శ్రీశైలం దేవస్థానంలోనూ కల్తీ నెయ్యి - నాటి సీఎం వైఎస్ జగన్‌కు ఫిర్యాదు
శ్రీశైలం దేవస్థానానికీ కల్తీ నెయ్యి సరఫరా - ఉల్లంఘనలను అతిక్రమించిన రాజేశ్ కార్పొరేషన్, శ్రీశైలం వ్యవహారంలో నాటి సీఎం జగన్‌కు సైతం అందిన ఫిర్యాదు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 6, 2026 at 10:57 AM IST
Adulterated Ghee Supplied To Srisailam Temple: తిరుమల లడ్డూ వివాదం సద్దుమణగకుండానే మరో వివాదం వెలుగులోనికి వచ్చింది. శ్రీశైలం దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసిన రాజేశ్ కార్పొరేషన్ ఉల్లంఘనలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. సదరు సంస్థ సరఫరా చేసిన నెయ్యితో తయారైన లడ్డూలు నాణ్యంగా లేవని అప్పట్లోనే తీవ్రంగా విమర్శలొచ్చాయి. దీంతోపాటు నెయ్యిని తక్కువ సరఫరా చేసి ఎక్కువ సరఫరా చేసినట్లుగా బిల్లు చేసుకుంటున్నారని కూడా నాటి ఆలయ ఛైర్మన్, వైఎస్సార్సీపీ నేత రెడ్డివారి చక్రపాణిరెడ్డికి ఫిర్యాదులు అందాయి.
ఉండాల్సిన పరిమాణం కన్నా తక్కువ నెయ్యి: దీంతో ఆ సంస్థ సరఫరా చేసిన నెయ్యిని పరిశీలించడానికి ఆయన వెళ్లారు. ఆ పరిశీలనలో డబ్బాల్లో ఉండాల్సిన పరిమాణం కన్నా తక్కువ పరిమాణంలో నెయ్యి ఉందని నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రతి నెయ్యి డబ్బాలో ఉన్న నెయ్యి పరిమాణాన్ని లెక్కించి ఎంత తక్కువగా ఉంటే ఆ నెయ్యి విలువకు సరిపడా చెల్లింపును తగ్గించాలని చక్రపాణిరెడ్డి ఆలయ ఉద్యోగులను ఆదేశించారు. ఆ సంస్థ పాల్పడిన ఉల్లంఘనలు నమోదు చేయాలని కూడా ఆయన సూచించారు. ఆయన సూచన ప్రకారం నాటి ఆలయ సూపరింటెండెంట్ స్థాయి అధికారి రంగస్వామి ఆయా వివరాలన్నీ నమోదు చేశారు.
మాజీ మంత్రి నుంచి తీవ్రమైన ఒత్తిడి: రాజేశ్ కార్పొరేషన్ సంస్థ అక్రమాల వివరాలను రికార్డు చేయవద్దని సూచించినా ఛైర్మన్ ఆదేశాల మేరకు వివరాలను నమోదు చేయడం ఓ మంత్రికి ఆగ్రహం తెప్పించింది. దీంతో సూపరింటెండెంట్‌ను కాణిపాకం బదిలీ చేశారు. అక్కడితో ఆగకుండా కాణిపాకం ఈవోకు ఫోన్ చేసి ఆయన్ను విధుల్లో చేర్చుకోవద్దంటూ అనధికారిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ సూపరింటెండెంట్ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆలయానికి తక్కువ పరిమాణంలో నెయ్యి సరఫరా చేసిన రాజేశ్ కార్పొరేషన్ సంస్థ చివరకు తప్పిదాన్ని సవరించుకోవడానికి ముందుకు వచ్చింది. నిర్ణీత పరిమాణం కన్నా తక్కువగా ఉన్న నెయ్యి డబ్బాలను వెనక్కి తీసుకుని మళ్లీ డబ్బాలను సరఫరా చేయడంతో వివాదం ముగిసింది. నెయ్యి నాణ్యతను తనిఖీ చేసే వ్యవస్థలు ఆలయంలో లేకపోవడంతో ఆ అంశంపై అప్పట్లో దృష్టి పెట్టలేకపోయారు.
అప్పటి ఈవో అండదండలు! రాజేశ్ కార్పొరేషన్‌పై విమర్శలు వస్తుండటం, ఆలయాన్ని మోసం చేయడానికి ప్రయత్నించడంతో ఆ సంస్థను తప్పించాలని చక్రపాణిరెడ్డి బోర్డు మీటింగ్‌లో పట్టుబట్టారు. దీంతోపాటు ఆ సంస్థ ప్రతినిధులు ఆలయానికి ఇస్తున్న సరకుల ధరలు కూడా బయటి మార్కెట్ కన్నా ఎక్కువకు విక్రయించారని ఛైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆ సంస్థకు అప్పటి ఈవో లవన్న అండగా ఉన్నారన్న విమర్శలున్నాయి. ఆ సంస్థ నెయ్యిని తక్కువ ధరకు సరఫరా చేసిన కారణంగా ఆలయానికి సుమారు రూ.80 లక్షల లాభం కలిగినట్లు లవన్న ప్రకటించారు. ఈవోనే ఆ సంస్థను వెనకేసుకురావడంతో ఎవరూ మాట్లాడలేకపోయారు. టెండరు నిబంధనలు కూడా రాజేశ్ కార్పొరేషన్‌కు అనుకూలంగా ఉండేలా రూపొందించారన్న విమర్శలున్నాయి.
అయితే చివరకు రాజేశ్ కార్పొరేషన్ వ్యవహారంపై నేరుగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చక్రపాణిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ సంస్థ పాల్పడుతున్న అక్రమాలను కూడా అందులో ప్రస్తావించారు. వివాదం నానాటికీ తీవ్రమవుతుండడంతో సీఎం కార్యాలయం నుంచి ఏమి ఆదేశాలొచ్చాయోగానీ ఆఖరికి రాజేశ్ కార్పొరేషన్‌ను పక్కకు తప్పించారు.
సిఫారసుల ఆధారంగా చర్యలు: తాము దేవుడి పవిత్రతను కూడా కాపాడలేని అసమర్థులం కాదని, వైఎస్సార్సీపీ దాడి చేసినా దులిపేసుకోవడానికో, పారిపోవడానికో సిద్ధంగా లేమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుమలలో మరోసారి అలాంటి అపచారం జరగకుండా అన్ని చర్యలూ తీసుకుంటామని సీఎం తేల్చిచెప్పారు. కల్తీ నెయ్యి కుంభకోణంలో దోషుల్ని శిక్షిస్తామన్నారు. బాధ్యులైన అధికారులపై పాలనాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిట్ నివేదిక పంపిందని, ఏకసభ్య కమిటీని నియమించి, ఎక్కడెక్కడ లోపాలు జరిగాయో విశ్లేషించి, చర్యలు ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
కల్తీ నెయ్యి తయారీలో మరో ఘోరం - లడ్డూ ప్రసాదంలో టాయిలెట్ క్లీనర్‌లో వాడే లబ్సా కెమికల్స్
క్షమాపణ అడగకుండా ఎదురుదాడి - భగవంతుడి ముందు మోకరిల్లే వరకు వదలం: పవన్‌కల్యాణ్

