. రైతులకు పుష్కలంగా సాగునీరు అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో మన్యం రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటలు బాగా పండుతాయన్న ఆశతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
దేశవ్యాప్తంగా వర్షాలు- రుద్రప్రయాగ్‌లో హై అలర్ట్- ముంబయి అతలాకుతలం
అల్పపీడనం ఎఫెక్ట్ - ఆ జిల్లాల్లో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు

