YUVA : బాల్య వివాహాలకు వ్యతిరేకంగా గళం - బాలికల కోసం సస్మిత సాహు పోరాటం
చాలా ప్రాంతాల్లో మెచ్యూర్ అవ్వగానే బాలికలకు పెళ్లి చేసేయ్యాలి అనే మూఢనమ్మకం - దీనిని వ్యతిరేకిస్తూ నాలుగేళ్లుగా బాల్యవివాహాలపై విస్తృత పోరాటం - మురికివాడల్లో తిరుగుతూ అవగాహన కల్పిస్తున్న సస్మిత

Published : January 7, 2026 at 4:45 PM IST
woman fight against child marriages : టెక్నాలజీ ఎంత మారినా అభివృద్ధి పరంగా ఏం సాధించినా కొన్ని సమస్యలు మాత్రం అలాగే ఉండిపోతున్నాయి. బాల్య వివాహాల సమస్య అందులో ఒకటి. బాల్యాన్ని చిదిమేస్తూ పెళ్లి అనే భారంతో ఆడపిల్లల్ని కట్టిపడేస్తున్నారు కొందరు. ఇప్పటికీ అమ్మాయిలకు చదువు దండగ అనేవాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. చిన్న వయసులోనే వివాహాలు చేసి, వారి భవిష్యత్తును చీకటిలోకి నెడుతున్నారు. అలాంటి పరిస్థితులను ఎదుర్కొని బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది ఒడిశాకు చెందిన సస్మిత సాహు ఆమె ప్రయాణంపై ప్రత్యేక కథనం.
త్వరగా వివాహం చేయాలని : కొందరికి ఏదో సాధించాలనే తపన ఉంటుంది. కలలు నెరవేర్చుకునే క్రమంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటారు. అంత సులువుగా ఓటమిని అంగీకరించరు. అలాంటి వారిలో ఒకరు బెర్హంపూర్‌లో పుట్టి పెరిగిన సస్మిత సాహు. ఇంటికి పెద్ద కూతురు కావడం వల్ల తన కాళ్ల మీద తాను నిలబడాలని అనుకుంది. కానీ ఆమె ఒకటి తలిస్తే కుటుంబ సభ్యులు మరొకటి తలిచారు. వీలైనంత త్వరగా వివాహం చేయాలని పట్టుపట్టారు. ఫలితంగా ఆమె కలలన్నీ తలకిందులయ్యాయి.
తన భవిష్యత్‌కు తానే పునాది వేసుకుని : అప్పటికి ఆమెకు 16 ఏళ్లు. పదోతరగతి పూర్తైంది. ఆ వయసులో పెళ్లి అంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు. కానీ సస్మిత మాత్రం ఏదో ఓ దారి ఉంటుందని ఆలోచించింది. స్థానిక యంత్రాంగాన్ని సంప్రదించి తన భవిష్యత్‌కు తానే పునాది వేసుకుంది. ఆమె చేసిన ఆ పోరాటం వల్ల పెళ్లి ఆగిపోయింది. అధికారులు వచ్చి ఆమె తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. అంతే కాదు సస్మిత చదువుకునే విధంగా ప్రోత్సహించారు. అలా అతి పెద్ద సమస్య నుంచి బయటపడ్డానని చెబుతోంది సస్మిత సాహు.
"చిన్న వయసులోనే ఆడపిల్లలు మెచ్యూర్ అవ్వగానే పెళ్లి చేసేయ్యాలి అనే మూఢనమ్మకం చాలా ప్రాంతాల్లో ఉండేది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈ నమ్మకాలు ఉన్నాయి. ప్రస్తుతం నా వయసు 21 ఏళ్లు. ఇప్పుడు నేను బాలికల మండలిలో బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాను. మా చుట్టుపక్కల ఎక్కడైతే ఇలా బాల్య వివాహాలు జరుగుతున్నాయో వారి ఇంటికి వెళ్లి దీని గురించి చెబుతున్నాను. బాలికలకు కూడా వివరిస్తున్నాను." - సస్మిత సాహు
సంప్రదాయం ముసుగులో : చట్ట వ్యతిరేకమని తెలిసినా కొంతమంది మాత్రం సంప్రదాయం ముసుగులో బాల్య వివాహాలు చేస్తున్నారు. అందుకే వీటిపై పోరాడాలని నిర్ణయించుకుంది సస్మిత. భువనేశ్వర్‌లో రామాదేవి ఉమెన్స్ కాలేజిలో డిగ్రీ చదువుతున్న ఈ యువతి అంగన్‌వాడీ కార్యకర్తలతో కలిసి మురికివాడల్లో ఉన్న ప్రజలకు బాల్య వివాహాలపై అవగాహన కల్పిస్తోంది.
చదువు ప్రాముఖ్యతను వివరిస్తూ : 4 ఏళ్లలో 10 పైగా బాల్య వివాహాలను అడ్డుకున్న సస్మిత టీచర్ కావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నానని అంటోంది. గ్రామంలో జరిగే బాల్య వివాహాలను అడ్డుకుంటూ అమ్మాయిలకు చదువు ఎంత ముఖ్యమో అవగాహన కల్పిస్తోంది. చిన్న వయసులోనే వివాహం చేస్తే తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యల గురించి నిరక్షరాస్యులకు వివరిస్తోంది సస్మిత. తనకు ఎదురైన పరిస్థితులు ఏ అమ్మాయికి రాకూడదనుకుంది సస్మిత. అందుకే పోరాటం కొనసాగిస్తోంది. బాల్య వివాహాలు నిర్మూలించడమే ధ్యేయంగా ముందుకు సాగుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
"తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఏంటంటే మొదట మీ పిల్లల్ని చదివించండి. వారిని చదివించకపోతే భవిష్యత్తులో వారి పిల్లలకు చదువు కూడా కష్టమవుతుంది. వారు చదువుకోవడం వల్ల భవిష్యత్తులో వారి లక్ష్యాలు నెరవేర్చుకోడానికి అవకాశం ఉంటుంది." - సస్మిత సాహు
బాల్యవివాహాలపై పోరాటం- మాదకద్రవ్యాల వినియోగంపై గళం- స్వీపర్ హీరా బీబీ స్టోరీ ఇదే!
పెళ్లిళ్లు అడ్డుకొని కౌన్సిలింగ్ ఇచ్చినా - ఆ జిల్లాలో ఆగని బాల్య వివాహాలు

