ETV Bharat / state

జులై1న అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీకి తొలి స్నాతకోత్సవం - ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

డిగ్రీలు ప్రదానం చేయనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - కార్యక్రమంలో పాల్గొననున్న గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేశ్​ - దేశంలో తొలి స్మార్ట్ క్యాంపస్‌గా గుర్తింపు

Anantapur Central University Set For Its First Convocation
Anantapur Central University Set For Its First Convocation (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 27, 2026 at 8:07 AM IST

2 Min Read
Choose ETV Bharat

Anantapur Central University First Convocation : ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభమైన అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం (ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ) చరిత్రలో మరో కీలక ఘట్టానికి సిద్ధమవుతోంది. జులై 1న తొలి స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు విశ్వవిద్యాలయ యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ వేడుకకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానుండటం విశేషం. గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్​తో పాటు పలువురు ప్రముఖులు కూడా కార్యక్రమంలో పాల్గొననున్నారు.

జులై1న అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీకి తొలి స్నాతకోత్సవం (ETV Bharat)

దేశంలో తొలి స్మార్ట్ క్యాంపస్‌గా గుర్తింపు : అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసిన ఈ విశ్వవిద్యాలయం దేశంలో తొలి స్మార్ట్ క్యాంపస్‌గా ప్రత్యేక గుర్తింపు పొందింది. తొలి దశ అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.350 కోట్ల వ్యయం చేశారు. స్మార్ట్ డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆధునిక విద్యా వాతావరణం, భద్రతా వ్యవస్థలతో క్యాంపస్‌ను తీర్చిదిద్దారు. ప్రాంగణంలోని ప్రతి ప్రాంతాన్ని సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచుతూ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

విద్యార్థులకు అత్యాధునిక సదుపాయాలు : 495 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయంలో పది వేల మంది విద్యార్థులు చదువుకునేలా తరగతి గదులు, సెమినార్ హాళ్లు, వసతి గృహాలు నిర్మించారు. ప్రస్తుతం రెండు అకడమిక్ బ్లాకులు, మూడు హాస్టళ్లు, పరిపాలనా భవనం, సోలార్ పార్కు, డేటా సెంటర్, స్మార్ట్ నెట్‌వర్కింగ్ వ్యవస్థ, అత్యాధునిక ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి. క్రీడా మైదానాలు, వ్యాయామశాల, యోగా కేంద్రం, సంగీత సాధన కోసం ప్రత్యేక సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. క్యాంపస్‌లో 650కు పైగా సీసీటీవీ కెమెరాలతో 24 గంటల నిఘా కొనసాగుతోంది.

పరీక్ష రాసిన రోజే ఫలితాలు : సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తున్న ఈ విశ్వవిద్యాలయం దేశంలోనే తొలిసారిగా విద్యార్థులు పరీక్ష రాసిన రోజే సాయంత్రానికి ఫలితాలు విడుదల చేసిన సంస్థగా గుర్తింపు పొందింది. డిజిటల్ పరీక్షా విధానం, వేగవంతమైన మూల్యాంకన ప్రక్రియ ద్వారా ఈ ప్రత్యేకతను సాధించింది. ప్రస్తుతం దేశంలోని 26 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు. విభిన్న ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులతో క్యాంపస్ జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలుస్తోంది.

స్నాతకోత్సవానికి ముస్తాబు : తొలి స్నాతకోత్సవం నేపథ్యంలో విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. భవనాలకు రంగులు వేయడం, రహదారుల అభివృద్ధి, భద్రతా ఏర్పాట్లు, అతిథుల స్వాగత ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా అధికారులు అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. తొలి స్నాతకోత్సవం ద్వారా అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ దేశవ్యాప్తంగా మరోసారి ప్రత్యేక గుర్తింపు పొందనున్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు భావిస్తున్నాయి.

"ప్రస్తుతం క్యాంపస్‌ తొలిదశ అభివృద్ధి మాత్రమే పూర్తైంది. స్మార్ట్ క్యాంపస్​లో మొత్తం డిజిటల్ మౌలిక సదుపాయాలు, అత్యాధునిక ప్రయోగశాల అందుబాటులో ఉన్నాయి. 24 గంటలూ నిఘా పెట్టేందుకు 650 కంటే ఎక్కువ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఉత్తమ సదుపాయాలు ఏర్పాటు చేశాం. విద్యార్థులు సురక్షితంగా ఉన్నారు. స్వల్ప కాలంలో 26 రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. దేశ నలుమూలల నుంచీ వచ్చిన విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు." - ఎస్‌.ఎ. కొరి, ఉపకులపతి , ఏపీ సెంట్రల్ వర్సిటీ

విజ్ఞాన్‌ వర్సిటీలో ఏఐ ల్యాబ్ - గూగుల్‌ ఆధ్వర్యంలో విద్యార్థుల నైపుణ్యానికి పదును

ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో మాస్ కాపీయింగ్ - కెమెరాల కళ్లకు చిక్కిన 20 మంది వైద్య విద్యార్థులు