గల్ఫ్ దేశాలపై ఇరాన్ బాంబుల దాడి - తెలంగాణలోని వారి బంధువుల్లో అలజడి
అట్టుడుకుతున్న పశ్చిమాసియా - అప్రమత్తమైన గల్ఫ్ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు - గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులకు పలు సూచనలు చేసిన భారత ఎంబసీ అధికారులు

Published : March 1, 2026 at 12:27 PM IST
Iran bombs on Gulf countries : ఇరాన్ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల సంయుక్త సైనిక ఆపరేషన్‌తో పశ్చిమాసియా ఒక రకంగా చెప్పాలంటే అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయాలు అప్రమత్తమయ్యాయి. అమెరికా బేస్ క్యాంపులే లక్ష్యంగా ఇరాన్ దాడులకు దిగుతుండటంతో యూఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, దుబాయ్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, అబుదాబి, ఇజ్రాయెల్ ఆయా దేశాల్లో ఉన్న భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, స్థానిక అధికారులు ఇచ్చిన సూచనలు కచ్చితంగా పాటించాలని గల్ఫ్ ప్రాంతంలోని పలు భారత ఎంబసీలు అప్రమత్తం చేశాయి. అక్కడున్న వలస కార్మికుల మొబైల్ ఫోన్లకు వాట్సప్ నెంబర్లు పంపించి, అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాలని సూచిస్తున్నారు. దీంతో ఇక్కడున్న వారి కుటుంబసభ్యులు, బంధువుల్లో తీవ్ర ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి.
భవనాల కింద బంకర్లలోకి వెళ్తున్నాం : 'రాత్రింబవళ్లు సైరన్‌ల శబ్దం మోగుతోంది. ఎప్పుడు ఏ వైపు నుంచి మిసైళ్ల వర్షం కురుస్తుందో తెలియడం లేదు. క్షిపణులు దాడులు చేసే పది నిమిషాల ముందు మా మొబైల్ ఫోన్లకు ఎమర్జెన్సీ అలెర్ట్ సందేశం వస్తుంది. సైరన్ మోగిన వెంటనే హుటాహుటిన పరుగెత్తి, భవనాల కింద ఉన్న బంకర్లలో తలదాచుకుంటున్నాం. యుద్ధ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని స్వదేశానికి తిరిగి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా, సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. చాలా భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నా. ప్రస్తుతానికైతే మేమంతా క్షేమంగా ఉన్నాం' అంటూ ఇజ్రాయెల్‌లో ఉన్న అనిల్ శనివారం సాయంత్రం ఈటీవీ భారత్‌తో తెలిపారు.
బాధిత కుటుంబాల్లో ఆందోళన : ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఉత్తర తెలంగాణకు చెందిన లక్షల మంది గల్ఫ్ దేశాల్లో వివిధ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కొందరు భవన నిర్మాణ కార్మికులుగా, మరికొందరు తోట పనులు, ఇంకొందరు కారు డ్రైవర్లుగా ఇలా వివిధ రంగాల్లో పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. గల్ఫ్ దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అక్కడ ఉపాధి పొందుతున్న వారి బాధిత కుటుంబసభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. తమ వారు ఎలా ఉన్నారో అంటూ పదే పదే వారికి వాట్సప్ కాల్ చేస్తూ యోగక్షేమాలు అడిగి అక్కడి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. అందరూ క్షేమంగా ఉన్నామని చెబుతుండటంతో వారు ఊపిరి తీసుకుంటున్నారు.
ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక : ఇజ్రాయెల్‌తో పాటు మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా స్థావరాలపై ఎడతెరిపి లేకుండా దాడి చేస్తున్న ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. ఇంతకు ముందెన్నడూ చూడని బలంతో ప్రతిదాడులు చేస్తామని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. చాలా తీవ్రంగా, ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా దాడులు చేయనున్నట్లు ఇరాన్ ప్రకటించిందని ట్రంప్ గుర్తుచేశారు. వారు అలా చేయకపోవడమే మంచిదని, ఒకవేళ చేస్తే తాము కూడా ఇంతకు ముందు చూడని శక్తితో విరుచుకుపడతామని ట్రంప్ చెప్పారు.
దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసివేత : యూఏఈలో అతిపెద్ద, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే వాటిలో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. ఇరాన్ మిస్సైల్ దాడిలో ఇక్కడ నలుగురు గాయపడ్డారు. కువైట్ ఇంటర్నేషనల్‌తో సహా ఈ ప్రాంతంలోని ఇతర వాణిజ్య విమానాశ్రయాలపై కూడా ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. యూరప్, ఆఫ్రికా, పశ్చిమ దేశాలను ఆసియాకు అనుసంధానించే కీలక విమానాశ్రయాలు ప్రత్యక్ష దాడులకు గురయ్యాయి. ఇజ్రాయెల్, ఖతార్, సిరియా, ఇరాన్, ఇరాక్, కువైట్, బహ్రెయిన్ తమ వైమానిక ప్రాంతాన్ని మూసివేయడంతో లక్షల మంది అక్కడే చిక్కుకుపోయారు.
ఇరాన్ అలా చేస్తే ఇంతకు ముందు చూడని శక్తితో విరుచుకుపడతాం: ట్రంప్ బిగ్ వార్నింగ్
దుబాయ్, రియాద్, దోహాపై ఇరాన్ క్షిపణి దాడులు- అమెరికా సైనిక స్థావరాలే టార్గెట్!

