తొలిసారిగా రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవం - 10 ఎకరాల విస్తీర్ణంలో పరేడ్‌గ్రౌండ్‌కు ఏర్పాట్లు
వందేమాతరం, పది సూత్రాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రతిబింబించేలా శకటాలు - రాజధాని గ్రామాల నుంచి సుమారు 10వేల మంది వరకు వస్తారని అంచనా

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 8, 2026 at 9:57 AM IST
Republic Day Celebrations At Amaravathi : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి వైభవాన్ని ప్రపంచానికి చాటుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. గణతంత్ర వేడుకలకు తొలిసారిగా రాజధాని అమరావతి వేదిక కాబోతోంది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక వేడుకలైన గణతంత్ర వేడుకలు, స్వాతంత్య్ర దినోత్సవాల్ని ఏటా విజయవాడలో నిర్వహిస్తోంది. ఇకపై వీటిని అమరావతిలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రాజధానిలో తొలిసారిగా : ఈ నెల 26వ తేదీన జరగనున్న 77వ గణతంత్ర వేడుకల్ని రాజధానిలో తొలిసారి అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాజధాని పరిపాలన నగరంలో మంత్రుల బంగ్లాలకు ఎదురుగా 10 ఎకరాల విస్తీర్ణంలో పరేడ్‌గ్రౌండ్‌ను సిద్ధం చేస్తున్నారు. మరో పదెకరాల్లో పార్కింగ్‌కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్ సిద్ధం చేసే బాధ్యతను ప్రభుత్వం సీఆర్డీఏకి అప్పగించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు సహా దాదాపు 500 మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు.
సుమారు 10వేల మంది వరకు హాజరు : తొలిసారి గణతంత్ర వేడుకల్ని అమరావతిలో నిర్వహిస్తుండటంతో వాటిని తిలకించేందుకు రాజధాని గ్రామాల నుంచి, అటు గుంటూరు, ఇటు విజయవాడ నుంచి సుమారు 10వేల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నెల 24న పూర్తిస్థాయి డ్రస్ రిహార్సల్స్ నిర్వహిస్తారు. వేడుకలకు హాజరయ్యే ప్రముఖులు, ప్రజలకు వేర్వేరుగా బ్లాక్‌లను ఏర్పాటుచేస్తున్నారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా వాటర్‌ప్రూఫ్ షామియానాలు వేదిక వద్ద వేస్తున్నారు. వందేమాతరం, పది సూత్రాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రతిబింబించేలా శకటాలు ఉంటాయి. మూడు ఉత్తమ శకటాలకు బహుమతులను అందజేస్తారు. రాజధాని నిర్మాణ పనుల్లో వేగం పెంచడంతో పాటు, ప్రభుత్వ పాలన అంతా ఈ ప్రాంతం నుంచే సాగుతుందనే సంకేతాలను రాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. రాజధాని అమరావతిలో అధికారిక వేడుకలను నిర్వహించడం ద్వారా అమరావతి అస్తిత్వాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
పక్కాగా ఏర్పాట్లు - సీఎస్ ఆదేశం : గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై సీఎస్ కె.విజయానంద్ వివిధ శాఖల అధికారులతో బుధవారం(7-01-26) సమీక్షించారు. వేడుకల ప్రాంగణంలో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి వసతి, తాత్కాలిక మరుగుదొడ్లు, బారికేడింగ్, ట్రాఫిక్ నియంత్రణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ రోజు హైకోర్టు, అసెంబ్లీ, లోక్‌భవన్, సచివాలయం, సీఎం క్యాంప్ కార్యాలయం సహా ఇతర ప్రభుత్వ భవనాల్ని విద్యుద్దీపాలతో అలంకరించాలని ఆయన ఆదేశించారు. సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, గణతంత్ర వేడుకలకు శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న ఈ తొలి గణతంత్ర వేడుకలు రాజధాని చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోనున్నాయి.
అమరావతికి చట్టబద్ధత కల్పించండి:సీఎం చంద్రబాబు
వైభవానికి వేదికగా విజయవాడ - 3 రోజుల పాటు ఘనంగా 'ఆవకాయ ఉత్సవాలు'

