ETV Bharat / state

పండక్కి ఊరెళ్తే - ఇక్కడ ఓమాట చెప్పేసి వెళ్లండి - మీ ఇంటికి శ్రీరామరక్ష

పోలీసు ఠాణాల్లో సమాచారం ఇచ్చేందుకు పుస్తకం - తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు - ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న పోలీసులు

Precautions for Before Going to Hometown
Precautions for Before Going to Hometown (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : January 10, 2026 at 11:25 AM IST

3 Min Read
Choose ETV Bharat

Precautions for Before Going to Hometown : సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. భాగ్యనగరమంతా పండక్కి ఊరెళ్తోంది. వీరికి సీజన్ మొదలవుతుంది. అదేనండి చోరీల సీజన్. మీకు తెలియంది ఏముంది దొంగతనాలకు ఇదే మంచి టైం. అందుకే పండుగకు ఊరెళ్లిన వారి ఇళ్లపై పడి దొరికిందంతా దోచేస్తుంటారు. మీరు ఇలా ఊరెళ్లగానే మీ ఇళ్లన్నీ ఊడ్చేస్తారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా పెట్టుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు.

విద్యా సంస్థలకు సంక్రాంతి పండగకు ఈ నెల 10 నుంచి 18 వరకు సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నగరంలో చాలా మంది ఇళ్లకు తాళాలు వేసి సొంత గ్రామానికి, విహారయాత్రలకు వెళ్తుంటారు. ఇదే మంచి అవకాశంగా​ దొంగలు చోరీలకు పాల్పడే అవకాశాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఊరెళ్లే ముందు కాస్త జాగ్రత్త వహించండి. మీ ఇంటిపై ఓ కన్నేసి ఉంచే ఉపాయం చేయండి. మరి అదేలా అని ఆలోచిస్తున్నారా?

జాగ్రత్తలు తప్పనిసరి పాటించండి :

  • మీ ఇళ్ల తలుపులకు తాళాలు కనిపించేలా వేయరాదు. బయటికి కనిపించకుండా తలుపునకు తెర వేయాలి.
  • వెళ్లే ముందు పక్కంటి వారికి సమాచారం ఇవ్వాలి. గదిలో, వరండాలో దీపాలు వెలిగేలా ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే బంధువులు, స్నేహితులు ఎవరో ఒకరు వచ్చి రోజూ చూసి వెళ్లేలా, ఉదయం పూట దీపాలు ఆర్పి, చీకటి పడగానే మళ్లీ వేసేలా ఏర్పాట్లు చేసుకోవాలి.
  • బంగారం, వెండి లాంటి విలువైన వస్తువులు, నగదును ఇళ్లల్లో ఉంచరాదు. బ్యాంకు లాకర్లలో పెట్టుకోవడం ఉత్తమం. లేదంటే భద్రమైన చోట ఉంచుకోవాలి.
  • ఇళ్ల ముందు దినపత్రికలను అలాగే వదిలేస్తే ఇంట్లో ఎవరూ లేరన్న విషయం తెలిసిపోతుంది. దాన్ని రోజూ తీసి పక్కకు ఉంచమని పక్కింటి వారికి తెలియజేయండి. ఇంటికి తాళం వేసి వెళ్లేవారు చిరునామాను పోలీస్​ స్టేషన్​లో చెబితే పోలీసులు రాత్రివేళ ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేస్తారు.
  • కాలనీల్లో ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు, డయల్​ 100కు ఫోన్​ చేయాలి.
  • ఇంటికి సెక్యూరిటీ అలారం, మోషన్‌ సెన్సార్, సెంట్రల్‌ లాక్‌ సిస్టమ్‌ ఉండే తాళం ఏర్పరచుకోవాలి.
  • వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కు చేసుకోవాలి. చక్రాలకు గొలుసులతో తాళం వేయడం ఉత్తమం.
  • అపార్ట్‌మెంట్ల దగ్గర నమ్మకమైన వాచ్‌మెన్‌లను మాత్రమే సెక్యూరిటీ గార్డులుగా నియమించుకోవాలి.
  • ఇంట్లో సీసీ కెమెరాలను ఆన్‌లైన్‌ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి.
  • ఇంటి ముందు న్యూస్​ పేపర్​, పాల ప్యాకెట్లు, చెత్త ఏమీ జమవ్వకుండా చూడాలి.
  • కాలనీల్లో దొంగతనాలు అరికట్టేందుకు స్వచ్ఛంద కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి.
  • నగరంలోని తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా అత్యధిక చోరీలు జరిగాయి. 59.64 శాతం కేసులను పోలీసులు ఛేదించారు. గతంతో పోలిస్తే ఇది 8.57 శాతం ఎక్కువ. దొంగిలించిన సొత్తు విలువ రూ.1.78 కోట్లు కాగా, రూ. 96.15 లక్షలు రికవరీ చేశారు.

''ఇంటికి తాళం వేసి ఊరెళ్లే వారు తప్పనిసరిగా వీలు చేసుకొని సమీప స్టేషన్​లో వివరాలు చెప్పాలి. అలాంటి వారి కోసం పోలీస్​ స్టేషన్​లో ​ ప్రత్యేకంగా ఓ రాత పుస్తకం ఉంచాం. లేదంటే ఇంటి చిరునామాల వివరాలను సంక్షిప్త సందేశం (ఎస్‌ఎంఎస్‌), ఫోన్‌ చేసి చెప్పాలి. సమాచారం ఆధారంగా వారి ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచి రాత్రి వేళలో మరింత గస్తీ పెంచుతాం. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100, 112 నెంబర్లకు కాల్​ చేయండి.'' - స్నేహమెహ్రీ, ఎస్పీ

ఇటీవల జరిగిన దొంగతనాలు ఇవే :

  • జూన్‌ 30న పరిగిలోని టీచర్స్‌ కాలనీలో తాళం వేసి ఉన్న 5 ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించి ముగ్గురు శికారి ముఠా సభ్యుల ముఖచిత్రాలను గుర్తించారు. దీని ఆధారంగా మహారాష్ట్ర, పుణెలో వారిని అరెస్టు చేశారు.
  • అక్టోబరు నెలలో తాండూరు పట్టణంలో ఉండే ఓ కుటుంబం దసరా పండగకు ఇంటికి తాళం వేసి సొంతూరుకు వెళ్లారు. ఇదే అదనుగా తీసుకుని రాత్రిపూట దొంగలు రూ.2 లక్షల విలువైన బంగారం తస్కరించారు.

గేటెడ్​ కమ్యూనిటీలే లక్ష్యంగా వరుస దొంగతనాలు - ఈ జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్​ అంటున్న పోలీసులు

బతుకమ్మ, దసరా పండుగలకు ఊరెళ్తున్నారా? - అయితే ఈ జాగ్రత్తలు మీ కోసమే