చురుకుగా అమరావతి నిర్మాణ పనులు - చెన్నై- కోల్‌కతా హైవేతో అనుసంధానం
చెన్నై- కోల్‌కతా హైవేతో అమరావతి అనుసంధానం - మంగళగిరి ఎయిమ్స్ సమీపంలో కొండ మీదుగా ఘాట్ రోడ్డు, చురుగ్గా నిర్మాణ పనులు, ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యం

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 27, 2025 at 7:29 AM IST
Amaravati Connected To Chennai-Kolkata Highway: రాజధాని అమరావతిని యర్రబాలెం నుంచి చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారితో (ఎన్‌హెచ్-16) అనుసంధానించే ఇ-13 రోడ్డు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా నెక్కల్లు నుంచి యర్రబాలెం వరకు ప్రతిపాదించిన ఇ-13 రహదారిని ఇప్పుడు ఎన్‌హెచ్-16 వరకు పొడిగిస్తున్నారు.
మంగళగిరి ఎయిమ్స్ సమీపంలో ఘాట్‌రోడ్డు: ఇది విజయవాడ- మంగళగిరి మధ్య డీజీపీ కార్యాలయం సమీపంలో ఎన్‌హెచ్-16తో కలుస్తుంది. యర్రబాలెం నుంచి ఎన్‌హెచ్-16 వరకు సుమారు 3.54 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ రహదారి మార్గంలో కొండలు ఉన్నాయి. సుమారు కిలోమీటరు పొడవున కొండలపై ఘాట్ రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ రహదారి నిర్మాణం కొంత దూరం ఎలివేటెడ్ కారిడార్, ఆ తర్వాత కొంత దూరం కొండపై రహదారి, మళ్లీ కొంత దూరం ఎలివేటెడ్ కారిడార్, మళ్లీ కొంత దూరం కొండపైన, ఆ తర్వాత ఫ్లైఓవర్, చివర్లో ట్రంపెట్ ఇలా సాగుతుంది. రహదారి నిర్మాణానికి మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని కొండను చదును చేయడం వంటి పనులు చురుగ్గా సాగుతున్నాయి.
రాజధాని మాస్టర్‌ప్లాన్ ప్రకారం ఇ-13 రహదారిని నెక్కల్లు నుంచి యర్రబాలెం వరకు 7.5 కిలోమీటర్ల దూరం వరకు నిర్మిస్తున్నారు. ఇది ఆరు వరుసల రహదారి. 2024వ సంవత్సరంలో రాజధాని పనులను పునఃప్రారంభించాక అమరావతిని బయటి ప్రాంతాలతో అనుసంధానించేందుకు కొన్ని రహదారులను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇ-13 రహదారిని యర్రబాలెం నుంచి నేరుగా ఎన్‌హెచ్-16 వరకు పొడిగిస్తున్నారు.
ఈ దూరం సుమారు 3.54 కిలోమీటర్లు ఉంది. దీన్ని కూడా ఆరు వరుసలుగా నిర్మిస్తున్నారు. మధ్యలో కొంచెం అటవీ భూమి ఉండటంతో రోడ్డు నిర్మాణానికి కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అనుమతులను తీసుకున్నారు. రూ.384 కోట్ల అంచనా వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులను చేపట్టారు. ఏడాదిలో పూర్తి చేయాలన్నది లక్ష్యం.
రహదారి నిర్మాణం చేస్తారిలా! యర్రబాలెం నుంచి ఎన్‌హెచ్-16 వరకు 3.54 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణానికి లీ కన్సల్టెన్సీ సంస్థ డీపీఆర్, ఇంజినీరింగ్ డిజైన్లను రూపొందించింది. అంతేకాకుండా మధ్యలో కొండల మీదుగా ఘాట్ రోడ్డును నిర్మించాల్సి రావడం, చివర్లో జాతీయ రహదారితో అనుసంధానించేందుకు ట్రంపెట్ నిర్మిస్తుండటంతో ఈ రోడ్డు డిజైన్ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ డిజైన్ ప్రకారం యర్రబాలెం నుంచి మొదట 400 మీటర్ల దూరం కింది నుంచి పైకి ఏటవాలుగా రహదారిని నిర్మిస్తారు. అక్కడి నుంచి 960 మీటర్ల దూరం స్తంభాలపై ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తారు. ఆ తర్వాత రైల్వే లైన్‌పై 76 మీటర్ల పొడవైన రైల్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) వస్తుంది. దీన్ని దాటిన తర్వాత మళ్లీ 405 మీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తారు. అక్కడి నుంచి దాదాపు 741 మీటర్ల పొడవున కొండపై ఘాట్‌రోడ్డును నిర్మిస్తారు.
ఆ తర్వాత కొంత లోయ భాగం, తర్వాత మళ్లీ కొండ ఉండటంతో లోయ భాగంలో 560 మీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్, ఆ తర్వాత మళ్లీ కొండపై 230 మీటర్ల పొడవైన ఘాట్ రోడ్డును నిర్మిస్తారు. అక్కడి నుంచి జాతీయ రహదారి వరకు 360 మీటర్ల పొడవున ఏటవాలుగా రోడ్డును నిర్మిస్తారు. జాతీయ రహదారిని దాటేందుకు దాదాపు 5.5 మీటర్ల ఎత్తున్న ఫ్లైవోవర్, దాని చివరన ఓ ట్రంపెట్‌ను సైతం నిర్మిస్తారు.
గుంటూరు నుంచి అమరావతిలోకి, అమరావతి నుంచి విజయవాడ వైపు వెళ్లేవారు ప్రయాణికులు సర్వీసు రహదారుల మీదుగా జాతీయ రహదారిపైకి సురక్షితంగా చేరుకునే విధంగా అమరావతి నుంచి గుంటూరు వైపు, విజయవాడ నుంచి అమరావతిలోకి వెళ్లేవారు ట్రంపెట్ మీదుగా వెళ్లేలా డిజైన్‌ను రూపొందించారు.
రాజధాని అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు భూసేకరణ- 4 జిల్లాల్లో గెజిట్
ఎటుచూసినా వాహనాలు, భారీ యంత్రాలు - శరవేగంగా అమరావతి నిర్మాణ పనులు

