ETV Bharat / state

శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమలనూ వదలని కల్తీ నెయ్యి

సుమతి ట్రేడర్స్, వినాయక ఏజెన్సీస్‌ సరఫరా చేసింది అంతా వైష్ణవి డెయిరీ నుంచి తెచ్చిన రసాయన మిశ్రమమే - నాణ్యత పరీక్షలు సొంత ల్యాబ్‌లోనే - సిట్‌ అభియోగపత్రంతో వెలుగులోకి

Adulteration Ghee to Srikalahasti, kanipakam, Dwaraka tirumala Temples
Adulteration Ghee to Srikalahasti, kanipakam, Dwaraka tirumala Temples (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 11, 2026 at 7:38 AM IST

4 Min Read
Choose ETV Bharat

Adulteration Ghee to Srikalahasti, Kanipakam, Dwaraka Tirumala Temples: కల్తీ నెయ్యి కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. విచారణలో భాగంగా అప్పటి నేతలు, అధికారుల డొల్లతనం బయటపడుతూనే ఉంది. నిన్నమొన్నటి వరకూ టీటీడీ లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు అభియోగాలున్న సంగతి తెలిసిందే. కానీ తాజాగా రసాయనాల మిశ్రమాన్ని నెయ్యిగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు సరఫరా చేసినట్లు తెలుస్తుంది. దేవాదాయ శాఖ ఆధీనంలోని ప్రధాన ఆలయాలైన శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమల దేవస్థానాలకు కూడా టీటీడీకీ రసాయనాలతో కూడిన కల్తీ నెయ్యిని సరఫరా చేసినవారే అదే నెయ్యిని వాటికీ అందించినట్లు దర్యాప్తులో తేలింది.

వైష్ణవి, భోలేబాబా తదితర డెయిరీ సంస్థలు నెయ్యి పేరిట రసాయనిక మిశ్రమాన్ని టీటీడీకి సరఫరా చేసినట్లు బయటపడ్డ సంగతి తెలిసిందే. అదే మిశ్రమాన్ని సుమతి ట్రేడర్స్‌, వినాయక ఏజెన్సీస్​ రాష్ట్రంలోని పలు ఆలయాలకు అందించినట్లు సిట్‌ అభియోగపత్రంలో స్పష్టంగా పేర్కొంది. శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలకు ఈవోలు 2023-24లో నెయ్యి సప్లై టెండర్లు పిలవగా దాన్ని దక్కించుకున్న సుమతి ట్రేడర్స్ రసాయన మిశ్రమాన్ని సరఫరా చేసింది.​ 2022-24 మధ్య ద్వారకా తిరుమల ఆలయానికి వినాయక ఏజెన్సీస్‌ నెయ్యి సమకూర్చింది. గతంలో కల్తీ నెయ్యితోనే ఈ 3 ప్రధాన ఆలయాల్లోనూ లడ్డూ, ఇతర ప్రసాదాలు తయారు చేసి భక్తులకు అందజేసినట్లు సిట్​ విచారణలో తేలింది.

ఏడాదికి లక్షన్నర కిలోలు : కాణిపాకం, శ్రీకాళహస్తి, ద్వారకా తిరుమల ఆలయాల్లో ఏటా ప్రసాదాలు తయారు చెయ్యడానికి సుమారుగా లక్ష నుంచి లక్షన్నర కేజీల వరకు నెయ్యి వినియోగిస్తారు. కిలోకు రూ.573తో భోలేబాబా ఆర్గానిక్, వైష్ణవి, విజయ, సంగం, నందిని, తిరుమల బ్రాండ్లలో శ్రీకాళహస్తి ఆలయానికి ఏదైనా సరఫరా చేస్తామని పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో సుమతి ట్రేడర్స్‌ కొంత తిరుమల డెయిరీ నెయ్యిని అందించి, వైష్ణవి డెయిరీకి చెందిన నెయ్యినే అధిక మొత్తంలో పంపించింది. కాణిపాకం వరసిద్ధి వినాయక సుమతి ట్రేడర్స్‌ కిలో రూ.555 ధరతో తిరుమల, వైష్ణవి, నందిని, విజయ, డెయిరీల బ్రాండ్‌లలో ఏదైనా నెయ్యి ఆలయానికి సరఫరా చేస్తామని పేర్కొంది. అయితే దాదాపు సంవత్సరంపాటు వైష్ణవి డెయిరీ నెయ్యినే సప్లై చేసింది. ద్వారకా తిరుమల ఆలయానికి 2022లో నెయ్యి సరఫరా టెండరును తిరుపతికి చెందిన వినాయక ఏజెన్సీస్‌ దక్కించుకుంది. వైష్ణవి బ్రాండ్‌ నెయ్యిని కిలో రూ.532 ధరతో అందిస్తామని చెప్పి, అదే అందజేసింది.

ఫిర్యాదులు అందాయి- చర్యలే తీసుకోలేదు: కల్తీ నెయ్యిని గుర్తించిన శ్రీకాళహస్తి ఆలయ పోటు సిబ్బంది అప్పట్లోనే అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. వైష్ణవి డెయిరీ అందించిన నాసిరకం నెయ్యి వేసవిలోనూ గడ్డకట్టేదని, వాసన కూడా ఉండేది కాదని ఇదే అనుభవం కాణిపాకం ఆలయంలోని సిబ్బందికి ఎదురైనట్లు తెలుస్తుంది.

ఇలా విచ్చలవిడిగా సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యతను ప్రభుత్వం రంగ సంస్థలకు చెందిన ల్యాబ్​లతో గానీ మంచి పేరున్న కో ఆపరేటివ్​ డెయిరీల ల్యాబ్​లలో గానీ పరీక్షించాలి. ఆ నివేదికల ప్రకారం నెయ్యి స్వచ్ఛత వివరాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సుమతి ట్రేడర్స్‌ సంస్థ కాణిపాకం, శ్రీకాళహస్తిల ఆలయాలకు నెయ్యి సరఫరా చేసి, వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ల్యాబ్‌లో పరీక్షించిన నివేదికలు సమర్పించింది. అంటే వైష్ణవి డెయిరీ నుంచి నెయ్యిని సేకరించిన సుమతి ట్రేడర్స్‌ అదే డెయిరీకి చెందిన ల్యాబ్‌ రిపోర్ట్‌లను సమర్పించగా అధికారులు వాటినే పరిగణనలోకి తీసుకున్నారు. ఇదే నాణ్యత పరీక్షల్లో డొల్లతనానికి పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది.

రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు

  • శ్రీశైలం
  • శ్రీకాళహస్తి
  • కాణిపాకం
  • విజయవాడ దుర్గగుడి
  • ద్వారకా తిరుమల
  • అన్నవరం
  • సింహాచలం

ఈ ప్రధాన ఆలయాలన్నింటిలో ఏటా దాదాపు 11.61 లక్షల కేజీల నెయ్యిని ప్రసాదాల తయారీలో ఉపయోగిస్తారు. ఇవేకాకుండా రాష్ట్రంలోని మరికొన్ని ముఖ్యమైన ఆలయాలకు 2.13 లక్షలు, చిన్న ఆలయాల అవసరాలకు 88,085 కేజీల నెయ్యి కొనుగోలు జరుగుంది.

మూడేళ్ల క్రితమే నిబంధనలు మార్చేశారు: 2019 మేలో దేవాదాయ కమిషనర్‌ నిబంధనల ప్రకారం ప్రధాన దేవస్థానాలకు కావాల్సిన నెయ్యి, పాలను టెండర్లు లేకుండానే సహకార డెయిరీల నుంచి కొనాలని తెలిపింది. 2022 ఏప్రిల్‌ 25న అప్పటి కమిషనర్‌ ఈ నిబంధనలు మార్చి పాల ఉత్పత్తులు, ఆవు నెయ్యి సరఫరా చేసేందుకు అన్ని డెయిరీలు, రిటైల్‌ సరఫరాదారులు, డీలర్లకు అవకాశమివ్వాలని సూచించింది. దీన్ని అవకాశంగా తీసుకుని సుమతి ట్రేడర్స్‌, వినాయక ఏజెన్సీస్, వంటి సంస్థలు కల్తీ దందా మొదలుపెట్టాయి.

ఇదిలా కొనసాగగా నెయ్యి నాణ్యతపై ఫిర్యాదులు రావడంతో నాణ్యత పరీక్షలు ఖచ్చితంగా చెయ్యాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్‌ 2023 మార్చిలో ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రసిద్ధి చెందిన ల్యాబ్‌లో గానీ ప్రభుత్వ ల్యాబ్స్‌లో గానీ పరీక్షలు చేయించి, ఆ సర్టిఫికెట్‌ను సమర్పించాలని నిబంధన పెట్టింది. ఇక్కడే ‘సుమతి ట్రేడర్స్‌ ప్రసిద్ధి చెందిన ల్యాబ్‌’ అన్న నిబంధనను తమకు అనుకూలంగా మార్చుకుంది. కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాలకు వైష్ణవి డెయిరీ నెయ్యిని సరఫరాచేసి, అదే సంస్థకు చెందిన ల్యాబ్‌ నుంచే నాణ్యత ధ్రువీకరణ పత్రం తీసుకొచ్చి ఇచ్చింది.

సమగ్ర విచారణకు డిమాండ్​: ఇప్పటి వరకూ టీటీడీ లడ్డూలోనే కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని అనుకున్నప్పటికీ ప్రధాన ఆలయాల్లోనూ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు దేవస్థానాలకు నాణ్యతలేని, కల్తీ నెయ్యి సరఫరా అయినట్లు సిట్‌ పేర్కొంది. ఈ అంశంపై దేవాదాయశాఖ మరింత లోతుగా విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే ఆస్కారముంది.

ఏయే సంస్థలు, ఏఏ ఆలయాలకు ఎంత నెయ్యి అందించాయి? వాటి నాణ్యతపై ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా? వాటిపై యంత్రాంగం చర్యలు తీసుకుందా? ఎవరి ప్రమేయంతో కల్తీ నెయ్యి సరఫరా జరిగింది? అధికారులు తెలిసే ఆ నెయ్యి కొనుగోలు చేశారా?’ వంటి పలు అంశాలపై లోతైన విచారణ జరపాలనే డిమాండ్‌ తెరమీదకు వస్తుంది. కోఆపరేటివ్‌ డెయిరీ నెయ్యినే తీసుకోవాలన్న నిబంధనను సడలించి ఇతర రిటైల్‌ వ్యాపారులు, డీలర్లు,డెయిరీలకు అవకాశం ఇవ్వడం వెనుక ఉన్న అసలు కథేంటని తేల్చాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

నెయ్యి కల్తీ నిజమే - కానీ నేరం నాది కాదు: వైవీ సుబ్బారెడ్డి

కొరియా నుంచి మోనోగ్లిజరైడ్స్ - రసాయన మిశ్రమాలతో తయారుచేసిన కల్తీ నెయ్యే టీటీడీకి సరఫరా