అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్న గుంటూరు వాసులు - 9 నెలల బాబుతో భయాందోళన
ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ దేశాల్లో బిక్కుబిక్కుమంటున్న ప్రవాసులు - అబుదాబి విమానాశ్రయంలో ఇరుక్కుపోయిన అనంతరవరప్పాడు వాసులు - ప్రవాసాంధ్రులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి ధైర్యం చెప్పిన మంత్రి వాసంశెట్టి సుభాష్

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 3, 2026 at 5:06 PM IST
Anantaravarappadu Residents Stranded at Abu Dhabi Airport: అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య రోజు రోజుకూ యుద్ధ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న సమరంలో క్షిపణులు, బాంబుల దాడులతో భీతావాహ వాతావరణం నెలకొంది. సౌదీ అరేబియా, అబుదాబి, దుబాయ్, ఖతార్, కువైట్, తదితర దేశాల్లో ఎప్పుడెప్పుడు ఎటు వైపు నుంచి బాంబులు వర్షం కురుస్తుందో తెలియక భారతీయులు భయపడుతున్నారు.
ఈ క్రమంలోనే అమెరికా నుంచి గుంటూరు జిల్లాకు బయలుదేరిన సంఘ వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులు అబుదాబి విమానాశ్రయంలో ఇరుక్కుపోయారు. 9 నెలల బాబుతో తన భార్య, కోడలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్వదేశం వచ్చేందుకు ఎదురుచూస్తూ చిక్కుకుపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారతరాయబారి కార్యాలయం అధికారులు వారికి కావాల్సినవన్నీ సమకూర్చుతూ బాగా చూసుకుంటున్నారని చెప్పారు. వారిని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావాలని కోరుతున్నారు.
మాట్లాడి ధైర్యం చెప్పిన మంత్రి వాసంశెట్టి: గల్ఫ్ దేశాల్లోని యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రవాసాంధ్రులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి వారి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇజ్రాయిల్ - ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కారణంగా నెలకొన్న పరిస్థితులు, ఆయా దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి భరోసా కల్పించారు. యుద్ధ వాతావరణం కారణంగా కొన్ని విమానాశ్రయాలలో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, సీఎం చంద్రబాబు తాను ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
అక్కడ పనిచేస్తున్న కార్మికులకు ధైర్యం చెబుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుందని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రవాసాంధ్రుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించేందుకు ఏపీ ఎన్ఆర్టీఎస్ ఈమెయిల్: helpline@apnrts.com లకు, 24/7 హెల్ప్ లైన్, +918500027678 వాట్సాప్ ద్వారా సమాచారం అందించవచ్చని అన్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆంధ్రులందరూ ఆందోళన చెందకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని మంత్రి సూభాష్ సూచించారు.
కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు: గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న తెలుగువారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఎన్‌ఆర్‌టీ తరపున దిల్లీలోని ఏపీ భవన్‌లో, అమరావతి ఏపీఎన్‌ఆర్‌టీ కార్యాలయంలో 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఏపీ భవన్ 98719 99430, ఏపీఎన్‌ఆర్‌టీ ఆధ్వర్యంలో 08632340678 టోల్‌ఫ్రీ నంబర్లకు సంప్రదించవచ్చని పేర్కొన్నారు. వీటికి ఫోన్ చేసి సాయం కోరే వారి వివరాలను సంబంధిత దేశ భారతీయ దౌత్యాధికారులకు పంపి సాయం అందించేందుకు ఏర్పాట్లు చేశామని మంత్రి చెప్పారు.
గల్ఫ్ దేశాల్లో 10 లక్షల మంది తెలుగువారు - బాధితులకు ఏపీ ఎన్నార్టీఎస్ సహాయం
గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు: మంత్రి కొండపల్లి

