వెలుగులోకి పాస్టర్ అభినయ్ దర్శన్ లీలలు - ముమ్మరంగా పోలీసుల దర్యాప్తు
పాస్టర్ అభినయ్‌పై దాడి పూర్తి కల్పితమన్న అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ - కల్పిత దాడి ఘటనలో 8 మందిపై కేసులు నమోదు - మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్న అభియోగాలపై కేసులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 20, 2026 at 8:40 PM IST
SP Amit Bardar Press Meet on Pastor Abhinay Fake Attack : అల్లూరి జిల్లా పాడేరులో పాస్టర్ అభినయ్ దర్శన్‌పై దాడి ప్రచారం ముందస్తు కుట్రలో భాగమేనని గుర్తించినట్లు అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ స్పష్టం చేశారు. కొంతమందిని డబ్బు ప్రలోభాలకు గురిచేసి ఘటనలో భాగస్వాములను చేశారని విచారణలో తేలిందన్నారు. ఘటనను ముందుగానే చిత్రీకరించి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారన్నారు. ప్రజల్లో భయాందోళనలు, మత విద్వేషాలు రేకెత్తించే ఉద్దేశంతో వ్యవహరించారన్నారు. తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూశారన్నారు. అల్లూరి జిల్లాలో కొంతకాలంగా పాస్టర్లతో సమావేశాలు నిర్వహించారని రాజకీయ పార్టీ ఏర్పాటుపైనా చర్చలు జరిపారని చెప్పారు. ఈ ఘటనలో మెుత్తం 9 మందిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితుల్లో ఒకరు మైనర్ ఉన్నారన్నారు.
అతి అభినయంతో దాడి డ్రామా ఆడి పాడేరు ఘటనలో అడ్డంగా బుక్ అయిన పాస్టర్ అభినయ్ దర్శన్ గురించి విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గంలో తనపై తానే దాడి చేయించుకుని డ్రామా ఆడి, లేని పోని రచ్చకు తెర లేపిన పాస్టర్ అభినయ్ డ్రామా ఎపిసోడ్ వెనుకున్న కుట్రను ఛేదించే క్రమంలో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా పాస్టర్ అభినయ్ బాగోతాలు తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్నాయి. అతనిపై గతంలో వివిధ పోలీస్ స్టేషన్లల్లో నమోదైన కేసులు, విలాసాల కోసం అభినయ్ చేసిన అభినయాలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి. పాస్టర్ ముసుగులో పలువురు మహిళలను మోసం చేయడం, అదనపు కట్నం కోసం వేధింపులకు భార్యను వేధించడం వంటి ఘటనల్లో కడపకు చెందిన అభినయ్ దర్శన్ పలు పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ, మొదటి భార్యకు తెలియకుండా ఏకకాలంలో పలువురు మహిళలను పెళ్లాడిన ఈ అభినయ దర్శన్ వెనుకున్న బాగోతాలు బయటపడుతున్నాయి.
విలాసాల కోసం వేధింపులు, అప్పుల పాలు : కడప నగరంలోని ఎర్రముక్కపల్లి (కందిపాలెం), ప్రస్తుతం ప్రకాష్ నగర్‌కు చెందిన అభినయ్ దర్శన్ ఎస్వీ యూనివర్సిటీ నుంచి యానిమేషన్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందాడు. 2011 మే 19న ప్రకాష్ నగర్‌కు చెందిన ఓ యువతితో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.1,50,000 నగదు, 15 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. అభినయ్‌కు కుమార్తెలు ఉన్నారు. అభినయ్ భార్యకు యూనియన్ బ్యాంకులో క్యాషియర్‌గా ఉద్యోగం రావడంతో హైదరాబాద్‌లోని మణికొండకు బదిలీ అయ్యారు. ఆ సమయంలో అభినయ్ దర్శన్ తనకు సినిమాల్లో అవకాశాలు వస్తాయంటూ భార్యను తీవ్రంగా ఒత్తిడి చేసి, ఆమె పేరుతో భారీగా అప్పులు, తీసుకున్నాడు. ఆ డబ్బును భార్య అనుమతి లేకుండా హైదరాబాద్‌లో తన వ్యక్తిగత విలాసాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ, భార్యను అప్పుల ఊబిలోకి నెట్టాడు.
పాస్టర్ అవతారమెత్తి, మరో ఇద్దరితో పెళ్లిళ్లు : హైదరాబాద్‌లో ఐదేళ్ల ముగిసిన తర్వాత బ్యాంకు ఉద్యోగిగా ఉన్న భార్యకు బదిలీ కావడంతో కడపకు వచ్చారు. ఈ క్రమంలో తాను మారిపోయానని, ఇకపై పాస్టర్‌గా సేవలు చేసుకుంటానని నమ్మించి, కడపలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ద్వారా భార్యతో మళ్లీ భారీగా లోన్లు తీసుకున్నాడు. భర్తను నమ్మి ఆర్థికంగా అండగా నిలవడంతో ఆయన విజయనగరం, రాజమండ్రి, అనకాపల్లి, పాడేరు ఏజెన్సీ ప్రాంతాలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో స్వతంత్ర పాస్టర్‌గా సేవలు ప్రారంభించాడు. అయితే విజయనగరంలో పాస్టర్‌గా ఉన్న సమయంలో ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని, 2021 మే 15న ఆమెను తీసుకుని పారిపోయి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. దీనిపై ఆ యువతి తల్లిదండ్రులు విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో మొదటి భార్యను సంప్రదించగా అభినయ్ దర్శన్ బుద్ధి మంచిది కాదని, అంతకుముందే విజయవాడలో మరో మహిళను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని, పెద్దలు, పోలీసుల జోక్యంతో విడిపోయారని అసలు విషయాలు బయటపెట్టింది.
క్రిమినల్ బెదిరింపులు, స్టేషన్లలో కేసులు : మొదటి భార్య తన గుట్టు రట్టు చేసిందని తెలుసుకున్న అభినయ్ దర్శన్, విజయనగరం యువతి తల్లిదండ్రులను ఫోన్లు చేసి చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. అంతేకాకుండా 2021 మే నెలలో విజయనగరంలోని వారి అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. గేటుకు తాళం వేసి ఉండటంతో తీవ్రమైన బూతులు తిడుతూ, ఇనుప రాడ్డుతో గేటును కొడుతూ న్యూసెన్స్ సృష్టించాడు. దీంతో విజయనగరం వన్‌టౌన్ పోలీసులు ఇతనిపై క్రైమ్ నెం. 331/2021 U/s 506, 509 IPC కింద కేసు నమోదు చేశారు. ఇటు కడపలోనూ భర్త ప్రవర్తన మారకపోవడంతో మొదటి భార్య కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అభినయ్ దర్శన్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై క్రైమ్ నెం. 172/2021 U/s 498-A, 494 IPC, సెక్షన్ 3, 4 వరకట్న నిషేధ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులు ప్రస్తుతం కోర్టు పరిధిలో విచారణలో ఉన్నాయి.
రాజకీయ పార్టీ, పాదయాత్ర పేరిట హడావుడి : అభినయ్ దర్శన్ భరోసా పార్టీ అనే సంస్థకు వ్యవస్థాపకుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తూ, అభినయ్ దర్శన్ ఫౌండేషన్స్ నడుపుతున్నాడు. ప్రస్తుతం చేంజ్ పీపుల్స్ ఫ్యూచర్ అనే పార్టీ రిజిస్ట్రేషన్ కోసం క్రైస్తవుల నుంచి తలా రూ.10 విరాళం ఇవ్వాలంటూ సోషల్ మీడియా వేదికగా తన బ్యాంక్ ఖాతా వివరాలను షేర్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇటీవల పాడేరు ఏజెన్సీ పరిధిలో పాదయాత్ర చేపట్టి, అభినయ్ మహారాజ్ అనే పేరుతో సోషల్ మీడియాలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వీడియోలు అప్‌లోడ్ చేస్తూ హడావుడి చేస్తున్నాడు. కాగా, మే 18న జీ.కే వీధి మండలం మొండిగెడ్డ వద్ద నలుగురు ముసుగు దొంగలు తనపై దాడి చేశారంటూ స్వల్ప గాయాలతో చింతపల్లి ఏరియా ఆసుపత్రిలో చేరి నాటకీయ పరిణామాలకు తెరలేపాడు. పాస్టర్ వృత్తిని, సామాజిక సేవను అడ్డం పెట్టుకుని బహుభార్యాత్వానికి పాల్పడుతూ, మహిళల జీవితాలతో ఆడుకుంటున్న ఈ కిలాడి పాస్టర్ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
రాజకీయం, కడప లింకులపై పోలీసుల దర్యాప్తు : ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలతో పోలీసులు మరింత లోతైన దర్యాప్తు చేపడుతున్నారు. రాష్ట్రంలో లేని పోని అశాంతిని క్రియేట్ చేసేందుకు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు ఓ పార్టీకి చెందిన కొందరు నేతలు పని గట్టుకుని కుట్రలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని కుట్రలకు తెర లేపుతున్నారు. ఈ క్రమంలో పాడేరులో తనపై తానే దాడి చేసుకున్న పాస్టర్ అభినయ్ వెనుకున్న రాజకీయ కుట్రల కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటు పాస్టర్ అభినయ్‌కు ఉన్న కడప లింకుల పైనా ఆరా తీస్తున్నారు. కేవలం పబ్లిసిటీ కోసం పాస్టర్ అభినయ్ ఈ డ్రామా ఆడారా? లేక రాజకీయ కుట్ర కోణం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.
పాస్టర్‌పై దాడి కేసులో ఊహించని ట్విస్ట్ - 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు
మతం మారితే ఎస్సీ హోదా పోతుంది - పాస్టర్ కుల ధ్రువపత్రాన్ని రద్దు చేయండి: హైకోర్టు ఆదేశం

