ETV Bharat / state

ఆంధ్రా కాఫీ ఉత్పత్తులకు ఊతం - రాష్ట్రానికి మరో రెండు ప్రముఖ కంపెనీల రాక

సాగు ఎగుమతుల్లో పురోగతి - అల్లూరి జిల్లాలో 1,375 ప్రాసెసింగ్‌ యూనిట్లు - ప్రైవేటు ప్లాంట్ల ఆధ్వర్యంలో ఏటా 23వేల టన్నుల ఉత్పత్తి - రాష్ట్రానికి వచ్చేందుకు మరో రెండు ప్రైవేటు సంస్థల ఆసక్తి

ఆంధ్రప్రదేశ్ కాఫీ ఉత్పత్తి
ఆంధ్రప్రదేశ్ కాఫీ ఉత్పత్తి (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 31, 2026 at 11:15 AM IST

2 Min Read
Choose ETV Bharat

Araku Coffee Production: కాఫీ సాగు, ఉత్పత్తుల ఎగుమతుల్లో రాష్ట్రం పురోగమిస్తోంది. అరకు కాఫీ మాత్రమే కాకుండా, కాంటినెంటల్, ఇండస్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో కాఫీని ఉత్పత్తి చేస్తున్నాయి. విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుంటూ, మరో రెండు ప్రముఖ కంపెనీలు కూడా రాష్ట్రంలో అడుగుపెట్టబోతున్నాయి. అవి త్వరలో ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు ప్రధాన నగరాలు, పట్టణాల్లో కాఫీ కేఫ్‌లకు ప్రభుత్వం సబ్సిడీలు అందించి ప్రోత్సహిస్తోంది.

ఏడాదికి 15 వేల టన్నులు: దేశీయ కాఫీ గింజల ఉత్పత్తి కర్ణాటకలో 70%, కేరళలో 21%, తమిళనాడులో 5%, ఆంధ్రప్రదేశ్​లో 3%, ఒడిశాలో 1% ఉన్నాయి. కర్ణాటకలో రోబస్టా కాఫీ ఉత్పత్తి అధికంగా ఉంది. అరబికా రకం 79,145 టన్నులు, రోబస్టా 1.78 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతోంది. ఏపీలో అరబికా రకం మాత్రమే పండిస్తున్నారు. ఏడాదికి 15 వేల టన్నుల కాఫీ ఉత్పత్తి అవుతోంది. కాఫీ అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్‌ ఏడో స్థానంలో ఉంది. దేశంలో ఉత్పత్తయ్యే కాఫీలో 70% వివిధ దేశాలకు ఎగుమతి అవుతోంది. దేశీయ మొత్తం కాఫీ వినియోగంలో 73% వాటా దక్షిణాది రాష్ట్రాలదే ఉంది. కాఫీలో రెండు రకాలు అరబికా, రోబస్టా. ప్రపంచ కాఫీ వినియోగంలో అరబికా వాటా 60%, రోబస్టా వాటా 40% ఉంది. అరబికా సున్నితమైన వాసన, రుచి కలిగి ఉంటుంది. రోబస్టా గాఢమైన రుచితో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో పండించేది అరబికా రకమే. ఇది ప్రత్యేక ఫ్లేవర్డ్‌ ప్రొఫైల్‌ కలిగి ఉంటుంది.

ప్రీమియం బ్రాండ్‌: అంతర్జాతీయ గుర్తింపు పొందిన అరకు కాఫీ ప్రీమియం బ్రాండ్‌గా ఎదుగుతోంది. రైతులు సహజ సిద్ధమైన సేంద్రియ సాగు విధానాలను అవలంబిస్తున్నారు. ఇది ప్రత్యేకమైన ఫ్లేవర్డ్‌ ప్రొఫైల్‌ కలిగి ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2.45 లక్షల ఎకరాల్లో 1,50,000 మంది గిరిజన రైతులు సాగు చేస్తున్నారు. కొత్తగా లక్ష ఎకరాల్లో కాఫీ తోటల్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పీఎంఎఫ్‌ఎంఈ (ప్రధానమంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రైజ్‌ స్కీమ్‌) కింద కాఫీ క్లస్టర్‌ అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.11.98 కోట్ల వ్యయంతో 1,375 ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో ఏటా 23 వేల టన్నుల కాఫీ పొడి తయారు చేస్తున్నారు. అందులో ఫ్రీజ్‌ డ్రైడ్‌ ఇన్‌స్టెంట్‌ కాఫీ ఉత్పత్తి అధికంగా ఉంటోంది. కాంటినెంటల్‌ కాఫీ సంస్థ 10 వేల టన్నులు, ఇండస్‌ కాఫీ 8 వేల టన్నులు ఉత్పత్తి చేస్తోంది. వైహాన్‌ కాఫీ 3 వేల టన్నులు, లావాజా 1,000 టన్నులు, ఇతరులు 1,000 టన్నులు తయారు చేస్తున్నారు. వివిధ దేశాల నుంచి అరబికా, రోబస్టా రకాల గింజల్ని దిగుమతి చేసుకుంటున్నాయి. త్వరలో మరో రెండు ప్రముఖ సంస్థలు కూడా రాష్ట్రానికి రాబోతున్నాయి. దీంతో ఏపీలో కాఫీ పొడి తయారీ మరింత పెరగనుంది.

వెలిగొండకు ఒకరోజు ముందే పండగొచ్చింది - ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం

'రాజకీయం కోసమే వైఎస్సార్సీపీ బురద చల్లుతోంది - మెగా డీఎస్సీపై విశాఖలో గురువుల గర్జన