ఏపీఎల్‌కు ముస్తాబైన మంగళగిరి స్టేడియం - నేటి ప్రారంభ మ్యాచ్‌కి సినీ నటుడు రామ్‌చరణ్
ఏపీఎల్ పోటీలకు సిద్ధమైన మంగళగిరిలోని క్రికెట్ స్టేడియం- సీజన్-5లో చివరి విడత మ్యాచ్‌లు మంగళగిరిలో నిర్వహణ-ఈ నెల 30న జరిగే ఫైనల్స్‌కు హాజరుకానున్న మంత్రి లోకేశ్

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 24, 2026 at 7:29 AM IST
Andhra Premiere League In Amaravati : గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్రికెట్ స్టేడియం ఆంధ్రా ప్రీమియర్ లీగ్ పోటీలకు సిద్ధమైంది. ఐదో సీజన్ APLకు సంబంధించి చివరి విడత మ్యాచ్‌లు మంగళగిరి స్టేడియంలో జరగనున్నాయి. ప్రముఖ నటుడు రామ్‌చరణ్ ప్రారంభ మ్యాచ్‌కు రానున్నట్లు ACA వర్గాలు తెలిపాయి. మ్యాచ్‌లు తిలకించేందుకు పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పాసులు అందజేశారు.
రాజధాని అమరావతి ప్రాంతంలోని మంగళగిరిలో ఆంధ్రా క్రికెట్ అసోషియేషన్ నిర్మించిన క్రికెట్ స్టేడియం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. పుష్కర కాలంపైగా సాగిన పనుల్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేసి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌ల కోసం సిద్ధం చేసింది. అధునిక హంగులతో, అంతర్జాతీయ ప్రమాణాలతో మ్యాచ్‌ల నిర్వహణకు సిద్ధమైంది. ఈ స్టేడియంలో 25వేల మంది ప్రేక్షకులు కూర్చునేలా గ్యాలరీలు నిర్మించారు. ప్రస్తుతం ఆంధ్రా ప్రీమియర్ లీగ్ 2026 సీజన్-5లో 12 మ్యాచ్‌లు ఈ స్టేడియంలో జరగనున్నాయి.
వారంరోజులు జరిగే పోటీల్లో 8 లీగ్ మ్యాచులు మూడు ప్లే ఆఫ్‌లతో పాటు ఫైనల్ మ్యాచ్ ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం రాయల్స్ రాయలసీమ, వైజాగ్ లయన్స్ టీంలు పోటీ పడతాయి. సాయంత్రం అమరావతి రాయల్స్, భీమవరం బుల్స్ జట్లు తడపడనున్నాయి. సినీ నటుడు రామ్‌చరణ్ ఇవాళ్టి మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా రానున్నారు. ఇటీవల విడుదలైన పెద్ది సినిమాలో రామ్‌చరణ్ క్రికెట్ ఆటగాడిగా కనిపించడంతో క్రేజ్ నెలకొంది. మంగళగిరి నియోజకవర్గంలోని పాఠశాల విద్యార్థులు మ్యాచ్‌లు చూసేందుకు ఉచిత పాసులు అందజేశారు.
మంగళగిరి స్టేడియం అసలు మ్యాచ్‌లకు అందుబాటులోకి వస్తుందా లేదా అనే సందేహం ఉండేది. సరైన ప్లాన్ లేకుండా చేసిన నిర్మాణాల కారణంగా మ్యాచ్‌ల నిర్వహణకు ఈ స్టేడియం సరిపడదని నిపుణులు తేల్చారు. ఆ తర్వాత స్టేడియంలో కొన్ని మార్పులు చేశారు. రాత్రి పూట మ్యాచ్‌ల నిర్వహణకు వీలుగా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు. గ్యాలరీలను ఆధునీకరించారు. డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. స్టేడియాన్ని ఏడాదిలో కనీసం 170 రోజులు వినియోగించేలా ప్రణాళికలు రూపొందించినట్లు ACA అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తెలిపారు.ఈనెల 30న జరిగే ఫైనల్స్‌కు మంత్రి లోకేశ్ ముఖ్యఅతిథిగా రానున్నారు. APL విజేతలకు బహుమతి ప్రదానం చేయనున్నట్లు ACA ప్రతినిధులు తెలిపారు.
"ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న APL మ్యాచ్‌లు ఈ నెల 30వ తేదీ వరకు మంగళగిరిలో జరగనున్నాయి. చాలా కాలంగా వినియోగంలో లేని ఈ స్టేడియంను, ప్రస్తుత కూటమి ప్రభుత్వం హయాంలో దాదాపు 200 రోజుల పాటు వినియోగించాల్సి ఉన్నందున అవసరమైన మరమ్మతులు చేపట్టి దీనిని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వేదికగా తీర్చిదిద్దడానికి మేము అన్ని విధాలా కృషి చేశాము. ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా నారా లోకేశ్‌ను ఆహ్వానించాము. అలాగే నేటి మ్యాచ్‌కు నటుడు రామ్ చరణ్ హాజరుకానున్నారు"_కేశినేని శివనాథ్ అధ్యక్షుడు, ఆంధ్రా క్రికెట్ అసోషియేషన్
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL)- ఈ నెల 9 నుంచి క్రికెట్ పండుగ- విద్యార్థులకు ఉచిత ప్రవేశం!

