ETV Bharat / state

రాష్ట్ర చరిత్ర తిరగరాసేలా విశాఖలో ఐటీ పరిశ్రమ వృద్ధి

సాగర తీరంలో కార్యకలాపాలకు సిద్ధమైన ఐటీ కంపెనీలు - ఆంధ్రప్రదేశ్‌ను డ్రోన్, ఏరోస్పేస్‌ హబ్‌గా నిలిపేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం - 2025లో సంక్షేమం, అభివృద్ధిలో సమతుల్యం

IT Industries In AP
IT Industries In AP (EENADU)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 1, 2026 at 5:06 PM IST

3 Min Read
Choose ETV Bharat

IT Industries In AP: కూటమి ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టాక విశాఖ విశ్వనగరంగా ఎదుగుతోంది. సువర్ణ అక్షరాలతో లిఖించేలా మరపురాని అధ్యాయాలు ఎన్నో ఉపిరి పోసుకున్నాయి. ప్రముఖ ఐటీ కంపెనీలు సాగర తీరంలో కార్యకలాపాలకు సిద్ధమయ్యాయి. ప్రపంచమంతా విశాఖ వైపు చూసేలా రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది.

13 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు : సీఐఐ ఆధ్వర్యంలో విశాఖ వేదికగా ఐదోసారి పెట్టుబడుల సదస్సు జరిగింది. సుమారు రూ.13లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ప్రపంచ రికార్డులు సృష్టిస్తూ ఆర్కే బీచ్‌ నుంచి భోగాపురం వరకు యోగాంధ్ర-2025 ఘనంగా జరిగింది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథులుగా హాజరై లక్షల మందితో యోగాసనాలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ను డ్రోన్, ఏరోస్పేస్‌ హబ్‌గా నిలిపేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీఎంఆర్‌-మాన్సాస్‌ ఏవియేషన్‌ ఎడ్యుసిటీకి భీమిలి - భోగాపురం సమీపంలో శ్రీకారం చుట్టారు. ప్రపంచ, జాతీయ స్థాయి ఏరోస్పేస్‌ కంపెనీలు, విమాన శిక్షణ సంస్థలు (ఎఫ్‌టీవో) ఫ్లయింగ్‌ స్కూల్స్‌ వంటి వాటిని ఎడ్యు సిటీకి తీసుకొచ్చేలా ప్రణాళికలు చేస్తున్నారు.

కొత్త ఐటీ పాలసీ తీసుకొచ్చిన ప్రభుత్వం : ఐటీ కొత్త పాలసీ తీసుకురావడంతోపాటు, ముందుగా వచ్చే కంపెనీలకు 99 పైసలకే ఎకరం ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతేడాది డిసెంబరులో కాగ్నిజెంట్‌ తన కార్యకలాపాలు ప్రారంభించింది. శాశ్వత క్యాంపస్‌కు భూమి పూజతోపాటు, హిల్‌-2లోని మహతి భవనంలో 800 మంది ఉద్యోగులతో భవనాన్ని ప్రారంభించింది. అదే రోజు మరో రూ.3,740 కోట్ల పెట్టుబడులతో 8 ఐటీ కంపెనీలకు శంకుస్థాపనలు జరిగాయి. టీసీఎస్‌ 2 వేల మందితో తాత్కాలికంగా కార్యకలాపాలు సాగించి, శాశ్వత భవనాలను హిల్‌-3లోని 21.76ఎకరాల్లో నిర్మించేందుకు ఒప్పందం చేసుకుంది.

12 వేల మందికి ఉపాధి కల్పించేలా రూ.1200 కోట్ల పెట్టుబడులతో యాక్సెంచర్‌ ముందుకు రాగా, ఇప్పటికే తాత్కాలిక కార్యకలాపాలు సాగిస్తున్న ఇన్ఫోసిస్‌ శాశ్వత క్యాంపస్‌కు భూమిని కోరింది. అమెజాన్‌ డెవలెప్‌మెంట్‌ సెంటర్‌ మూడేళ్లలో రూ.వందకోట్ల పెట్టుబడితో 833 మంది ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది. గూగుల్, రైడన్‌ సంయుక్తంగా 1 గిగా వాట్‌ సామర్థ్యంతో డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నాయి. నెక్స్‌ట్రా బై ఎయిర్‌టెల్, అదానీ కొనెక్స్‌ వంటివి జాయింట్‌ వెంచర్స్‌గా ఉన్నాయి. ల్యాండ్‌ కేబుల్‌ సెంటర్‌కు భూమి పూజ చేసిన సిఫీతో మెటా జాయింట్‌ వెంచర్‌గా 550 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనుంది. ఒక గిగా వాట్‌ సామర్థ్యంతో డేటా సెంటర్‌ ఏర్పాటుకు రిలయన్స్, బ్రూక్‌ ఫీల్డ్‌ జాయింట్‌ వెంచర్‌గా ముందుకొచ్చాయి.

అభివృద్ధిలోనే కాదు సంక్షేమంలోనూ: కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కింద రూ.10,090 కోట్లను ఖర్చుచేసింది. స్త్రీ శక్తి పథకం కింద 3.25 కోట్ల మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. దీనికి రూ.1,144 కోట్ల మేర ప్రభుత్వం వెచ్చించింది. దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. అన్నదాత సుఖీభవ పథకం కింద 46 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.6,310 కోట్లను జమ చేసింది. దీపం-2 పథకం కింద ఏడాదికి 3 ఉచిత సిలిండర్లను మహిళలకు ఉచితంగా అందించేందుకు రూ.2,684 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పటి వరకు దాదాపు 2 కోట్ల సిలిండర్ల పంపిణీ చేపట్టారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పింఛన్ల పంపిణీకి ఏడాదికి రూ.50 వేల కోట్లను వెచ్చించింది. ఇలా కూటమి ప్రభుత్వం అభివృద్ధికి సంక్షేమానికి మధ్య సమతుల్యం పాటిస్తూ రాష్ట్ర ప్రగతే లక్ష్యంగా దూసుకెళ్తోంది.

సంక్షేమ హాస్టళ్లలో బాలల మృతి ఆందోళనకరం - వైద్యారోగ్య శాఖకు హైకోర్టు ఆదేశాలు

ఎస్సీల జీవనోపాధి కల్పనకు ప్రభుత్వం ముందడుగు - వడ్డీ భారం లేకుండా ఉన్నతి