సవరణల తరువాత జీఎస్టీ వసూళ్లలో నూతనోత్సాహం
డిసెంబరులో అధిక రాబడి - కేంద్ర సగటు కన్నా రాష్ట్ర సగటు ఎక్కువ -దక్షిణాది రాష్ట్రాల్లో 2వ స్థానం - గత నెల వరకు మొత్తం రూ.39,517 కోట్ల రాక

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 2, 2026 at 10:28 AM IST
AP Posts Record GST Growth : జీఎస్టీలో సవరణలు తీసుకొచ్చినప్పటికీ గత ఏడాది డిసెంబరు నెలలో ఆంధ్రప్రదేశ్ అత్యధిక నికర వసూళ్లను సాధించింది. జీఎస్టీ శకం ప్రారంభమైన తర్వాత గత నెలలో రూ.2,652 కోట్ల వసూళ్లతో రికార్డు సృష్టించింది. అంతే కాదు గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు ప్రతి నెలా అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అధిక వసూళ్లు సాధించింది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు, వస్తు వినియోగం పెరిగిందనేందుకు ఇది సంకేతమని రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ ప్రధాన కమిషనర్ ఎ.బాబు పేర్కొన్నారు.
జాతీయ వృద్ధి రేటును దాటి రాష్ట్రంలో జీఎస్టీ నికర వసూళ్లు : దిగుమతులను మినహాయించి పరిశీలిస్తే దేశంలో సగటున 5.61% వృద్ధి రేటు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్‌లో అది ఏకంగా 5.78% ఉండటం గమనార్హం. జాతీయ వృద్ధి రేటును దాటి రాష్ట్రంలో జీఎస్టీ నికర వసూళ్లు ఉన్నాయి. గత ఏడాది డిసెంబరు నెలాఖరు వరకు 9 నెలల కాలంలో మొత్తం రూ.39,517 కోట్ల జీఎస్టీ వసూళ్లు రాష్ట్రంలో సాధ్యమయ్యాయి. అందులో కేంద్రానికి, ఇతరత్రా వెళ్లే వాటిని మినహాయిస్తే రూ.25,926 కోట్ల నికర జీఎస్టీ ఖజానాకు చేరింది.
8.29% వృద్ధి : దక్షిణాది రాష్ట్రాల్లో జీఎస్టీ వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడు 7.85% వృద్ధితో తొలిస్థానంలో ఉంది. కర్ణాటక (5.12%), కేరళ (3.69%), తెలంగాణ (2.45%)లను దాటి ఆంధ్రప్రదేశ్ వృద్ధి సాధించడం విశేషం. ఆటోమొబైల్, సిమెంట్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 23.69% వృద్ధి కనిపించింది. గత ఏడాది డిసెంబరులో ఎస్‌జీఎస్టీ వసూళ్లు రూ.1,102 కోట్లకు చేరుకున్నాయి. 2024 డిసెంబరుతో పోలిస్తే 2.46% వృద్ధి నమోదైంది. ఐజీఎస్టీ సర్దుబాట్లు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచాయి. ఐజీఎస్టీ సర్దుబాట్ల రూపేణా రాష్ట్రం రూ.1,549 కోట్ల ఆదాయం రాబట్టింది. 2024 డిసెంబరు నెలతో పోలిస్తే ఇందులో 8.29% వృద్ధి ఉంది.
తొలి త్రైమాసికంలో తగ్గుదల : పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా రూ.1,448 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకుముందు ఏడాది డిసెంబరుతో నెలతో పోలిస్తే 3.89% వృద్ధి ఉంది. వృత్తి పన్ను వసూళ్లలోనూ 2025 డిసెంబరు చక్కని ఫలితాలు కనబరిచింది. అంతకుముందు ఏడాది డిసెంబరుతో పోలిస్తే 38.32% వృద్ధి నమోదైంది. జీఎస్టీ నికర, స్థూల వసూళ్లలో తొలి త్రైమాసికంలో తగ్గుదల కనిపించగా ఆ పరిస్థితులను తారుమారు చేసి వృద్ధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు కారణమయ్యాయని అధికారులు పేర్కొంటున్నారు.
ఏపీకి తగ్గిన జీఎస్టీ రాబడి - తగ్గడానికి ప్రధాన కారణాలేంటంటే?
జీఎస్టీ 2.0 ప్రభావం : జీఎస్టీ రేట్ల తగ్గింపు జరిగినప్పుడే ప్రజల నుంచే కాకుండా పరిశ్రమ వర్గాల నుంచి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రగతిశీలమైన సంస్కరణల మూలంగా గణనీయమైన మార్పులను చూడబోతున్నామని, ఆర్థిక సంవత్సరం ఊహించిన దానికన్నా మెరుగ్గా ఉంటుందని ఆనాడే వారంతా చెప్పిన సంగతి విదితమే. దాంతో జీఎస్టీ తగ్గింపు వల్ల చేకూరే ప్రయోజనాలన్నిటినీ వినియోగదారులకే అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీని ప్రకారం తమ ఉత్పత్తులపై ధరలు తగ్గిస్తున్నట్లు పలు సంస్థలు గతంలోనే ప్రకటించాయి.
జీఎస్టీ సంస్కరణల ఫలాలు నేరుగా సామాన్యులకు దక్కుతున్న సంగతి తెలిసిందే. తగ్గిన పన్నులకు తోడు పలు పండగ కారణందా రాష్ట్ర వ్యాప్తంగా ఆఫర్లతో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గించారు గతేడాది డిసెంబర్లో. ఒక్కో వస్తువుపైనా 4 వేల నుంచి 8 వేల వరకు రేట్లు తగ్గడంతో ఇదే కొనుగోలుకు మంచి సమయమని భావిస్తూ కొనుగోలుదారులు ఎక్కువ క్రయ విక్రయాలు జరిపినట్లు సంబంధిత అధికారలు తెలుపుతున్నారు.
సూపర్ జీఎస్టీతో సూపర్ సేవింగ్స్ - దిగొచ్చిన ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు

