ఒత్తిడిని జయించే అద్భుత వ్యాయామంగా 'థాయ్ చీ' - ట్రెండింగ్‌లో చైనా ప్రాచీన యుద్ధకళ!
హైదరాబాద్ నగరవాసులను ఆకట్టుకుంటున్న చైనా ప్రాచీన యుద్ధకళ 'థాయ్ చీ' - ఒత్తిడిని జయించే అద్భుత వ్యాయామంగా 'మూవింగ్ మెడిటేషన్' - రక్తపోటు, గుండె సమస్యలు, కీళ్ల నొప్పులకు చెక్ పెడుతున్న థాయ్ చీ

Published : July 8, 2026 at 3:01 PM IST
Tai Chi is Gaining popularity in Hyderabad : ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో ఒత్తిడి అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఆ ఒత్తిడిని జయించేందుకు నగరవాసులు సరికొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ కోవలోనే చైనాకు చెందిన ఓ ప్రాచీన యుద్ధ కళ ఇప్పుడు ఒత్తిడిని జయించే అద్భుత వ్యాయామంగా మారింది. అదే 'థాయ్ చీ' చూడటానికి 'మూవింగ్ మెడిటేషన్' గా పేరుగాంచిన 'థాయ్ చీ'ని మన హైదరాబాద్‌లోనూ నేర్పిస్తున్నారు.
ఒత్తిడిని జయించే సాధనం 'థాయ్ చీ' : చైనాకు చెందిన సంప్రదాయ యుద్ధకళ థాయ్ చీ. యుద్ధ కళ అనగానే ఇది చాలా కష్టమైనది,వృద్ధులు చేయలేరు అనుకోవద్దు. థాయ్ చీ అన్ని వయసుల వారూ అవలీలగా చేయగలిగే సులభమైన వ్యాయామం. ప్రతిరోజూ థాయ్ చీ చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా ఉండవచ్చు. ఈ కారణంగానే కొందరు దీన్ని వ్యక్తిగత శిక్షకులను పెట్టుకుని మరి నేర్చుకుంటున్నారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులపై ఉన్న పని ఒత్తిడిని దూరం చేసేందుకు ఈ విద్యను నేర్పిస్తున్నాయి.
ఒత్తిడి తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచటంలో అద్భుతంగా సాయం చేసే థాయ్‌చీ కళ వైపు నగరవాసులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. థాయ్ చీ రక్తపోటును తగ్గించి, గుండె పనితీరును మెరుగుపర్చడం సహా కీళ్ల నొప్పులు తగ్గిస్తుందని అమెరికన్ కాలేజ్ ఆఫ్ రూమటాలజీ పేర్కొంది. థాయ్ చీ చేసిన వృద్ధుల కండరాలు బలంగా తయారై, వాళ్లు కిందపడే ప్రమాదాలు 50 శాతం తగ్గాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అందుకే యుద్ధ కళ అయినప్పటికీ ప్రజలు దీన్ని వ్యాయామంగా తమ జీవనశైలిలో భాగం చేసుకుంటున్నారు.
"నాకు ఆరేళ్ల క్రితం బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చింది. చాలా ఇబ్బందులు పడ్డాను. ఇద్దరు మనుషులు చేయి పట్టుకుంటేనే నడవగలిగేవాడిని. ఇప్పుడు చాలా బలం వచ్చింది. ఎవరి ఆధారం లేకుండానే నడవగలుగుతున్నా. నా ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగుపడిదింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇది అందరికీ ఉపయోగం. ఎవరైనా దీనిని నేర్చుకోవచ్చు"- థాయ్ చీ అభ్యాసకులు
సంపూర్ణ ఆరోగ్యానికి : అందమైన, ఆకర్షణీయ ముద్రలతో నృత్యాన్ని పోలి ఉండటంతో చిన్నాపెద్ద అందరూ ఈ కళ వైపు ఆకర్షితులవుతున్నారు. మనసు, శరీరం శ్వాస ఒక్కతాటిపైకి తెచ్చేలా ఒక క్రమపద్ధతిలో దీని సాధన సాగుతుంది. చేతులు,కాళ్లు, నడుము నెమ్మదిగా కదుపుతూ చేసే ఈ సాధనను నడవలేని పెద్దవారు, వృద్ధులు సులభంగా చేసుకోవచ్చు. అందుకే ఈ కళను మూవింగ్ మెడిటేషన్ అని కూడా అంటారని శిక్షకులు చెబుతున్నారు. కనిష్ఠంగా 20 నిమిషాలు గరిష్ఠంగా గంట వరకూ ఈ వ్యాయామం చేయవచ్చు.
"హైదరాబాద్ నగరంలో థాయ్ చీ శిక్షకులు పరిమితంగా ఉన్నారు. నేను మార్నింగ్, సాయంత్రం వేళల్లో శిక్షణ ఇస్తున్నా. ఎక్కువగా కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు దీనిని నేర్పిస్తున్నాయి. ఒత్తిడి తొలగించేందుకు థాయ్ చీ ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యాయామంలో వేగం పెంచితే ఆత్మరక్షణకు దోహదం చేస్తుంది"- బాబు రావు, థాయ్ చీ శిక్షకుడు
థాయ్ చీ ఎక్కువగా ఒత్తిడి అధికంగా ఉండే కార్పొరేట్ సంస్థలు సైతం తమ ఉద్యోగులకు నేర్పిస్తున్నాయి. థాయ్ చీ వల్ల ఆరోగ్యం చాలా మెరుగు పడుతుందని శిక్షకులు చెబుతున్నారు. మనలోని అంతర్గతశక్తిని వెలికి తీసే ఇటువంటి కళను ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని సూచిస్తున్నారు. థాయ్ చీ' అనేది కేవలం ఒక యుద్ధ కళ మాత్రమే కాదు, మనిషిని శారీరకంగా, మానసికంగా దృఢంగా మార్చే ఒక అద్భుత సాధనం. రోజులో కనీసం అరగంట సమయం కేటాయించి ఈ 'మూవింగ్ మెడిటేషన్'ను దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే ఎలాంటి ఒత్తిడినైనా ఇట్టే జయించవచ్చని, సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
'మామా - ఈ వీకెండ్ అలా లాంగ్ రైడ్ వెళ్లొద్దామా? : నగరంలో ట్రెండవుతున్న 'కమ్యూనిటీ బైక్ రైడింగ్'

