అమరావతిలో ప్రపంచంలోనే ఎత్తైన ఫెర్రిస్ వీల్ - 'అమరావతి ఐ' కోసం మళ్లీ టెండర్లు
అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా 'అమరావతి ఐ' నిర్మాణం - సీఎం చంద్రబాబు సూచనతో ప్రాజెక్టుకు శ్రీకారం - వాణిజ్య సముదాయాల స్థలం పెంపు - కొత్తగా టెండర్ల ఆహ్వానం

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 25, 2026 at 9:19 AM IST
|Updated : August 25, 2026 at 2:38 PM IST
Amaravati Eye Ferris Wheel : రాజధాని అమరావతిలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 'ఫెర్రిస్ వీల్'ను నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు దీనికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దీని నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏజీఐసీఎల్) తాజాగా మళ్లీ టెండర్లను ఆహ్వానించింది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించేలా ఈ కట్టడాన్ని అద్భుతంగా తీర్చిదిద్దనున్నారు.
లండన్ ఐ స్ఫూర్తితో : రాజధానిలోని కృష్ణా నది ఒడ్డున ఈ భారీ ఫెర్రిస్ వీల్‌ను నిర్మించనున్నారు. బ్రిటన్ రాజధాని లండన్‌లో థేమ్స్ నది తీరాన ఉన్న 'లండన్ ఐ' స్ఫూర్తితో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. అందుకే దీనికి 'అమరావతి ఐ' అని నామకరణం చేశారు. లండన్ ఐ ఎత్తు 120 మీటర్లు. అయితే మన అమరావతి ఐ ఎత్తును మొదట 139 మీటర్లుగా ప్రతిపాదించారు. భవిష్యత్తులో ఇది రాజధాని నగరానికే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
వాణిజ్య స్థలం పెంపు : ఫెర్రిస్ వీల్ నిర్మాణం కోసం గతంలోనే ఏజీఐసీఎల్ టెండర్లు పిలిచింది. వీల్ కోసం 5 ఎకరాలు, కమర్షియల్ (వాణిజ్య) అవసరాలకు ఒక ఎకరం ఇస్తామని ప్రకటించింది. కానీ ఆ టెండర్లకు స్పందన రాలేదు. అమరావతి ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఈ క్రమంలో వాణిజ్య అవసరాలకు కేవలం ఒక ఎకరం ఇస్తే, ప్రాజెక్టు లాభదాయకంగా ఉండదని ప్రీ బిడ్ మీటింగ్‌లో నిర్మాణ సంస్థలు తెలిపాయి. వాణిజ్య స్థలాన్ని మరింత పెంచాలని కోరాయి. వారి వినతుల నేపథ్యంలో నిబంధనలు సవరించి ఏజీఐసీఎల్ తాజాగా మళ్లీ టెండర్లు పిలిచింది.
ప్రపంచ రికార్డును బద్దలు కొట్టేలా : ప్రస్తుతం దుబాయ్‌లోని 'ఎయిన్ దుబాయ్' ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫెర్రిస్ వీల్. దీని ఎత్తు 250 మీటర్లు. అందులో 48 కాప్స్యూల్స్ ఉంటాయి. ఒకేసారి 1,750 మంది అందులో కూర్చోవచ్చు. ఆ తర్వాత అమెరికాలోని లాస్ వెగాస్‌లోని హై రోలర్ (167.6 మీటర్లు), సింగపూర్ ఫ్లయర్ (165 మీటర్లు) ఉన్నాయి. అయితే, అమరావతి ఐని ప్రపంచంలోనే అత్యంత ఎత్తుగా నిర్మించాలని సీఎం చంద్రబాబు సూచించారు. అందుకే 250 మీటర్ల కంటే ఎత్తుగా నిర్మించేందుకు ఎవరైనా ముందుకొస్తే అవకాశం ఇచ్చేలా తాజా టెండర్లు రూపొందించారు.
ఎత్తును బట్టి స్థలాల కేటాయింపు : తాజా టెండర్ల ప్రకారం, ఎత్తును బట్టి మూడు క్యాటగిరీలుగా ప్రాజెక్టును విభజించారు. వీల్ నిర్మాణానికి గ్రీన్ జోన్‌లో 5 ఎకరాలు ఉమ్మడిగా కేటాయిస్తారు.
- 128-175 మీటర్ల ఎత్తు ఉంటే వాణిజ్య అవసరాలకు ఒక ఎకరం ఇస్తారు.
- 175-200 మీటర్ల ఎత్తు ఉంటే కమర్షియల్ స్థలాన్ని 3 ఎకరాలకు పెంచుతారు.
- 200-250 మీటర్లకు 4 ఎకరాలు కేటాయిస్తారు.
- ఒకవేళ 250 మీటర్ల కంటే ఎత్తు నిర్మిస్తే 5 ఎకరాల కమర్షియల్ స్థలం ఇస్తారు.
కానీ, ఫెర్రిస్ వీల్ కనీస ఎత్తు 139 మీటర్లు, వ్యాసం 128 మీటర్ల కంటే తగ్గకూడదని స్పష్టం చేశారు. అంతకంటే తక్కువ కోట్ చేస్తే బిడ్‌ను తిరస్కరిస్తారు.
నిర్మాణ గడువులు ఇలా : వీల్ వ్యాసాన్ని బట్టి నిర్మాణ గడువును కూడా అధికారులు నిర్ణయించారు. 128 మీటర్ల వ్యాసం ఉంటే 12 నెలలు, 128 నుంచి 175 మీటర్లకు 15 నెలలు గడువు ఇచ్చారు. 175-200 మీటర్లకు 18 నెలలు, 200 మీటర్లు దాటితే రెండేళ్ల (24 నెలలు) గడువు ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు బిడ్ల దాఖలు గడువు ఈ నెల 27వ తేదీతో ముగుస్తుంది. మొదట ప్రతిపాదించిన 139 మీటర్ల వీల్‌లో 28 ఏసీ కాప్స్యూల్స్ ఉంటాయి. ఒక్కో దానిలో 20 మంది చొప్పున ప్రయాణించే వీలుంటుంది.
అమరావతి To ఖరగ్‌పుర్ రయ్ రయ్ - హైస్పీడ్ రోడ్ కారిడార్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
శరవేగంగా రాజధాని అమరావతి పనులు - ప్రతి నెలా ఒక్కో టవర్ నిర్మాణం పూర్తి: మంత్రి నారాయణ

