నగరంలో పైవంతెనల వద్ద క్షీణిస్తున్న వాయు నాణ్యత - ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం!
ప్రమాదకరంగా పెరుగుతున్న పీఎం 10, పీఎం 2.5 సూక్ష్మధూళి కణాల స్థాయిలు - అధికంగా గచ్చిబౌలి, మాసబ్‌ట్యాంక్, మెహిదీపట్నం, కూకట్పల్లి, మియాపూర్ ప్రాంతాల్లో - ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం!

Published : July 1, 2026 at 3:08 PM IST
Air Quality Decreasing At Flyover Places In Hyd : అధిక రద్దీ ఏర్పడుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు వీలుగా నగరంలో పైవంతెనలను నిర్మించారు. వీటివల్ల ఉపయోగం ఉన్నప్పటీకి ఈ ప్రాంతాల్లో వాయు నాణ్యత క్షీణిస్తోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పెరుగుతున్న రద్దీతో ఇలాంటి ప్రాంతాల్లో రోజురోజుకూ వాయు నాణ్యత తగ్గుతుంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ 'స్టేట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్' రిపోర్టు, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ నివేదికలు ఈ మేరకు వెల్లడించాయి.
పేరుకుపోతున్న విషవాయువులు : వాహనదారులంతా ఎక్కువగా పైవంతెనలపై నుంచే వెళ్తుంటారు. దీనివల్ల ఆ ప్రాంతంలో శబ్ద, వాయుకాలుష్యం అత్యధికంగా నమోదవుతోంది. పీఎం 10, పీఎం 2.5 సూక్ష్మధూళి కణాల స్థాయిలు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. ట్రాఫిక్‌తో వాహనాలు నిలిచిపోతునప్పుడు అక్కడ గాలి స్వేచ్ఛగా వీచట్లేదు. దాంతో విషవాయువులు ఆ ప్రాంతంలో పేరుకుపోతున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమని అంటున్నారు.
నగరంలో ఈ ప్రాంతాల్లో ఎక్కువగా : గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ పైవంతెన వద్ద వాహనాల రాకపోకలు పెరిగాయి. దీంతో ఇక్కడ టైర్ల ఘర్షణ వల్ల మైక్రోప్లాస్టిక్‌లు వెలువడుతున్నాయి. ఫలితంగా ఇక్కడ గాలి నాణ్యత క్షీణిస్తోంది. మాసబ్‌ట్యాంక్, మెహిదీపట్నం పైవంతెన ప్రాంతాల్లో కూడా రద్దీ అధికమవుతుండటంతో కార్సినోజెనిక్ కారకాలు, ధూళి కణాలు ఎక్కువగా వెలువడుతున్నాయి. అలాగే కూకట్పల్లి, మియాపూర్ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది.
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం! : కాలుష్యం వల్ల వెలువడిన సూక్ష్మధూళి కణాలు గాలిలో ఉంటాయి. వాటిని పీల్చినప్పుడు అని నేరుగా శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. అలాగే కంటి ఆరోగ్యాన్ని కూడా క్షీణించేలా చేస్తాయి. ఈ కణాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఆస్తమా, గుండె జబ్బులకు కారణం అవుతాయి. వీటితోపాటు ఎలర్జీలు, కండ్ల కలకలకు దారితీస్తాయి. ముఖ్యంగా వృద్ధులు, ఆస్తమా రోగులకు ప్రమాదకరంగా మారుతుంది.
గాలి నాణ్యతకు తీసుకోవాల్సిన చర్యలివే! :
- పైవంతెనల సమీపంలో వర్టికల్ గార్డెన్లను పెంచాలి. దీనివల్ల అక్కడే వెలువడే కర్బన ఉద్గారాలను మొక్కలు పీల్చుకుని గాలిని శుద్ధి చేసి నాణ్యతను పెంచుతాయి. అయితే ఇవి కేవలం ప్రధాన జంక్షన్ల దగ్గరే ఏర్పాటు చేశారు. మిగిలిన చోట్ల చేయలేదు.
- రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో యాంటీ స్మాగ్‌గన్స్ ఏర్పాటు చేయాలి. ఇవి నీటి తుంపరులను చల్లటంతో గాలిలో ఉండే సూక్ష్మకణాలను కింద పడతాయి. కొన్ని రాష్ట్రాల్లో వీటిని అందుబాటులోకి తెచ్చారు.
- పైవంతెనల కింద పేరుకుపోయే దుమ్మును రోడ్డుపైకి లేవకుండా రాత్రివేళల్లో స్వీపింగ్ యంత్రాలతో నిరంతరం శుభ్రం చేయాలి.
- వాహనాలు రోడ్డుపై ఎక్కువ సమయం ఆగిపోకుండా ఉండేందుకు స్మార్ట్ సిగ్నలింగ్‌ను ఉపయోగించాలి.
- కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశిత పరిమితుల ప్రకారం గాలిలో సూక్ష్మధూళి కణాలైన పీఎం 10 స్థాయి ఘనపు మీటరు గాలిలో 60 మైక్రోగ్రాములు ఉండొచ్చు. పీఎం 2.5 ఘనపు మీటరు గాలిలో 40 మైక్రోగ్రాములు మించొద్దు. కానీ నగరంలో పరిమితికి మించి నమోదవుతోంది.
హైదరాబాద్‌లో మరో కొత్త ఫ్లైఓవర్ - ఎయిర్‌పోర్ట్‌కు ఇక రయ్‌రయ్‌మని దూసుకుపోవడమే!
మర్రిగూడ ఫ్లైఓవర్ : పనులు జరగవు - బండ్లు కదలవు : ఆ రూట్లో మృత్యుప్రయాణమే!

