ETV Bharat / state

మహిళల ‘అనంత సమృద్ధి’ బ్రాండ్‌ - ఏటా రూ.35 లక్షల టర్నోవర్​

‘అనంత సమృద్ధి’ బ్రాండ్‌తో ముందడుగు - మహిళా రైతుల సరికొత్త పారిశ్రామిక విప్లవం - రూ. 5 కోట్ల పెట్టుబడితో భారీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ

Anantha Samruddhi Scheme to Improve Business
Anantha Samruddhi Scheme to Improve Business (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 9, 2026 at 3:58 PM IST

2 Min Read
Choose ETV Bharat

Anantha Samruddhi Scheme to Improve Business: అనంతపురం జిల్లాలోని మహిళా రైతులు సరికొత్త పారిశ్రామిక విప్లవానికి తెరలేపారు. ఆర్డీటీ ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌ మార్గదర్శకంలో 202 గ్రామాలకు చెందిన 5,700 మంది రైతులు (వీరిలో 70 శాతం మహిళలే) 9 రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడ్డారు. వీరి ఉత్సాహాన్ని గుర్తించిన ఇక్రిశాట్‌ సంస్థ కూడేరు మండలం ముద్దలాపురంలో వాల్‌మార్ట్‌ ఫౌండేషన్‌ ఆర్థిక సాయంతో రూ. 5 కోట్ల పెట్టుబడితో భారీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమను నిర్మించి ఇచ్చింది. ‘రైతు నేస్తం’ కంపెనీగా రిజిస్టర్‌ అయిన ఈ పరిశ్రమ పూర్తిగా మహిళల చేతుల మీదుగానే నడుస్తోంది.

డెయిరీ ఉత్పత్తులు: రైతులు పండించే చిరుధాన్యాలు, వేరుశనగను సేకరించి, అత్యాధునిక యంత్రాలతో ప్రాసెసింగ్‌ చేసి వంట నూనెలు, చిక్కీలు, మిల్లెట్‌ బిస్కెట్లుగా మార్చుతున్నారు. ఈ ఉత్పత్తులన్నింటినీ ‘అనంత సమృద్ధి’ బ్రాండ్‌ పేరుతో బెంగళూరు, హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాలకు పంపుతున్నారు. ఏటా రూ. 35 లక్షల టర్నోవర్‌తో నడుస్తున్న ఈ పరిశ్రమకు ఉద్యానశాఖ సైతం సహకారం అందిస్తోంది. వచ్చే ఏడాది నుంచి పాలకోవాతో పాటు పలు డెయిరీ ఉత్పత్తుల తయారీతో వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం విశేషం.

1.47 లక్షల మంది డ్వాక్రా మహిళలకు చేయూత: ఇదిలా ఉండగా మరోవైపు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా నిలిచింది. 2025-26లో వ్యక్తిగత వ్యాపార రుణాల విభాగంలో లబ్ధిదారుల సంఖ్యా పరంగా 1.47 లక్షల మంది డ్వాక్రా మహిళలకు చేయూత అందించి దేశంలోనే తొలి స్థానంలో ఉంది. 1.28 లక్షల మందికి రుణ మంజూరుతో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. తర్వాత 1.09 లక్షల మందితో మూడో స్థానంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ఉండగా ఆపై 87 వేల మంది మహిళలకు సహకారం అందించి ఒడిశా నాలుగో స్థానంలో నిలిచింది.

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహారశుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ (పీఎంఎఫ్‌ఎంఈ) పథకాన్ని వినియోగించుకోవడంలోనూ ఆంధ్రప్రదేశ్‌ తొలి స్థానాన్ని ఆక్రమించింది. రాష్ట్రంలో 35,934 మందికి ఈ పథకాన్ని దరి చేర్చారు. తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, ఒడిశా ఉన్నాయి. జాతీయ జీవనోపాధుల కార్యక్రమం అమలుకు సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ తాజా నివేదికలో ఈ వివరాలను పేర్కొంది.

సాగులోనే కాదు చాక్లెట్​ తయారీలోనూ ఏపీ ముద్ర - విదేశాల్లో హై డిమాండ్​

కొత్త దశకు డ్వాక్రా, మెప్మా - కార్పొరేట్‌ దిగ్గజాలుగా ఎదుగుతున్న సంఘాలు