జ్యోతి యర్రాజీకి రూ.30 లక్షలు ఆర్థిక సాయం - అండగా ఉంటామని మంత్రి లోకేశ్ హామీ
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో 12.96 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరి సరికొత్త చాంఫియన్‌షిప్ రికార్డు - వచ్చే ఒలింపిక్స్‌లో మెడల్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్న మంత్రి లోకేశ్

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 6, 2026 at 4:12 PM IST
Athlete Jyothi Met Minister Lokesh : దక్షిణ కొరియాలోని గుమి వేదికగా జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో స్వర్ణ పతకం గెలిచిన విశాఖకు చెందిన స్టార్ అథ్లెట్, అర్జున అవార్డు గ్రహీత జ్యోతి యర్రాజీ కుటుంబ సభ్యులతో కలిసి ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో 12.96 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరి సరికొత్త చాంఫియన్‌షిప్ రికార్డు నెలకొల్పిన జ్యోతి యర్రాజీని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. అంతర్జాతీయ వేదికపై భారత కీర్తిప్రతిష్టలను పెంచారని ప్రశంసించారు. జ్యోతి యర్రాజీ కుటుంబ యోగ క్షేమాలను మంత్రి నారా లోకేశ్ అడిగి తెలుసుకున్నారు.
వచ్చే ఒలింపిక్స్‌లో మెడల్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు. ఇందుకు అన్ని విధాలా తాము అండగా నిలుస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. కసి, పట్టుదల వల్లే ఈ స్థాయికి వచ్చారని, భవిష్యత్‌లో దేశం మొత్తం తన వెంట నిలుస్తుందని లోకేశ్ భరోసా ఇచ్చారు. వచ్చే ఏషియన్ గేమ్స్, కామన్ వెల్త్ గేమ్స్ సన్నద్ధత కోసం జ్యోతి యర్రాజీకి రూ.30.35 లక్షల ఆర్థిక సాయాన్ని లోకేశ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పాల్గొన్నారు.
ఛాంపియన్‌షిప్ రికార్డును తిరగరాసిన జ్యోతి : అదిరే ప్రదర్శనతో ఆసియా అథ్లెటిక్స్‌లో వరుసగా రెండో స్వర్ణం సాధించింది. ఈ సారి ఛాంపియన్‌షిప్ రికార్డుతో గెలవడం విశేషం. 100 మీటర్ల హర్డిల్స్ రేసును జ్యోతి 12.96 సెకన్లలో ముగించి సత్తా చాటుకుంది. 1998లో ఓల్గా షిషిజినా (కజకిస్తాన్)లో, 2011లో సున్ యావీ (చైనా)లో నెలకొల్పిన ఛాంపియన్‌షిప్ రికార్డు (13.04 సెకన్లు)ను తిరగరాసింది. 2023లోనూ జ్యోతి స్వర్ణ పతకాన్ని(13.09) సాధించింది. 100 మీ హర్డిల్స్‌లో వరుసగా రెండు, అంతకంటే ఎక్కువసార్లు పసిడి పతకాలు సాధించిన అయిదో క్రీడాకారిణి జ్యోతి యర్రాజీ.
ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా : విశాఖకు చెందిన జ్యోతి యర్రాజీ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా అంతర్జాతీయ స్థాయిలో అథ్లెటిక్స్‌లో రాణిస్తోంది. ఇప్పటి వరకు తొమ్మిది సార్లు జాతీయ రికార్డులు తిరగరాసింది. 20కి పైగా అంతర్జాతీయ పతకాలు సాధించింది. ఇప్పటికే భారత్‌లో వేగంగా పరిగెత్తే మహిళా హర్డ్‌లర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
ప్రేక్షకులు లేకున్నా: ఇటీవల దక్షిణ కొరియాలో జరిగిన 2025 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్ 12.96 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణం సాధించింది. 13 సెకన్లలోపు దీన్ని సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. స్టేడియంలో అంతగా ప్రేక్షకులు లేకున్నా ఆమె అద్భుత ప్రదర్శనతో దేశానికే గర్వకారణంగా నిలిచింది.
దీంతో సామాజిక మాధ్యమాల్లో ఆమె పేరు మార్మోగిపోయింది. ఇన్ని రికార్డులు, పతకాలు సాధిస్తున్నా ఇప్పటికీ తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభించట్లేదని క్రీడాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే శనివారం ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది.
లోకేశ్‌ను కలిసిన వెయిట్ లిఫ్టర్ చంద్రిక : ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేశ్‌ను గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్, క్రీడాకారిణి బొల్లినేని చంద్రిక సోమవారం కలిశారు. ఇటీవల తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో జరిగిన ఆసియా ఓపెన్ ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన ఆమెను మంత్రి అభినందించారు.
గతంలో కూడా ఆమె అనేక జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పతకాలు సాధించారు. అందులో 2018 ఆసియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు కాంస్య పతకాలు సాధించారు. అంతేకాకుండా 2017 కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం వంటివి కూడా కైవసం చేసుకున్నారు.
అథ్లెట్ జ్యోతి యర్రాజీకి మహారాష్ట్రలో ఘన సన్మానం - హాజరైన ఎంపీ అప్పలనాయుడు
కోడి పందాలకు 110కి పైగా బరులు - హోటళ్లు, లాడ్జీల కంటే గదులకేే డిమాండ్

