ETV Bharat / state

చకచకా అమరావతి నిర్మాణ పనులు - విధ్వంసం నుంచి విశ్వనగరిగా!

చకచకా అమరావతి పరుగులు - జగన్‌ ప్రభుత్వ హయాంలో అరాచకం - మూడు ముక్కలాటతో చిట్టడవిలా మారిన అమరావతి - కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ పట్టాల మీదకు

Amaravati Develops Towards Global City
Amaravati Develops Towards Global City (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 18, 2026 at 11:49 AM IST

5 Min Read
Choose ETV Bharat

Amaravati Develops Towards Global City: ఐదు సంవత్సరాలు జగన్‌ ప్రభుత్వ కబంధ హస్తాల్లో నలిగిన అమరావతి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఊపిరి పీల్చుకుంది. జగన్‌ ప్రభుత్వ విధ్వంసకాండ పర్యవసానాల్ని అధిగమించేందుకు కొంత సమయం పట్టినా వాటన్నింటినీ దాటుకుని అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రాజధాని నిర్మాణాన్ని పట్టాలెక్కించింది. అమరావతికి కేంద్రం అండగా నిలవడం, ఆర్థికంగానూ చేయూతనివ్వడంతో 2028 నాటికి ప్రభుత్వ భవనాలు, ప్రధాన మౌలికవసతుల నిర్మాణం పూర్తిచేయాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం చట్టసవరణ చేయడం కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద విజయం.

పెట్టుబడులకు ఆకర్షణగా: ఇప్పటివరకు రూ.66,073 కోట్ల పనులకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. వాటిలో రూ.63,396 కోట్ల పనులకు టెండర్లు ముగిశాయి. రూ.56,386 కోట్ల పనులు మొదలయ్యాయి. అంతర్జాతీయ క్రీడానగరం, స్మార్ట్‌ పరిశ్రమలు, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, రైల్వేస్టేషన్, విమానాశ్రయం లాంటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం మలిదశ భూసమీకరణ ప్రారంభించింది. ఏడు గ్రామాల పరిధిలో 16,666 ఎకరాలు సమీకరిస్తోంది. ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణకూ ప్రయత్నిస్తోంది. బిట్స్‌ పిలానీ లాంటి ప్రఖ్యాత విద్యాసంస్థలు వచ్చాయి.

అధికారంలోకి వచ్చేనాటికి - అమరావతి అస్తవ్యస్తం: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమరావతిపై కక్షగట్టింది. జగన్‌ అధికారంలోకి రాగానే రాజధాని పనులు నిలిపేశారు. అప్పటికే రూ.10 వేల కోట్ల పనులు జరిగాయి. ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసానికి తెరతీశారు. స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టిన సింగపూర్‌ కన్సార్షియంను బెదిరించి వెళ్లగొట్టారు. రాజధానికి రూ.3,500 కోట్ల ప్రపంచబ్యాంకు రుణం ఇచ్చేందుకు 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ హయాంలో అంతా సిద్ధమవ్వగా జగన్‌ దిల్లీ వెళ్లి రుణం అక్కర్లేదని అడ్డుపుల్ల వేశారు.

మూడు రాజధానుల ప్రతిపాదనతో మూడు ముక్కలాటకు తెరతీశారు. శాసనసభను అమరావతిలో ఉంచి రాజధానిని విశాఖకు తరలించేందుకు కుట్రపన్నారు. భారీ నిర్మాణాలకు అమరావతి పనికిరాదని, వర్షాలకు మునిగిపోతుందని అప్పటి మంత్రులు, వైఎస్సార్సీపీ నాయకులు విషప్రచారం చేశారు. అమరావతి శ్మశానమని, ఎడారి అని నోరు పారేసుకున్నారు. అమరావతి రైతుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని చూశారు. పాదయాత్ర చేస్తున్న రైతులపైకి పోలీసులను, అల్లరి మూకలను ఉసిగొల్పారు. అమరావతి మాస్టర్‌ప్లాన్‌ను దెబ్బతీసేందుకు ఆర్‌-5 జోన్‌ని సృష్టించి బయటి ప్రాంతాలకు చెందిన 50వేల మందికి సెంటు చొప్పున ఇళ్లపట్టాలు ఇచ్చారు.

అమరావతి నుంచి మంగళగిరి, తాడేపల్లి మండలాల గ్రామాల్ని తప్పించారు. మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి, ఆ గ్రామాలను దానిపరిధిలో చేర్చారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని హైకోర్టు ఆదేశించినా జగన్‌ ప్రభుత్వం కుట్రలు ఆపలేదు. సచివాలయం టవర్ల పునాదులు ఐదేళ్లూ నీళ్లలోనే ఉన్నాయి. అమరావతి చిట్టడవిని తలపించింది.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో వేగంగా పనులు: వైఎస్సార్సీపీ ప్రభుత్వం సృష్టించిన అన్నిరకాల అవరోధాలను అధిగమించేందుకు, ఐదేళ్లపాటు నీళ్లలో నానిన ఐకానిక్‌ టవర్ల పునాదుల పటిష్ఠతను నిపుణులతో మదింపు లాంటి ప్రక్రియలను పూర్తి చేసేందుకు 8 నెలలు పట్టింది. తర్వాత నాలుగు నెలల్లో మెజారిటీ పనులకు టెండర్లు పిలిచింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిన అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌ను కూటమి అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే పునరుద్ధరించింది.

కూటమి అధికారంలోకి వచ్చాక రాజధానిలో పెట్టుబడులకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. ఈ రెండేళ్లలో 112 సంస్థలకు 1,272.80 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఆయా సంస్థలు రూ.30 వేల కోట్లు పెట్టుబడులు పెడతాయని, 65 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. బిట్స్‌ పిలానీ, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, నేషనల్‌ లా యూనివర్సిటీ లాంటి ప్రముఖ విద్యాసంస్థలకు భూములు కేటాయించింది. అమరావతిలో 50 ఎకరాల్లో క్వాంటమ్‌ వ్యాలీని అభివృద్ధి చేస్తోంది. డిసెంబరు నాటికి ఐబీఎం క్వాంటమ్‌ కంప్యూటర్‌ ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం.

చివరిదశలో మంత్రుల బంగళాల నిర్మాణం: ఏపీ ఎన్‌ఆర్‌టీ సొసైటీ ఆధ్వర్యంలో రూ.600 కోట్లతో ఐకానిక్‌ టవర్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. పరిపాలన నగరంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ టవర్ల నిర్మాణం జరుగుతోంది. హైకోర్టు, శాసనసభ భవన నిర్మాణాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఏఐఎస్‌ అధికారుల టవర్లు దాదాపు సిద్ధమయ్యాయి. మంత్రుల బంగళాల నిర్మాణం చివరిదశలో ఉంది. హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ కార్యదర్శుల బంగళాలు, గెజిటెడ్, నాన్‌గెజిటెడ్‌ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగుల భవనాల నిర్మాణం జరుగుతోంది. మరో ఏడాదిలో ఇవన్నీ సిద్ధమవుతాయి.

350 కి.మీ. పొడవైన ప్రధాన రహదారుల నిర్మాణం జరుగుతోంది. అమరావతి ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టును 189.4 కి.మీ. పొడవున ఆరు వరుసల్లో చేపట్టేందుకు కేంద్రం అంగీకరించింది. కాజ నుంచి గొల్లపూడి మీదుగా చిన అవుటపల్లి వరకు విజయవాడ బైపాస్‌ రహదారి అందుబాటులోకి వచ్చింది. రాజధాని నిర్మాణానికి ఇప్పటివరకు రూ.40,887 కోట్లు సమకూరాయి. ప్రపంచబ్యాంకు, ఏడీబీ కలిసి రూ.15వేల కోట్లు, హడ్కో రూ.11వేల కోట్లు, నాబార్డ్‌ రూ.7,387 కోట్లు, నాబ్‌ఫిడ్‌ రూ.7,500 కోట్లు మంజూరు చేశాయి. ఏపీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రూ.1,500 కోట్లు ఇవ్వనుంది. అమరావతిలో రూ.2,534 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, ఉద్యోగుల గృహ సముదాయం నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

మూడేళ్లలో చేయాల్సింది - ఈ వేగం సరిపోదు : రాజధాని పనులు లక్ష్యానికి అనుగుణంగా జరగట్లేదు. పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే ప్రభుత్వం చెబుతున్నట్టు 2028 నాటికి నిర్మాణాలు పూర్తవుతాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గుత్తేదారు సంస్థలు జాప్యం చేస్తున్నాయి. 40వేల మంది కార్మికులు పనిచేయాల్సి ఉండగా, ప్రస్తుతం 18వేల మందితోనే చేయిస్తున్నాయి. మే నెలాఖరు వరకు 39.30% పనులు జరగాల్సి ఉండగా, 16.01% మాత్రమే జరిగాయి. రాజధాని పనులన్నీ 10-12 గుత్తేదారు సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. వాటిలో కొన్ని పనులు మందకొడిగా సాగుతున్నాయి.

రాజధానిలో భూసమీకరణలో ఇవ్వని భూములు ఇంకా 2,300 ఎకరాల వరకు ఉన్నాయి. దాంతో ప్రధాన రహదారులు, జలాశయాలు, కాలువల పనులు ముందుకు సాగట్లేదు. ప్రభుత్వం వెంటనే భూసేకరణ నోటిఫికేషన్లు ఇచ్చి ఆ భూములు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. రాజధానిలో భూములు తీసుకున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఇప్పటికి 10% మాత్రమే నిర్మాణాలు ప్రారంభించాయి. మిగతా సంస్థల వెంటపడి పనులు మొదలుపెట్టేలా చేయడంలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది.రాజధాని రైతులకు ప్లాట్లు కేటాయించిన ఎల్‌పీఎస్‌ లేఅవుట్‌ల అభివృద్ధిని వేగవంతం చేయాలి. వాటిని రైతులకు అప్పగిస్తేనే అక్కడ నిర్మాణాలు మొదలవుతాయి. ఎఫ్‌ఎస్‌ఐ పెంపు లాంటి రైతుల డిమాండ్లను పరిష్కరిస్తే ప్రైవేటు స్థిరాస్తి సంస్థలు రాజధానికి వచ్చేందుకు ఆసక్తి చూపుతాయి.

అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం - రాష్ట్రపతి ఆమోదముద్రే తరువాయి

ఏపీ రాజధాని అమరావతి - చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం - రేపు రాజ్యసభలో చర్చ